Black Fungus: బ్లాక్ ఫంగస్‌ను అంటు వ్యాధుల జాబితాలో చేర్చాలని రాష్ట్రాలకు సూచించిన కేంద్రం, ఇప్పటికే నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించిన తెలంగాణ; బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఇలా ఉండొచ్చు
Fungal infection mucormycosis | Representational Image (Photo Credits: Pixabay)

Hyderabad, May 20: కరోనా సోకడమే కాదు, కరోనా నుంచి కోలుకోవడం కూడా ఇప్పుడు భయాందోళనలకు గురిచేస్తుంది. కరోనా నుంచి కోలుకున్న వారికి బ్లాక్ ఫంగస్ రూపంలో మరొక వ్యాధి సోకడం ఇప్పుడు సమస్యగా తయారైంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వందల కొద్దీ బ్లాక్ ఫంగస్ కేసులు వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్రలో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ బారినపడి సుమారు వంద మంది మృతి చెందారు. రాజస్థాన్, తెలంగాణ మరియు తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తాజాగా బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధుల జాబితాలో చేర్చాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కూడా బ్లాక్ ఫంగస్‌ను ఎపిడెమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం నోటిఫైడ్ వ్యాధిగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి కొత్తగా మార్గదర్శకాలు జారీ చేసింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు గురువారం రాసిన లేఖలో బ్లాక్ ఫంగస్ లేదా మ్యూకోమైకోసిస్ ఒక అంటువ్యాధిగా ప్రకటించాలని అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. అరుదైన లేదా ప్రాణాంతక సంక్రమణకు చెందిన "అంటువ్యాధుల వ్యాధుల చట్టం" క్రింద జాబితా చేయమని ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను కోరింది.

దీని ప్రకారం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు, రోగ నిర్ధారణ స్క్రీనింగ్ సెంటర్లు ఈ మ్యూకోమైకోసిస్ చికిత్సకు సంబంధించి కేంద్ర మార్గదర్శకాలను పాటించాలి. మ్యూకోమైకోసిస్ అని ధృవీకరించబడిన లేదా లక్షణాలు కలిగిన కేసుల యొక్క డేటాను రాష్ట్రాలు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు నివేదించాలని స్పష్టం చేశారు.

అంతకుముందు, తెలంగాణ ప్రభుత్వం కూడా బ్లాక్ ఫంగస్‌పై గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిని నొటిఫైడ్ వ్యాధిగా ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా బ్లాక్ ఫంగస్ లక్షణాలు కలిగిన బాధితుల సమాచారాన్ని  వైద్య, ఆరోగ్య విభాగానికి అందించాలని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను ఆదేశించింది. బ్లాక్ ఫంగస్ కేసులపై రోజువారీ నివేదికలను సమర్పించాలని రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్ శ్రీనివాస రావు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులను ఆదేశించారు.

ఇలాంటి లక్షణాలు ఉంటే బ్లాక్ ఫంగస్ అయి ఉంటుంది

ఈ బ్లాక్ ఫంగస్ కు చెందిన శిలీంద్ర కణాలు వాతావరణంలో ఉంటాయి. ఇవి చర్మంపై ఏవైనా తెగిన లేదా కాలిన లేదా మరేదైనా గాయం నుంచి శరీరంలోకి ప్రవేశిస్తాయి. అనంతరం శరీరం లోపల మరియు చర్మంపైన కూడా ఇది అభివృద్ధి చెందుతుంది.

కరోనా తీవ్రంగా ఉన్న వారిలో, కరోనా నుంచి కోలుకున్న వారికి, షుగర్ వ్యాధి అదుపులో లేని వారికి , దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడేవారికి, స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకునే వారికి మరియు క్యాన్సర్ చికిత్స తీసుకున్న వారికి ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి ముప్పు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ముక్కు నుంచి నల్లటి స్రావాలు కారడం, కళ్లు ఎర్రబడుతూ వాపు రావడం, దృష్టి మందగించడం, ముఖంలో మార్పులు తిమ్మిరిగా అనిపించడం, దంతాలు వదులుగా అవడం, నోటిలో వాపు నల్లటి పొరలాగా ఏర్పడటం లాంటివి బ్లాక్ ఫంగస్ లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ENT ఆసుపత్రులను సందర్శించి తదనుగుణంగా వైద్యం తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.