File image of Xi Jinping and PM Modi | (Photo Credits: PTI)

New Delhi : అక్టోబర్ 11-12 తేదీలలో చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ (Xi Jinping)  భారత్ లో పర్యటించనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తో ఆయన 'అనధికారికంగా' భేటీ కానున్నారు. తమిళనాడు తీరప్రాంతంలో గల మామల్లపురం (మహబలిపురం)లోని ఓ చారిత్రక కట్టడం వీరి భేటీకి వేదిక కాబోతుంది. ఇరుదేశాలకు సంబంధించిన వాణిజ్యం, రక్షణ మరియు శాంతి భద్రతలకు సంబంధించి వీరి మధ్య ప్రధానంగా చర్చ ఉండబోతున్నట్లు సమాచారం. జమ్మూకాశ్మీర్ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటుగా కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ (S.Jayashankar) మరియు జాతీయ భద్రతాసలహాదారు అజిత్ దోవల్ (NSA Ajit Doval) పాల్గొంటారని తెలుస్తుంది. అటు చైనా అధ్యక్షుడు కూడా తనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యి (Wang Yi) మరియు చైనా హైపవర్ పొలిట్ బ్యూరో మెంబర్ యాంగ్ జీషి (Yang Jieche) లను వెంట తెచ్చుకోబోతున్నారు.

ఇది అనధికార భేటీ కావడం వలన ఈ భేటీ అనంతరం ఇరు దేశాలకు చెందిన అగ్రనేతలు వేరువేరుగా తమ భేటీకి సంబంధించిన ప్రకటనలు వెలువరించే అవకాశం ఉంది. లేదా భారత ప్రధాని ఒక్కరే భేటీకి సంబంధించిన విషయాలు వెల్లడించనున్నట్లు సమాచారం.  కాగా, జిన్‌పింగ్ భారత్ లో పర్యటించబోతున్నట్లు తెలిసే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందుగానే ఆయనను చైనాలోని బీజింగ్ లో కలిశారు. భారత్ లో  జమ్మూకాశ్మీర్ అంశాన్ని ప్రస్తావించాలని కోరినట్లుగా తెలుస్తుంది. వీరి భేటీ అనంతరం భారత పర్యటనకు ముందు, జిన్‌పింగ్ చైనాలో మాట్లాడుతూ తాను కాశ్మీర్ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు బుధవారం అన్నారు.

చైనా న్యూస్ ఏజెన్సీ కథనం ప్రకారం "అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత పర్యటన నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆయనను బీజింగ్‌లో కలిసి జమ్మూ కాశ్మీర్ పరిస్థితిని విశదీకరించారు. పాకిస్తాన్ ప్రధాని ఆందోళనలను విన్న తరువాత, అధ్యక్షుడు జిన్‌పింగ్ తన పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ వద్ద వీటిని ప్రస్తావిస్తానని ఇమ్రాన్ ఖాన్ కు హామి ఇచ్చారు. అయితే ఇరు దేశాలు ఈ వివాదాన్ని శాంతియుత సంభాషణల ద్వారా పరిష్కరించుకోవాలని అభిప్రాయపడ్డారు". అని తెలిపింది.

అయితే ఈ విషయం తెలుసుకున్న భారత విదేశాంగ శాఖ (MEA - Ministry of External Affairs) చైనా అధ్యక్షుడి పర్యటనకు ముందే, "జమ్మూకాశ్మీర్ భారత అంతర్గత వ్యవహారం, ఇందులో ఏ దేశ జోక్యాన్ని అంగీకరించబోము,  చైనాకు కూడా ఆ విషయం బాగా తెలుసు" అని  ఇరు దేశాలకు ఇండెరెక్ట్ గా గట్టి కౌంటర్ ఇచ్చింది.

Update by ANI:

కాగా, ఆర్టికల్ 370 రద్దు తర్వాత పాకిస్థాన్ ప్రవర్తిస్తున్న తీరు తెలిసిందే. భారత్ తో శత్రుత్వాన్ని మరింతగా పెంచుకుంటూ దేశాల మద్ధతు కోసం అన్ని దేశాలను రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. ఇకపై భారత్ తో ఎలాంటి చర్చలు ఉండవు అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చిచెప్పారు. అయినప్పటికీ, ఇతర దేశాల మధ్యవర్తిత్వం కోసం పాకులాడటం గమనార్హం. మొన్నటివరకు ట్రంప్ ను మధ్యవర్తిత్వం వహించాలని కోరిన ఇమ్రాన్, ఇప్పుడు తమకు తమకు మద్ధతిచ్చే చైనా ద్వారా ఆ ప్రయత్నాలు చేస్తుంది. అయితే చైనా అధ్యక్షుడు భారతదేశానికి వచ్చి కాశ్మీర్ అంశంపై ఏమి మాట్లాడకపోవచ్చు. ఆయన ముఖ్యంగా వ్యాపారం, సరిహద్దు వద్ద ఇండో- చైనా సైనికుల మధ్య శాంతిపూర్వక వాతావరణంపై చర్చలు జరపనున్నారు. అనధికార భేటీ కావడం వల్ల తమ చర్చలకు సంబంధించి పూర్తి విషయాలు బయటకు వెళ్లడించకపోవచ్చు. భారత్ పర్యటన ముగిసిన తర్వాత జిన్‌పింగ్ నేపాల్ లో పర్యటించనున్నారు.