The Reserve Bank of India (RBI) |

కార్డుల ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు గత ఏడాది ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ నిబంధనలు (Tokenisation Rules) జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధన అమలుతో మర్చంట్లు కస్టమర్ల కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాల్సి ఉంటుంది. వాటి స్థానంలో ఎన్‌క్రిప్టెడ్‌ టోకెన్‌ రూపంలో మాత్రమే ఆ వివరాలు భద్రపరుచుకునే వీలుంటుంది. సాధారణంగా ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే వినియోగదారులు తరచుగా ఉపయోగించే ఈ-కామర్స్‌ సైట్లు, ఫుడ్‌ డెలివరీ యాప్‌లలో తమ కార్డు వివరాలు స్టోర్‌ చేస్తుంటారు.

తద్వారా ఆ వైబ్‌సైట్‌ లేదా కంపెనీ సర్వర్‌లో కస్టమర్‌ కార్డు వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. ఒకవేళ ఆ సర్వర్‌ హ్యాకింగ్‌కు గురైతే ఆ కార్డు వివరాలు సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది. టోకనైజ్డ్‌ సర్వీసుల ద్వారా ఈ తరహా ముప్పును నివారించవచ్చు. ఎందుకంటే, కార్డు జారీ చేసిన కంపెనీ మాత్రమే టోకెన్‌ను డీక్రిప్ట్‌ చేయగలదు. ఈ విధానంలో ముందుగా కస్టమరు కార్డు వివరాల టోకెన్‌ను క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వినియోగదారుడి కార్డు, టోకెన్‌ కోసం అభ్యర్థించిన సంస్థ (ఉదాహరణకు ఈ-కామర్స్‌ పోర్టల్‌), ఉపయోగిస్తున్న డివైజ్‌ (ఉదాహరణకు మొబైల్‌) ఆధారంగా కార్డు కంపెనీ వినూత్న టోకెన్‌ను (New debit card, credit card tokenisation) జారీ చేస్తుంది.

క్రెడిట్ కార్డు మినిమం అమౌంట్ కడితే ఏమవుతుంది, దాని వల్ల మీరు ఎంత డబ్బు వడ్డీ రూపంలో లాస్ అవుతారు

ఈ టోకెన్‌లోనే కార్డు వివరాలు ఎన్‌క్రిప్ట్‌ చేసి ఉంటా యి. కాబట్టి కస్టమర్లు ఒక టోకెన్‌తో ఒక వేదిక (ఈ-కామర్స్‌ సైట్‌, ఫుడ్‌ డెలివరీ యాప్‌) నుంచి పలుమార్లు చెల్లింపులు జరిపే వీలుంటుంది. అయితే, కార్డు టోకెనైజేషన్‌ తప్పనిసరేం కాదు. కస్టమర్‌ సమ్మతితోనే మర్చంట్‌ తన సర్వర్లో ఎన్‌క్రిప్టెడ్‌ టోకెన్‌ను నిక్షిప్తం చేసుకునేందుకు వీలుంటుంది. కార్డు వివరాల టోకనైజేషన్‌ వద్దనుకున్న పక్షంలో కస్టమరు ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపే ప్రతిసారి తన కార్డుకు సంబంధించిన పూర్తి వివరాలు (పేరు, కార్డు నంబరు, వాలిడిటీ, సీవీవీ) ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది.