New Delhi, July 14: దేశంలో కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 9 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవగా, 23వేల మంది ప్రాణాలు విడిచారు. దీంతో భారత్‌లో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్(Community transmission) నడుస్తోందని చాలామంది భావిస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సైతం ఈ దశలోకి మనం అడుగుపెట్టామని వాదిస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలను మంగళవారం కేంద్ర ఆరోగ్య మంత్రి డా.హర్షవర్దన్ (Health Minister Harsh Vardhan) కొట్టిపారేశారు. దేశంలో 24 గంటల్లో 28,498 కొత్త కేసులు, 540 మరణాలు, 9,07,645కు చేరుకున్న కోవిడ్-19 కేసులు, కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 5,71,460 మంది
మన దేశం ఇంకా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోలేదని ఆయన స్పష్టం చేశారు. ధారావి, ముంబై వంటి వంటి ప్రదేశాల్లో స్థానిక సంక్రమణ ప్రారంభమైనప్పటికీ దాన్ని సమర్థవంతంగా నియంత్రించామని తెలిపారు. ముఖ్యంగా దేశంలో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ రికవరీ రేటు దాదాపు 60 శాతంగా ఉండటం సానుకూల అంశంగా పేర్కొన్నారు. మరణాల్లోనూ ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల సంఖ్య తక్కువగానే ఉందన్నారు. ఈ మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అభివృద్ధికి సమయం పడుతుందని, కానీ అందుకు నెల, సంవత్సరమా అన్న విషయం ఎవరూ చెప్పలేరన్నారు.
కాగా కోవ్యాక్సిన్‌ను ఆగస్టు 15 నాటికి అందరికీ అందుబాటులోకి తెస్తామని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ప్రకటన జారీ చేసి నాలుక్కరుచుకున్న విషయం తెలిసిందే. దీనిపై అనేక విమర్శలు, అభ్యంతరాలు వెల్లువెత్తడటంతో అత్యంత వేగవంతంగా వ్యాక్సిన్ తీసుకురావడమే లక్ష్యమని స్పష్టం చేసింది. (డబ్ల్యూహెచ్‌ఓలో కీలక బాధ్యతలు చేపట్టిన భారత్)
కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అంటే ఏమిటి ?
దీనికి ప్రత్యేక నిర్వచనం అంటూ ఏదీ లేదు. అయితే దీన్ని వైరస్ వ్యాప్తి మూడో దశగా పిలుస్తారు. కరోనా ఉన్న వ్యక్తితో కాంటాక్ట్ అవకపోయినా, లేదా వైరస్ ప్రబలిన ప్రాంతానికి వెళ్లకపోయినా కరోనా సోకడాన్ని కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌గా పిలుచుకుంటున్నాం. అంటే ఇది సమాజంలో స్వేచ్ఛగా వ్యాపిస్తుంది. ఇలాంటి సంక్రమణను గుర్తించి, నియంత్రించడం ప్రభుత్వాలకు కష్టతరమవుతుంది