Mumbai, March 8: కరోనావైరస్‌పై పోరులో భాగంగా పూర్తిగా స్వదేశంలోనే అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ (Covaxin Vaccine Safe) చాలా సురక్షితమైనదని, వ్యాధినిరోధకతను పెంచుతోందని, ఎలాంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ లేవని లాన్సెట్ తేల్చింది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్ రెండో దశ ఫలితాలను విడుదల చేశారు. అయితే వీటి ద్వారా వ్యాక్సిన్ (COVID-19 Vaccine Update) సామర్థ్యాన్ని అంచనా వేయలేని, దీని కోసం మూడో దశ ఫలితాలు అవసరమని లాన్సెట్ తెలిపింది.
ఇదో గుడ్ న్యూస్ అని అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్‌లోని ఇన్ఫెక్షస్ డిసీజెస్ చీఫ్ ఫహీమ్ యూనస్ ఓ ట్వీట్‌లో అన్నారు. ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2 ట్రయల్స్‌లో వ్యాక్సిన్ మరింత మెరుగైందని లాన్సెట్ స్పష్టం చేసింది. ఇక సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఫిర్యాదు చేసిన వారి సంఖ్య కూడా ఫేజ్ 1తో పోలిస్తే ఫేజ్ 2లో తగ్గిందని తెలిపింది.
ఈ అధ్యయనం 12-18 ఏళ్ల వయసులు, 55-65 ఏళ్ల వయసు వారిపై జరిగిందని, పిల్లల్లో, 65 ఏళ్లు పైబడిన వారిపై ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎలా ఉందో తెలుసుకోవడానికి మరింత అధ్యయనం అవసరమని లాన్సెట్ తెలిపింది. మూడో దశ ట్రయల్స్ ముగియకుండానే గత జనవరిలో కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తన తొలి డోసుగా కొవాగ్జిన్ టీకానే తీసుకున్నారు.
కరోనా వైరస్(Corona virus)నియంత్రణకు వ్యాక్సిన్ కనిపెట్టడంలో భారత్ పాత్ర కీలకంగా మారింది. అమెరికాలోని ప్రముఖ కంపెనీలు ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ,ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌లతో పాటు ఇండియాకు చెందిన రెండు వ్యాక్సిన్లు కీలకంగా మారాయి. ఆక్స్‌ఫర్డ్ (Oxford)సహకారంతో సీరమ్ ఇనిస్టిట్యూట్(Serum Institute) అభివృద్ధి చేసిన కోవిషీల్డ్(Covishield), భారత్ బయోటెక్ సంస్థ(Bharat Biotech) అభివృద్ధి చేసిన కోవ్యాగ్జిన్(Covaxin). ప్రస్తుతం ఇండియాలో రెండవ దశ వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మరోవైపు ఇండియా నుంచి కోవిషీల్డ్ , కోవ్యాగ్జిన్‌లు ప్రపంచదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
ఈ నేపధ్యంలో అమెరికా శాస్త్రవేత్త, బేలర్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ డీన్ డాక్టర్ పీటర్ హోటెజ్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారతదేశం తయారు చేసిన కోవిషీల్డ్(Covishield), కోవ్యాగ్జిన్(Covaxin) లు ప్రపంచవ్యాప్తంగా భారీ ప్రాణనష్టం సంభవించే ప్రమాదం నుంచి కాపాడాయని అన్నారు. డీజీసీఏ (DGCA)అనుమతి పొందిన ఆ రెండు వ్యాక్సిన్ల పనితీరు చాలా మెరుగ్గా ఉందని..అన్ని వయస్సుల వారిపై ఈ వ్యాక్సిన్‌ల పనితీరు సమానంగా ఉందని తెలిపారు. అందుకే ప్రపంచదేశాలన్నీ భారత వ్యాక్సిన్‌ల వైపు మొగ్గు చూపుతున్నాయన్నారు.
వ్యాక్సిన్ తయారీ విషయంలో ఇండియాను తక్కువగా అంచనా వేయవద్దని సూచించారు. కోవిడ్ 19 వ్యాక్సినేషన్(Covid19 vaccination)వెబినార్‌లో ఆయన భారత వ్యాక్సిన్లపై ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సిన్ తయారీలో ఇండియా పాత్రను కీర్తించారు. వ్యాక్సిన్‌ను అందుబాటులో తీసుకొచ్చి ఇండియా ప్రపంచానికి పెద్ద బహుమతే ఇచ్చిందన్నారు. భారత్ వ్యాక్సిన్‌పై అమెరికా శాస్త్రవేత్తలు ప్రశంసించడం విశేషమే.