దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగిపోతూనే వస్తోంది. చాలా మంది ఆన్‌లైన్ లేదా ఆఫ్ లైన్ షాపింగ్ చేయాలన్నా, రెస్టారెంటు బిల్లు చెల్లించాలన్నా, లేదంటే ఇతర చెల్లింపులకు చాలా మంది క్రెడిట్ కార్డులను వినియోగిస్తూ ఉంటారు. ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే వంటి వాటికి క్రెడిట్ కార్డులను యాడ్ చేసుకొని చెల్లింపులు చేయొచ్చు.
క్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన తర్వాత కచ్చితంగా నెల చివరిలో క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే కొంత మంది మినిమమ్ బ్యాలెన్స్ ( Minimum Amount Due in Credit Card) కూడా చెల్లిస్తూ ఉంటారు. లేదంటే మరి కొంత మంది పూర్తిగా కాకుండా బిల్లు మొత్తంలో వారి వద్ద ఎంత డబ్బు ఉంటే అంత వరకు చెల్లిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయి.
క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్ నిర్ణీత తేదీలో జనరేట్ అవుతుంది. స్టేట్‌మెంట్‌పై ఉండే గడువు తేదీలోపు బకాయి మొత్తాన్ని చెల్లించమని కార్డ్ హోల్డర్‌ను కంపెనీ కోరుతుంది. అయితే బిల్ పేమెంట్ విషయంలో కార్డ్ హోల్డర్లకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి.
1. బిల్లు పూర్తిగా చెల్లించడం
2. చెల్లించాల్సిన బకాయిలో ఎంతో కొంత మొత్తాన్ని చెల్లించడం
3. బకాయిల్లో కనీసం 5 శాతం చెల్లించడం
అయితే మినిమమ్ బ్యాలెన్స్ (Credit Card Minimum Due) చెల్లించడం వల్ల ఆలస్య రుసుము నుంచి మాత్రమే తప్పించుకోవచ్చు. మీరు డ్యూ డేట్ దాటినా తర్వాత కూడా డబ్బులు కట్టకపోతే అప్పుడు ఆలస్య రుసుము పడుతుంది. తదుపరి నెల క్రెడిట్ కార్డు బిల్లులో చెల్లించని మొత్తంతో పాటు చెల్లించాల్సిన వడ్డీ కూడా కలుపుకొని వస్తుంది. మినిమమ్ బ్యాలెన్స్ చెల్లిస్తే.. అప్పుడు రెండు ఇబ్బందులు ఉంటాయి. ఔట్‌స్టాండింగ్ అమౌంట్‌పై వడ్డీ పడుతుంది. ఇది తదుపరి నెలకు రోల్ఔట్ అవుతుంది. ఇలా మినిమమ్ బ్యాలెన్స్ కడుతూపోతే మీరు రుణ ఊబిలో కూరుకుపోయే అవకాశం ఉంది.
మీరు బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించకపోవడం వల్ల 45 రోజుల వడ్డీ రహిత బెనిఫిట్ కోల్పోతారు. మీరు చేసే ప్రతి కొత్త కొనుగోలుకు మీరు పూర్తిగా బిల్లు మొత్తం చెల్లించేంత వరకు వడ్డీ పడుతూనే వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు జారీ సంస్థలు కూడా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలియజేస్తూ వస్తాయి. మినిమమ్ బ్యాలెన్స్ చెల్లిస్తూ రావడం వల్ల వడ్డీ భారం పెరుగుతూ వస్తుందని పేర్కొంటాయి. అందుకే కఠినమైన ఇబ్బందులు ఉంటే మాత్రం తప్ప ఎప్పటికీ కూడా మినిమమ్ బ్యాలెన్స్ ఆప్షన్‌ను ఉపయోగించుకోవద్దు. దీని వల్ల క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం పడొచ్చు. అందువల్ల మీరు మినిమమ్ బ్యాలెన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత త్వరగా బిల్లు మొత్తాన్ని తీర్చేయడం ఉత్తమం.
ఇక మినిమం బిల్లు చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకునే సందర్భంలో క్రెడిట్ కార్డ్ హోల్డర్లు పూర్తి నిబంధనలు తెలుసుకోవాలని గతంలో ఆర్బీఐ కూడా హెచ్చరించింది. మినిమం బిల్లు చెల్లించే సందర్భంలో వర్తించే వడ్డీ, లేట్ ఫీజు, ఇతర ఛార్జీలు, సంబంధిత నిబంధనలు కార్డు జారీ చేసే సంస్థలు స్పష్టంగా పేర్కోవాలి. క్రెడిట్ కార్డ్‌లకు సంబంధించిన అత్యంత ముఖ్యమైన నిబంధనలు, షరతుల్లో (MITC) కూడా ఈ నియమ, నిబంధనలు ఉంటాయి. మునుపటి నెల బిల్లులో ఏదైనా బ్యాలెన్స్ బకాయి ఉంటే, 'వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి'ని (Interest-free credit period)నిలిపివేస్తామని వీటిలో స్పష్టంగా ఉంటుంది. అందువల్ల కార్డ్ హోల్డర్లకు తీవ్రమైన నిధుల కొతర ఉంటేనే ఈ మినిమం బిల్లు చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.