Ayodhya to Rafale, the 6 major verdicts CJI Gogoi will have to deliver in less than 10 days (Photo-PTI)

New Delhi, November 8: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ (Chief Justice of India Ranjan Gogoi ) పదవీవిరమణ పొందేందుకు మరికొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ లోగా ఆయన పలు కీలక కేసుల్లో తీర్పు ఇవ్వనున్నారు. అయోధ్య, వివాదం కేసు, రాఫెల్ కేసులతో పాటు మరికొన్ని కేసుల్లో చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తీర్పు ఇవ్వనున్నారు.నవంబర్ 17న సుప్రీం కోర్టు (Supreme Court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ కాబోతున్నారు. అయితే ఆయన పదవీ విరమణకు మిగిలి ఉన్న ఈ పది రోజుల్లో సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం అత్యంత కీలకమైన తీర్పులిచ్చే అవకాశముంది.

అందులో యావత్‌ భారత దేశం కొన్ని దశాబ్దాలుగా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న రామజన్మభూమి–బాబ్రీ మసీదు కేసు కీలకమైనదిగా చెప్పవచ్చు. దీంతోపాటు రాజకీయపరమైన, రక్షణకు సంబంధించిన, ఆర్థికపరమైన కేసుల్లో ధర్మాసనం తీర్పులను ఆవిష్కరించబోతోంది.

జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌( Ranjan Gogoi) ఇప్పటికే ఎన్నో కేసుల్లో సంచలన తీర్పులు ఇచ్చారు. ముస్లిం మహిళల స్వేచ్ఛను హరించి వేస్తోన్న ట్రిపుల్‌ తలాక్‌ రద్దు మొదలుకొని సామాజిక అసమానతలు వేళ్లూనుకొన్న అనేక అంశాల్లో ఆయన సంచలన తీర్పులు ఇచ్చారు.  ఆయన తీర్పు ఇవ్వబోతున్న 6 కేసులు వివరాలను ఓ సారి పరిశీలిస్తే...

రామజన్మభూమి–బాబ్రీ మసీదు (Ayodhya verdict)

దేశంలో దశాబ్దాలుగా ఈ సమస్య నలుగుతూనే ఉంది. ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా ఎన్నో ఉద్రిక్తతలు, మరెన్నో భావోద్వేగాలు పుడుతూనే ఉన్నాయి. ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసిన రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై తుది తీర్పు ఈ నెల 17న వెలువడనుంది. 70 ఏళ్ళుగా వివాదాలు రాజేస్తున్న ఈ కేసులో జస్టిస్‌ గొగోయ్‌ సారథ్యంలోని బెంచ్‌ ఈ కీలక తీర్పుని వెలువరించనుంది. కాగా 2010లో అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ హిందు, ముస్లిం వర్గాలు దాఖలు అప్పీలు చేశాయి. దీనిపై సుప్రీంకోర్టులో 40 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు వినిపించాయి.

అయోధ్యలో భద్రత కట్టుదిట్టం

శబరిమలలోకి మహిళల ప్రవేశం (Sabarimala review)

ఆ మధ్య ఈ విషయం ఎన్నో భావోద్వేగాలకు తెరలేపింది. ఈ తీర్పు కూడా రిజర్వ్ లో ఉంది. వయోపరిమితులకు అతీతంగా మహిళలందరినీ శబరిమల ఆలయంలోకి అనుమతించే అంశంలో రివ్యూ పిటిషన్‌పై తుదితీర్పును సైతం చీఫ్‌ జస్టిస్‌ గొగోయ్‌ రిజర్వులో ఉంచారు. 2018 నాటి తీర్పును జస్టిస్‌ గొగోయ్‌ సారథ్యంలోని ధర్మాసనం కొనసాగిస్తుందా? లేదా అన్నది ఈ వారంలో తేలిపోనుంది.

రఫేల్‌ ఒప్పందం (Rafale review)

ఈ కేసుపై తీర్పును కూడా సుప్రీంకోర్టు రిజర్వ్‌లో పెట్టింది.36 యుద్దవిమానాల అవినీతి ఒప్పందానికి సంబంధించి పిటిషనర్లు గత ఏడాది అక్టోబర్‌లో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంలో సీబీఐ ఎందుకు విఫలమైందనే దానిపై ఇప్పుడు వివాదం నడుస్తోంది. ఇది కూడా ఈ వారంలో తేలిపోనుంది.

చౌకీదార్‌ చోర్‌హై వివాదం (Contempt case against Rahul Gandhi)

మే 10న రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)పై బీజేపీ నాయకురాలు మీనాక్షి లేఖీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును కూడా సీజేఐ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం రిజర్వులో ఉంచింది. ఈ కేసులో చౌకీదార్‌ చోర్‌హై అనే పదబంధాన్ని తప్పుగా ఆపాదించినందుకు కోర్టుకి రాహుల్‌ గాంధీ బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఈ కేసులో తుది తీర్పు ఇదే వారంలో వెలువడనుంది.

ఆర్థిక చట్టం రాజ్యాంగ బద్దత (Constitutional validity of Finance Act 2017 passed as money bill)

2017 ఆర్థిక చట్టం (Finance Act 2017) యొక్క రాజ్యాంగబద్దమైన ప్రామాణికతను సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌పై అంతిమ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. ఈ వివాదంపై సైతం గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తుది తీర్పుఈ వారం వచ్చే అవకాశం ఉంది.

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం (Whether office of CJI should come under RTI)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు (RTI) చట్టం పరిధిలోకి వస్తుందా లేదా అన్న అంశంపై దాఖలైన పిటిషన్‌ ను కూడా సుప్రీంకోర్టు రిజర్వులో పెట్టింది. సమాచార హక్కు చట్టం(Right To Information Act) 2005, సెక్షన్‌ 2(హెచ్‌) ప్రకారం చీఫ్‌ జస్టిస్‌ కార్యాలయం ఆర్టీఐ పరిధిలోకి వస్తుందంటూ 2010, జనవరిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ తీర్పు కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉంది.