Sriharikota, February 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఈ ఏడాది తొలి విజయాన్ని (ISRO's First Launch in 2022) అందుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్ ప్రయోగం (PSLV-C52 Successfully Launches Earth Observation) విజయవంతమయింది. లక్ష్యం దిశగా దూసుకెళ్లిన సీ52 రాకెట్ మూడు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈఓఎస్–04, ఐఎన్‌ఎస్-2టీడీ, ఇన్‌స్పైర్ శాట్-1తో (EOS-04 And 2 Small Satellites) పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది.
సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలకు ఇస్రో చైర్మన్ సోమనాథన్ అభినందనలు తెలిపారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, పీఎస్‌ఎల్‌వీ-సీ52 రాకెట్ ప్రయోగం విజయవంతం అయిందని చెప్పారు. మూడు ఉపగ్రహాలను విజయంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టామని వెల్లడించారు. పీఎస్‌ఎల్‌వీ–సీ52 రాకెట్ 1710 కిలోల ఆర్బిట్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఈఓఎస్–04, 17.50 కిలోల ఐఎన్‌ఎస్-2డీటీ, 8.10 కిలోల బరువున్న ఇన్‌స్పైర్‌శాట్-1 ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఈఓఎస్ అనేది రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని వ్యవసాయం, అటవీ సంరక్షణ, నేల తేమ, హైడ్రాలజీ, వరదల మ్యాపింగ్‌కు సంబంధించి అన్ని వాతావరణ పరిస్థితుల్లో హైక్వాలిటీ ఫొటోలను అందించేలా రూపొందించారు. ఐఎన్‌ఎస్-2డీ ఉపగ్రహాన్ని భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించాయి.
కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే..
►వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్‌ఐశాట్-1 ఉపగ్రహం
►భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్‌ఎస్-2టీడీ
►భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఐఎన్‌ఎస్-2టీడీ ఉపగ్రహం
►భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్‌స్పైర్ శాట్-1 ఉపగ్రహం