Amaravati, Mar 16: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) మరో మైలురాయిని చేరుకోనుంది. ఇప్పటివరకు 15 ఏండ్లు ఆ పై వయస్కులకు టీకా పంపిణీ ప్రక్రియ కొనసాగతుండగా.. తాజాగా 12-14 ఏండ్ల చిన్నారులకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్‌కు చెందిన ‘బయాలాజికల్-ఈ’ సంస్థ తయారు చేసిన కార్బివాక్స్ టీకాను పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. తొలి డోసు తీసుకున్న 28 రోజుల తర్వాత రెండో డోసు ఇవ్వనున్నారు.
2010 లేదా అంతకన్నా ముందు జన్మించి నేటికి 12 ఏండ్లు పూర్తిచేసుకున్నవాళ్లు టీకా (Covid vaccination for 12-14 age group) తీసుకోవడానికి అర్హులని, వీరంతా వ్యాక్సిన్ కోసం కొవిన్ పోర్టల్‌లో పేరును నమోదు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అయితే 12 సంవత్సరాలు నిండకుండా పేరు నమోదు చేసుకున్నా కూడా టీకా ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. కొవిన్ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొని ఇప్పటికే టీకా తీసుకున్న తల్లిదండ్రుల అకౌంట్ ద్వారా గానీ, లేదా కొత్త అకౌంట్ (స్లాట్) ద్వారా గానీ పేరును నమోదు చేసుకోవచ్చు.
అలాగే టీకా కేంద్రానికి వెళ్లి పేరును నమోదు చేసుకోవచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏండ్ల వయస్సు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు. దీంతో పాటుగా 60 ఏళ్లుదాటిన వారికి బూస్టర్ డోస్ కూడా ఇవ్వనున్నారు. రెండు డోస్‌లు వేసుకున్న ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ వారియర్స్, 60 ఏళ్లు పైబడిన వారికి (precaution dose for 60 plus) బూస్టర్ డోస్ వేసే పనులు కూడా జరుగుతున్నాయి.
కరోనా వ్యాక్సిన్లు వేయడం కారణంగా పిల్లలకు ఎలాంటి ఇబ్బందులూ కలగలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇంతవరకు 15-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలకు 8.91 కోట్ల కొవాగ్జిన్ డోసులు ఇచ్చినట్టు పేర్కొంది. వ్యాక్సిన్ల క్లినికల్ పరీక్షల సమాచారం ఇచ్చేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యంపై విచారణ జరుపుతున్న జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బి.ఆర్.గవాయ్‌లతో కూడిన ధర్మాసనానికి ఈ వివరాలు ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ల కారణంగా 1,739 మంది పిల్లల్లో స్పల్పంగా, 81 మందిలో కొంచం ఎక్కువగా, ఆరుగురిలో తీవ్రమైన దుష్పరిణామాలు కనిపించాయని వివరించింది. శాతాల్లో చూస్తే ఇది చాలా తక్కువని పేర్కొంది.
నిపుణుల సలహాల మేరకే ప్రభుత్వం మైనర్లకు కూడా టీకాలు ఇచ్చిందని, ఇది న్యాయ సమక్ష పరిధిలోకి రాదని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలిపారు. దశలవారీగా టీకాలు ఇస్తూ చివరగా పిల్లలకు వేశామని, అందువల్ల ఎక్కడా పెద్దగా ఇబ్బందులు ఎదురుకాలేదని చెప్పారు. కొన్ని అంశాల్లో గోప్యత పాటించాల్సిన దృష్ట్యా క్లినికల్ పరీక్షల సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నారు.