Mindfulness Exercises: నేటి మన ప్రపంచంలో మన ప్రమేయం లేకుండా మనల్ని ప్రభావితం చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తిడికి గురవుతూనే ఉంటారు. ఒక్కోసారి మన ఆలోచనలే మనలో ఆందోళనను మరింత పెంచి మనకు సరైన నిద్ర, తిండి లేకుండా చేస్తాయి. కొన్నిసార్లు ఇతరుల చర్యల వలన కూడా మనం ఒత్తిడి, ఆందోళనకు గురికాక తప్పదు. ఈ రకంగా జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ ప్రశాంతత అనేది లేకుండాపోతుంది. నేటి రోజువారీ జీవితంలో ఒత్తిడి, ఆందోళన అనేవి అనివార్యమైపోయాయి. నిద్ర లేచిన దగ్గర్నించీ, తిరిగి నిద్రపోయేంత వరకు ఎన్నో సవాళ్లను మనం ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ ధోరణి మన మానసిక, భావోద్వేగ శ్రేయస్సుపై ప్రభావం చూపి మనల్ని మరింత బలహీనులుగా మార్చవచ్చు. తద్వారా మీ జీవితంలో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కోల్పోవచ్చు.
మరి ఈ పరిస్థితి నుంచి బయటపడే మార్గం లేదా కంటే? కచ్చితంగా ఉంది. ఒత్తిడి, ఆందోళలను తగ్గించడానికి ధ్యానం అనేది ఒక ప్రసిద్ధ మార్గం. ఇక్కడ మీకు కొన్ని బుద్ధిపూర్వకమైన అభ్యాసాలను (Mindfulness Exercises) తెలియజేస్తున్నాము. మీరు తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను ఎదుర్కొంటుంటే కొన్ని నిమిషాల పాటు ఈ ధ్యాన అభ్యాసాలను ఆచరించండి, మీరు వెంటనే ఉపశమనం పొంది ప్రశాంతమైన భావాలను అనుభవిస్తారు.
మనసుతో బాడీ స్కాన్
మీరు ఆందోళనకు గురవుతున్నప్పుడు శరీరం లోపల ఉద్రిక్తతగా వ్యక్తమవుతుంది, కాబట్టి మీ శరీరాన్ని మీ మనసుతో స్కాన్ చేయడానికి ప్రయత్నించండి, ఇది మీ శరీరంలోని ఒత్తిడితో కలిగే బాధ, నొప్పిని విడుదల చేయడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు మీ కళ్ళు మూసుకోండి, కాసేపు అంతా మరిచిపోయి మీ శరీరంపైనే దృష్టి పెట్టండి. మీ కాలి నుండి ప్రారంభించి, మీ తల వరకు నెమ్మదిగా అనుభూతి చెందండి. మీ శరీరంలోని ప్రతి భాగంపై మీ అవగాహనను తీసుకురండి. మీ శరీరంలో ఏ భాగంలోనైనా బిగుతుదనం లేదా అసౌకర్యం ఉన్న ప్రాంతాలను గమనించండి. ఆపైన లోతుగా శ్వాస తీసుకుంటూ, నెమ్మదిగా వదులుతూ ఆయా కండరాలను స్పృహతో విశ్రాంతి కల్పించండి.
విజువలైజేషన్
ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతమైన సానుకూల భావాలను పెంచడానికి విజువలైజేషన్ ఒక శక్తివంతమైన సాధనం. మీలోని ఊహాశక్తిని తట్టి లేపండి. ఏదైనా నిర్మలమైన దృశ్యాన్ని ఊహించుకోండి. ప్రశాంతమైన బీచ్ వద్ద లయబద్ధమైన అలల శబ్దాలు, దట్టమైన పచ్చని అడవి మధ్యలో పిచ్చుకల కిలకిల రావాలు, మేఘావృతమైన ఆకాశంతో వీచే చల్లని పిల్లగాలులు ఇలా ఏదైనా కావచ్చు, మీకు నచ్చే విధంగా కొన్ని నిమిషాల పాటు ప్రకృతిని ఆస్వాదిస్తున్నట్లు ఊహించుకోండి. ఆ సుందరమైన దృశ్యకావ్యాల అనుభూతులు మీకు ప్రశాంతమైన భావాలను కలిగిస్తాయి. మీలోని ఒత్తిడి, ఆందోళనలు మాయమవుతాయి.
కృతజ్ఞతా ధ్యానం
కృతజ్ఞతా భావాన్ని పెంపొందించుకోవడం వల్ల మీ దృష్టిని ఒత్తిడి నుండి దూరంగా జరపడమే కాక, మిమ్మల్ని మీ జీవితంలోని సానుకూల అంశాల వైపు మళ్లించడంలో సహాయపడుతుంది. మీరు జీవితం పట్ల సంతృప్తి, కృతజ్ఞతతో ఉన్న మూడు విషయాల గురించి ఆలోచించంచడి. మీ జీవితం ఎలా ఉన్నప్పటికీ, మీరు గమనిస్తే అందులో కూడా కొన్ని సానుకూల అంశాలు ఉంటాయి. అవి చిన్నవే కావచ్చు. ఉదాహారణకు మీరు మీకు నచ్చిన ప్రదేశంలో జీవిస్తుండటం, మీకు సపోర్ట్ ఇచ్చేవారు మీతో ఉండటం లేదా మీరు మంచి భోజనాన్ని ఆస్వాదిస్తుండటం వంటివి. మీరు ఈ విషయాలను గుర్తుకు తెచ్చుకున్నప్పుడు, అవి మీ జీవితంలో భాగం అయినందుకు కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండండి. ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మీరు శాంతి చెందేలా, సంతృప్తిని పొందేలా అనుభూతిని కలిగిస్తుంది.
సానుకూల దృక్పథం
జీవితంలో ఈరోజు కఠినంగా ఉన్నప్పటికీ రేపనే రోజు ఒకటి వస్తుంది, అది మీ పరిస్థిని మెరుగుపరుస్తుంది అనే ఆశావాదాన్ని కలిగి ఉండాలి. రేపటి అందమైన జీవితం కోసం సానుకూల ఆలోచనలు చేయండి. ఈ విధమైన దృక్పథం మీలోని ప్రతికూల ఆలోచనా విధానాలను పునర్నిర్మించడంలో, మీ జీవితాన్ని మార్చడంలో సహాయపడతాయి. మీలోని శక్తిని నమ్మండి, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా సాగిపోండి.