Who Will Be The Next Gujarat CM?: గుజరాత్ కొత్త సీఎం..పటేల్ సామాజిక వర్గంపై గురి పెట్టిన బీజేపీ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి రేసులో ఉన్నది వీరే..
Nitin patel, Parshottam Chudasama and Mansukh Mandaviya (Photo Credits: Facebook)

Gandhinagar, September 11: వచ్చే ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి (ujarat Chief Minister) విజయ్‌ రూపానీ శనివారం రాజీనామా చేశారు. రాష్ట్ర గవర్నర్‌ని కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గుజరాత్‌ అభివృద్ధి కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన (Vijay Rupani) పేర్కొన్నారు. అయితే అనారోగ్య కారణాలతోనే విజయ్‌ రూపానీ రాజీనామా చేస్తున్నట్టు వార్తలు వస్తున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ.. వచ్చే ఏడాది అసెంబ్లీ (Gujarat Assembly Elections) ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే గుజరాత్‌లో బలమైన పటేల్‌ సామాజిక వర్గానికి దగ్గరయ్యేందుకే రూపానీతో రాజీనామా చేయించినట్టు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల సమయంలో పటేల్‌ సామాజిక వర్గానికి చెందిన హార్ధిక్‌ పటేల్‌ (Hardik Patel) బీజేపీకి చుక్కలు చూపించిన సంగతి విదితమే.

పటేల్ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలని ఆయన భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పటేళ్లను ఓబీసీ జాబితాలో చేర్చితే రిజర్వేషన్లు 50 శాతానికి మించుతాయి. దీంతో అధికార బీజేపీ దీని నుండి గట్టెక్కేందుకు నానా తంటాలు పడింది. గుజరాత్‌లో అధికార బీజేపీకి ఆది నుంచి పటేళ్లు గట్టి మద్దతుదార్లు. ఆ రాష్ట్ర జనాభాలో ఈ సామాజికవర్గం వారు 15 శాతం మంది ఉన్నారు. రాజకీయ, వ్యాపార రంగాల్లో పటేల్ సామాజికవర్గం వారు కీలక స్థాయిలో ఉన్నారు.

అందుకేనా..గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ రాజీనామా, నాయకత్వ మార్పు బీజేపీలో సాధారణ ప్రక్రియేనని తెలిపిన విజయ్ రూపానీ, మ‌రో ఏడాదిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక‌లు

ఈ క్రమంలోనే పటేళ్లకు మరింత ప్రాధాన్యం కల్పించి.. వారికి దగ్గరవ్వాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. రూపానీ రాజీనామాతో ఖాళీ అయిన సీఎం పీఠాన్ని పటేళ్ల సామాజికి వర్గానికి అప్పజెప్పడం ద్వారా ఓటు బ్యాంకును పొందేందుకు ప్రయత్నిస్తోంది. కొత్త ముఖ్యమంత్రి రేసులో కొత్త సీఎం రేసులో నితిన్‌ పటేల్‌, సీఆర్‌ పాటిల్‌, ఆర్‌సీ ఫాల్దూ, భూపేందర్ సింగ్ , మన్సుఖ్‌ మాండవియా, పర్షోత్తమ్ రూపాల వంటి వారు ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. విజయ్ రూపానీ రాజీనామా నేపథ్యంలో పార్టీ అగ్రనేతలు గాంధీనగర్‌లో సమావేశమయ్యారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్షుక్ మాండవీయ, పర్షోత్తమ్ రూపాల తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేసేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారంనాడు సమావేశమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి విజయ్ రూపానీ శనివారంనాడు రాజీనామా చేయడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. బీజేపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ప్రజలు నిర్ణయించుకున్నట్టు అసెంబ్లీలో కాంగ్రెస్ విపక్ష నేత పరేష్ ధనాని అన్నారు. గ్రామాలు, పేద ప్రజలు, రైతుల గోడు వినే ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రులు త్రివేంద్ర సింగ్ రావత్, తీరత్ సింగ్ రాజీనామా చేశారు, అనంతరం కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప రాజీనామా చేశారు. కాగా తాజాగా గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు వరుసగా రాజీనామాలు చేయడం అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. మోదీ ప్రధానమంత్రిగా ఎన్నికైన అనంతరం గుజరాత్‌కు ముఖ్యమంత్రిగా ఆనందిబెన్ పటేల్‌ను నియమించారు. అయితే రెండేళ్ల పదవీకాలం పూర్తవ్వగానే ఆమె తన పదవికి రాజీనామా చేశారు. ఇక 2016, ఆగస్టు 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రూపానీ.. సెప్టెంబర్ 11న రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామాను రాష్ట్ర గవర్నర్‌ ఆచార్య దేవరత్‌కు పంపినట్లు ఆయన పేర్కొన్నారు.