Hyderabad, June 23: హైదరాబాద్ లో లోన్ యాప్స్ కేసుల్లో (Loan App) కొత్త కోణం వెలుగు చూసింది. లోన్ కోసం రిక్వెస్ట్ (Loan Request) పెట్టకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ అవుతుంది. డబ్బులు చెల్లించాలంటూ కీచకులు వేధిస్తున్నారు. ఏడు రోజుల్లో డబ్బులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ఫొటో మార్ఫింగ్ లు చేసి వేధిస్తున్నారు. పైగా తిడుతున్నారు. జంట నగరాల్లో వందల లోన్ యాప్ కేసులు నమోదయ్యాయి. అనుమతి లేకుండా తమ అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని బాధితులు అంటున్నారు. అడక్కపోయినా అకౌంట్లలో డబ్బులు వేస్తున్నారని సీసీఎస్ లో (CCS) ఫిర్యాదు చేశారు. ముఠా నేరుగా యాప్ డౌన్ లోడ్ లింక్స్ (App download links) పంపుతోంది. చైనా నుంచి ముగ్గురు ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. కాల్ సెంటర్లు లేకుండా వర్క్ ఫ్రమ్ హోం ద్వారా ముఠా నిర్వహిస్తున్నారు. గూగుల్ ట్రాన్స్ లేషన్ ద్వారా భాష తెలుసుకుని కేటుగాళ్లలు బెదిరింపులకు పాల్పడుతున్నారు.
లోన్ యాప్ (Loan App) నిర్వాహకుల వేధింపులను ఎదుర్కొంటూ గత కొన్ని నెలలుగా పలువురు వ్యక్తులు సహాయం కోసం హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ రుణం తీసుకొని కొన్ని వాయిదాలు లోన్ చెల్లించింది. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో లోన్ తిరిగి చెల్లించడంలో విఫలమైంది. ఈ క్రమంలో రుణాల వసూళ్ల పేరుతో యువతి ఫోన్ కు వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన మెసేజ్ లతో, ఆమె ఫోటోలను నగ్న ఫోటోలుగా మార్ఫ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు అసభ్య మెసేజ్లతో వేధింపులకు పాల్పడుతున్న బీహార్‌కు చెందిన మనీష్ కుమార్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. సీడీఆర్ విశ్లేషణ ఆధారంగా పోలీసులు మనీష్ కుమార్ అసభ్యకరమైన మెసేజ్ లు పంపుతున్నట్టు నిర్ధారణ చేసుకున్న తర్వాత బీహార్ రాష్ట్రంలో ఉన్న అతనిని అరెస్టు చేశారు.
ఇక ఇన్స్టంట్ లోన్ యాప్‌ల (Instant Loan App) విషయానికి వస్తే, ఈ యాప్ లు అధిక వడ్డీ రేట్లు మరియు ప్రాసెసింగ్ రుసుములతో సులభంగా మరియు నిమిషాల్లో లోన్‌లను అందించడం ద్వారా ప్రజలను ఆకర్షిస్తాయి. అయితే ఎవరైనా లోన్ తిరిగి చెల్లించ లేకపోతే రికవరీ పద్ధతులు దారుణంగా ఉంటాయి. డబ్బు తీసుకున్న వ్యక్తి యొక్క కాంటాక్ట్ లిస్ట్‌లోని వ్యక్తులకు మెసేజ్లు పంపడం, కాల్ చేయడం, ఫోటోలు మార్ఫింగ్ చేయడం వంటి దారుణాలకు లోన్ యాప్స్ నిర్వాహకులు తెగబడుతున్నారు.