
New York, SEP 08 : కరోనా మహమ్మారి (COVID) తగ్గుముఖం పట్టిన దాని ప్రతికూల ప్రభావాలు రోగులను కుంగదీస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా లాంగ్ కొవిడ్ బారినపడిన వారిలో ఆత్మహత్య ఆలోచనలు పెరుగుతుండటం ఆందోళన రేకెత్తిస్తోంది. లాంగ్ కొవిడ్‌తో (Long COVID) బాధపడే వారిలో కొందరిని 200 లక్షణాలు పైగా వేధిస్తుండటంతో దీన్ని గుర్తించి చికిత్స అందించడం సంక్లిష్టంగా మారింది. లాంగ్ కొవిడ్ లేదా పోస్ట్ కొవిడ్ (Post COVID) చికిత్సపై తక్షణం ప్రపంచ దేశాలు దృష్టిసారించాలని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తీవ్ర అలసటకు లోనవడం, నొప్పులు, జ్వరం, గుండె దడ వంటి ఎన్నో సమస్యలు లాంగ్ కొవిడ్ బారినపడిన వారిని వెంటాడుతున్నాయని చెబుతున్నారు. వారిలో మానసిక అలజడి చెలరేగి తనువు చాలించాలనే తీవ్ర నిర్ణయాలూ తీసుకుంటున్నారని పేర్కొంటున్నారు. లాంగ్ కొవిడ్ బాధితుల్లో ఆత్మహత్యలపై సరైన డేటా లేదని ప్రపంచ ఆరోగ్య సంస్ధ తెలిపింది.
లాంగ్ కొవిడ్‌కు ఆత్మహత్య (Suicide) ఆలోచనలకు సంబంధం ఉందని తాను చెప్పగలనని, లాంగ్ కొవిడ్ బాధితుల్లో ఆత్మహత్య ముప్పు పొంచిఉందని దీనిపై మనకు అధికార గణాంకాలు మాత్రం లభ్యం కావడం లేదని న్యూయార్క్‌కు చెందిన సైక్రియాట్రిస్ట్ లియో షెర్ చెప్పారు.
మూడ్ డిజార్డర్స్, ఆత్మహత్య స్వభావాలపై ఆయన పరిశోధన చేశారు.లాంగ్ కొవిడ్ బ్రెయిన్‌లో ఇన్‌ఫ్లమేషన్‌కు దారితీస్తుందని పలు అధ్యయనాలు వెల్లడించగా దీంతో భరించలేని నొప్పులు ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయని, ఇది తీవ్రమైన అంశమని అన్నారు.లాంగ్ కొవిడ్ బాధితుల్లో చాలా మంది కొద్ది కాలానికి కోలుకున్నా 15 శాతం మందిలో ఏడాది తర్వాత కూడా లక్షణాలు కనిపిస్తున్నాయి.