Image used for representational purpose | (Photo Credits: PTI)

Hyderabad, July 9: దక్కన్ పీఠభూమి మీదుగా సముద్రమట్టానికి 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీనపడింది. మరో‌వైపు, బలమైన గాలుల ప్రభావంతో పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఉత్తర కోస్తా ఒడిశా నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు సము‌ద్ర‌మట్టం నుంచి 3.1 కిలో‌మీ‌టర్ల ఎత్తు‌లో ఈ ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. ఇది క్రమంగా బలపడుతూ ఈనెల 11న పశ్చిమ మధ్య, వాయవ్య బంగా‌ళా‌ఖా‌తం‌లోని ఉత్త‌రాంధ్ర, ఒడిశా తీరం దగ్గర అల్ప‌పీ‌డనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ- హైదరాబాద్ కేంద్రం అంచనా వేసింది.  దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇప్పటికే తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు, జలపాతాలు పొంగిపొర్లుతున్నాయి. రాబోయే మూడు రోజుల వరకు కూడా తెలంగాణవ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, అలాగే ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి అంచనా వేసింది.

ఇటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, కాబట్టి వచ్చే మూడు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ అధికారులు హెచ్చరించారు.

దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతాన్ని ఐఎండీ అంచనా వేసింది, అయితే జూలై రెండో వారం నాటికి దేశవ్యాప్తంగా వర్షపాతం లోటు 5 శాతంగా ఉంది. గడిచిన కొన్ని వారాలుగా  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు తమిళనాడు రాష్ట్రాలలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కాగా,  14 ఇతర రాష్ట్రాలు / యూటీలలో సాధారణ వర్షాలు కురిశాయి,  కాగా మరో 17 చోట్ల సాధారణం కంటే తక్కువ వర్షం నమోదైంది. దేశ రాజధాని దిల్లీకి రుతుపవనాలు 13 రోజులు ఆలస్యం కావడంతో జూలై నాటికి దిల్లీలో అత్యధికంగా 56 శాతం వర్షం లోటు ఏర్పడిందని ఐఎండీ తెలిపింది.