Dalit Bandhu: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మక నిర్ణయం, హుజూరాబాద్ నుంచే దళిత బంధు పథకం అమలు, ప్రత్యేకంగా రూ. 2 వేల కోట్ల ప్రభుత్వ నిధుల ఖర్చు
Telangana CM KCR | File Photo

Hyderabad, July 19: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి "తెలంగాణ దళిత బంధు" అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలును ప్రారంభించాలని ఇటీవల జరిగిన అఖిలపక్షంలో నిర్ణయించింన విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ఇందుకోసం కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు.

హుజూరాబాద్ నియోజకవర్గానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఈటల రాజేంధర్‌ను ఓడించటానికి ఎన్నో వ్యూహాత్మక అడుగులు వేస్తున్న  సీఎం కేసీఆర్, అందులో భాగంగానే 'దళిత బంధు పథకం' పైలెట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజవర్గంలోనే అమలుచేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  (ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం)

అయితే, గతంలో అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే కేసీఆర్ ప్రారంభించారని, తెలంగాణ ఉద్యమానికి నాందిగా నిర్వహించిన 'సింహ గర్జన' సభ మొదలకొని, తాను ఎంతగానో అభిమానించే 'రైతు బీమా' పథకం దాకా కరీంనగర్ జిల్లా నుంచే సీఎం ప్రారంభించారని, అదే విధంగా ప్రతిష్టాత్మకమైన 'రైతుబంధు' పథకాన్ని కూడా హుజూరాబాద్ కేంద్రంగానే ప్రారంభించారు. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని కూడా హుజూరాబాద్ నుంచే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఈ పథకం ప్రారంభోత్సవ తేదీని త్వరలో సీఎం ప్రకటించనున్నారు. ఆగష్టు 15 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించిన ప్రకారమే తెలంగాణ దళిత బంధు పథకం 1200 కోట్లతో అమలవుతుందని, అయితే పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినందున హుజూరాబాద్ నియోజకవర్గం మొత్తంగా దళిత బంధు పథకం నిబంధనల ప్రకారం అమలవుతుందని సీఎం అన్నారు. అందుకోసం అధనంగా మరో 1500 నుంచి 2000 కోట్ల రూపాయలను హుజూరాబాద్ లో ఖర్చు చేయనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో విడుదల చేస్తామన్నారు.

పైలట్ నియోజకవర్గంలోని క్షేత్రస్థాయి అనుభవాలను సమీక్షించుకుని, తద్వారా రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేయడం అధికారులకు మరింత సులువవుతుందని సీఎం తెలిపారు. పైలట్ ప్రాజెక్టు అమలు కోసం కలెక్టర్లతో పాటు ఎంపిక చేయబడిన అధికారులు పాల్గొంటారు. వారితో త్వరలోనే వర్క్ షాప్ నిర్వహించనున్నట్టు సీఎం తెలిపారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాలను, వారి స్థితి గతులను ప్రభుత్వం సేకరిస్తుంది. ఆ తర్వాత లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారు కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో (శాచురేషన్ మోడ్ లో) వర్తింప చేస్తారు.

తెలంగాణ దళిత బంధులో మూడు ముఖ్యమైన అంశాలుంటాయని సీఎం పేర్కొన్నారు. అందులో మొదటిది పథకం అమలు చేసి పర్యవేక్షించడం, రెండోది పథకం ఫలితాలను అంచనా కట్టడం, మూడోది లబ్ధిదారులు మరియు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేయడం అనే అంశాలను అవలంభించాలని సీఎం అధికారులకు సూచించారు.

‘‘తెలంగాణ దళిత బంధు’’ పథకం ద్వారా అందించే పది లక్షల నగదుతో పాటు, లబ్ధిదారుడు ప్రభుత్వం భాగస్వామ్యంతో రక్షణ నిధిని ఏర్పాటు చేస్తారు. లబ్ధిదారుల్లో ఆకస్మికంగా ఏదైనా ఆపద వాటిల్లినప్పుడు ఈ రక్షణ నిధిని నుంచి వారికి సహాయం అందుతుంది.

‘‘దళిత బంధు లబ్ధి ద్వారా ఉన్నత స్థితికి చేరిన దళిత కుటుంబం, ఏ పరిస్థితిలోనైనా ఆపదకు గురైనపుడు వారి పరిస్తితి దిగజారకుండా ఈ రక్షణ నిధి ఒక రక్షక కవచంగా నిలుస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి దళితులను తీసుకపోవడానికే దళిత బంధు పథకం ఉద్దేశ్యం’’ అని సీఎం అన్నారు.

తెలంగాణ దళిత బంధు కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలుచేయడానికి, దళితుల అభివృద్ధి కోసం మనసుపెట్టి లీనమై నిబద్ధతతో పనిచేసే అధికార యంత్రాంగం అవసరమని సీఎం స్పష్టం చేశారు. వారు అధికారులుగా కాకుండా సమన్వయకర్తలుగా, కార్యకర్తలుగా భావించి పని చేయాల్సి ఉంటుందన్నారు. అట్లాంటి చిత్తశుద్ధి, దళితుల పట్ల ప్రేమాభిమానాలున్న అధికారులను గుర్తించాలని సీఎం ఉన్నతాధికారులను ఆదేశించారు.