Covid Death Certificate Rules: కరోనా మరణాలపై కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన కేంద్రం, వైరస్ సోకిన 30 రోజుల్లోగా వ్యక్తి చనిపోతే కోవిడ్ మరణంగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం
Family members wearing PPE kits perform the last rites of a Covid-19 victim in Jammu. (PTI Photo)

New Delhi, Sep 12: కరోనా మరణాలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కొవిడ్‌ సంబంధిత మరణాలకు ధ్రువపత్రాలు జారీ చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ, భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) మార్గదర్శకాలు (Covid Death New Guidelines) రూపొందించినట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది.

ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం ఓ అఫిడవిట్‌ దాఖలు చేస్తూ.. కొవిడ్‌ మృతుల బంధువులకు మరణానికి గల కారణాలతో వైద్య ధ్రువపత్రాలు జారీ చేయాలంటూ రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ నెల 3వ తేదీనే ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది జూన్‌ 31న కోర్టు జారీ చేసిన ఆదేశాలను అనుసరించే మార్గదర్శకాలు, ఉత్తర్వులు (Centre issues fresh guidelines) వెలువడ్డాయి.

ఈ ఉత్తర్వులు ప్రకారం.. ఎవరైనా వ్యక్తి కరోనా సోకిన 30 రోజుల్లోగా చనిపోతే (Coronavirus Deaths) దానిని కరోనా మరణంగానే పరిగణించాలని పేర్కొంది. ఆసుపత్రిలో చనిపోయినా.. లేదా బయట చనిపోయినా కరోనా మరణంగానే గుర్తించాలని సూచించాలని చెప్పింది. ఇంట్లో లేదా ఆసుపత్రిలో చనిపోయి ఉండి.. ఇప్పటిదాకా స్పష్టత లేని కేసులనూ రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ చట్టం ప్రకారం కరోనా మరణాలుగానే చూడాలని స్పష్టం చేసింది. కరోనా సోకిన వ్యక్తి యాక్సిడెంట్ లో లేదా విషం తాగి చనిపోయినా, ఆత్మహత్య చేసుకున్నా కరోనా మరణంగా పరిగణించకూడదని తేల్చి చెప్పింది. కరోనా సోకిన వ్యక్తి డెత్ సర్టిఫికెట్ పై కుటుంబ సభ్యులకు అభ్యంతరాలుంటే.. జిల్లా స్థాయిలో కమిటీ వేసి సమస్యను పరిష్కరించాలని సూచించింది.

దేశంలో కొత్తగా 28,591 కేసులు నమోదు, 338 మంది కరోనాకు బలి, కోవిడ్‌ నిర్వహణ, వ్యాక్సినేషన్, పెరుగుతున్న కేసులపై సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

ఈ మార్గదర్శకాల మేరకు.. ఆర్టీపీసీఆర్, మాలిక్యులర్‌ పరీక్ష, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్ష లేదా ఆసుపత్రుల్లో/వైద్యుడి పర్యవేక్షణలో చేసిన పరీక్షలను కొవిడ్‌ నిర్ధరణకు ప్రామాణికంగా భావిస్తారు. ఓ వ్యక్తి కొవిడ్‌తో బాధపడుతూ ఉన్నా.. విషం తీసుకోవడం వల్ల, ఆత్మహత్యలతో, హత్యకు గురై, రోడ్డుప్రమాదాలతో మరణిస్తే కొవిడ్‌ మరణంగా పరిగణించబోరని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కోవిడ్‌గా నిర్ధారించని కేసుల్లో ఆసుపత్రుల్లో గానీ, ఇళ్ల వద్ద గానీ మరణిస్తే.. జనన, మరణ నమోదుచట్టం 1969లోని సెక్షన్‌ 10 ప్రకారం వైద్యపరంగా మరణ ధ్రువీకరణ పత్రం ఫారం 4, ఫారం 4ఏ నమోదు అధికారికి జారీ చేస్తారు. దీన్ని కొవిడ్‌ మరణంగా పరిగణిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్‌ రిజిస్ట్రార్లకు తగిన మార్గదర్శకాలు జారీ చేస్తారు.

గుజరాత్ కొత్త సీఎం..పటేల్ సామాజిక వర్గంపై గురి పెట్టిన బీజేపీ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే..

ఐసీఎంఆర్‌ అధ్యయనం మేరకు.. కొవిడ్‌ మరణాల్లో 95% పాజిటివ్‌ వచ్చిన 25 రోజుల్లోపు నమోదు అవుతున్నట్లు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఈ వ్యవధిని 30 రోజులకు విస్తరిస్తూ బాధితులు ఆసుపత్రిలో లేదా ఇళ్ల వద్ద చికిత్స పొందుతూ మరణించినా కొవిడ్‌ మరణంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ఈ కేసుల నిర్ధరణకు అవసరమైతే జిల్లాస్థాయి కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. బంధువుల దరఖాస్తులు, ఫిర్యాదులను ఈ కమిటీ 30 రోజుల్లో పరిష్కరించాల్సి ఉంటుంది.