New Delhi, Sep 27: కేంద్ర ప్రభుత్వ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్‌ను (Ayushman Bharat Digital Mission) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుఖ్ మాండవీయ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ‘ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టనున్నామని గత ఏడాది ఆగస్టు 15 న ఎర్రకోట నుండి ప్రధాన మంత్రి ప్రకటించిన సంగతి విదితమే. ఈ కార్యక్రమాన్ని పైలట్ దశలో భాగంగా ఆరు కేంద్రపాలిత ప్రాంతాలు.. అండమాన్ అండ్ నికోబార్, చండీగఢ్, దాద్రా అండ్ నాగర్ హవేలీ, డామన్-డయు, లఢక్, లక్షద్వీప్, పుదుచ్చేరిలో అమలు చేయనున్నారు.
ప్రారంభోత్సవానికి ముందు ఈ కార్యక్రమం గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుఖ్ మాండవీయ తెలియజేస్తూ, 2020 ఆగస్టు 15న ఎర్రకోట నుంచి ప్రధాని ప్రకటించిన ఆయుష్మాన్ డిజిటల్ మిషన్ సోమవారం ప్రారంభం కాబోతుండటం సంతోషంగా ఉందని అన్నారు. ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులను ఈ కార్యక్రమం తీసుకు వస్తుందన్నారు. కాగా, ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ పీఎం-జేఏవై) మూడవ వార్షికోత్సవం రోజునే దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ప్రారంభమవుతుడటం విశేషమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో పేర్కొంది.
ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ కింద దేశంలోని పౌరులందరికీ హెల్త్ ఐడీ (Every Citizen to Have Digital Health ID Now) అందిస్తారు. హెల్త్ అకౌంట్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని ఆధారంగా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని అందులో పొందుపరుస్తారు. దీంతో ఎవరైనా భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడి చికిత్స అందించాల్సి వచ్చినా, మెడిసిన్స్ తీసుకోవాల్సి వచ్చినా ఈ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ ఉపయోగపడుతుంది. ఏదైనా ఆసుపత్రికి వెళ్లినప్పుడు తమ హెల్త్ ఐడీ నమోదు చేయగానే ఆటోమేటిక్‌గా ఆ రోగి పూర్తి ఆరోగ్య సమాచారం డాక్టర్లకు కనిపిస్తుంది. కొత్త పరీక్షలు చేయాల్సి వస్తే ఆ వివరాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది. ''పౌరులు ఇక నుంచి ఒక క్లిక్‌తో హెల్త్ కేర్ సౌకర్యం పొందగలుగుతారు'' అని పీఎంఓ ఆ ప్రకటనలో పేర్కొంది.