New Delhi, Mar 9: భారత్‌లో గత 24 గంటల్లో 15,388 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. దేశంలో కొత్తగా నమోదైన కరోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం... 16,596 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,12,44,786కు చేరింది. గడచిన 24 గంటల సమయంలో 77 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,930కు (Covid Deaths) పెరిగింది.
దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,99,394 మంది కోలుకున్నారు. 1,87,462 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 22,27,16,796 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 7,48,525 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ (Corona Vaccine) తీసుకున్న వారి సంఖ్య 2.3 కోట్లు దాటింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని వెల్లడించింది. సోమవారం ఒక్క రోజే సుమారు 20 లక్షల మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త మైలురాయిని చేరుకున్నట్లు ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొన్నది.
ప్రస్తుతం దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో మరోసారి కరోనా కేసులు (Covid New Cases) పెరుగుతున్నాయి. పరిస్థితి చేయి దాటి మరోసారి లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. మహారాష్ట్రలో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇక్కడ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఉన్న కరోనా పేషెంట్ల వివరాలను సేకరించాలని పూషే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భావించారు. దీనికోసం చాలా ల్యాబుల చుట్టూ తిరిగి వివరాలు సేకరిస్తున్నారు.
ఈ క్రమంలో మూడు ల్యాబుల్లో కరోనా పేషెంట్ల వివరాలు పూర్తిగా లేవని తేలింది. దీంతో ఆగ్రహం చెందిన ప్రభుత్వం ఈ మూడు ల్యాబులను సీల్ చేసేసింది. ఇక్కడి మెట్రోపోలిస్ ల్యాబ్స్, సబర్బన్ డయాగ్రోస్టిక్ సెంటర్, కేఆర్ఎస్ఎన్ఏఏ ల్యాబులు కరోనా వచ్చిన పేషెంట్ల అడ్రసులు ఇవ్వలేకపోయాయట. దీంతో కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం కుదరడం లేదని, దీని వల్ల మరిన్ని కరోనా కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని పీఎంసీ అధికారులు అంటున్నారు.
మహారాష్ట్రలో కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తున్నది. ఆదివారం నుంచి సోమవారం వరకు కొత్తగా 8,744 కరోనా కేసులు, 22 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 22,28,471కు, మరణాల సంఖ్య 52,500కు చేరింది. కాగా, గత 24 గంటల్లో 9,068 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 20,77,112కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 97,637 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్యలో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది.
కరోనా వైరస్ మహమ్మారి ముగింపు దగ్గర పడిందని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ చేసిన ప్రకటనల పట్ల భారతీయ వైద్యుల సంఘం (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కరోనా విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వకండి అంటూ ఇటు ప్రభుత్వాన్ని, అటు రాజకీయ నాయకులను హెచ్చరించింది. మహమ్మారి స్థితిపై రాజకీయ కారిడార్లలో చర్య జరుగుతుండటం బాధాకరమని, అయితే దీనిని ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదా ఐసీఎమ్మార్ మాత్రమే శాస్త్రీయ ఆధారాల ద్వారా ధృవీకరించాలి అని ఐఎంఏ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
కొవిడ్-19 కు 740 మంది ఫ్రంట్‌లైన్ కార్మికుల మరణాలను ఎత్తిచూపిన ఐఎంఏ.. మాస్కులు ధరించడం, శారీరకంగా నిర్ణీత దూరం పాటించడం గురించి పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎంఏ విజ్ఞప్తి చేసింది. గత వారంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కేసుల సంఖ్య 35 నుంచి 40 శాతం పెరిగిందని, దేశ రాజధానిలో కూడా రోజువారీ సగటు 100 నుంచి 140 మంది రోగులకు సంఖ్య పెరిగిందని ఐఎంఏ తెలిపింది.