Husband Giving Time, Money To Mother Is Not Domestic Violence: భర్త తన తల్లితో సమయం గడపడం, ఆమెకు డబ్బు ఇవ్వడం గృహ హింస (Not Domestic Violence) కాదని సెషన్స్ కోర్టు పేర్కొంది. తన భర్త, అత్తమామలపై చేసిన ఫిర్యాదుపై మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ ఒక మహిళ చేసిన పిటిషన్‌ను ముంబై సెషన్స్ కోర్టు ( Court quashes woman’s plea) కొట్టివేసింది. ఒక వ్యక్తి తన తల్లికి సమయం, డబ్బు ఇవ్వడం అనేది గృహ హింస కిందకు రాదని (Not Domestic Violence) తీర్పును వెలువరించింది.
అదనపు సెషన్స్ జడ్జి (దిండోషి కోర్టు) ఆశిష్ అయాచిత్, మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులో, ప్రతివాదులపై ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయని, వారు దరఖాస్తుదారుని (మహిళ) గృహ హింసకు గురిచేశారని నిరూపించడానికి ఆధారాలు ఏమీ లేవని అన్నారు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలోని సచివాలయంలో అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మహిళ, గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం కింద మేజిస్ట్రేట్ కోర్టులో రక్షణ, డబ్బు పరిహారం కోరుతూ ఒక ఆర్డర్ కోసం ఫిర్యాదు చేసింది.తల్లి మానసిక రోగాన్ని దాచి తన భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపించింది. తాను ఉద్యోగం చేయడాన్ని అత్త వ్యతిరేకించిందని, భర్త, ఆమె తల్లి కలిసి తనను వేధిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది.
తన భర్త సెప్టెంబర్ 1993 నుంచి డిసెంబర్ 2004 వరకు ఉద్యోగం కోసం విదేశాల్లో ఉండేవాడని.. సెలవుపై ఇండియా వచ్చినప్పుడల్లా తన తల్లి వద్దకు వెళ్లి ప్రతి ఏడాది రూ.10వేలు పంపేవాడని ఆమె తెలిపారు. తన తల్లి కంటి ఆపరేషన్ కోసం కూడా డబ్బు ఖర్చు పెట్టాడని ఆ మహిళ తెలిపింది. తన అత్తమామల కుటుంబంలోని ఇతర సభ్యులు కూడా నన్ను వేధింపులకు గురిచేస్తున్నారని ఆమె పేర్కొంది. అయితే ఆమె అత్తమామలు ఈ ఆరోపణలన్నింటినీ ఖండించారు.
ఆమె తన భర్తగా ఎన్నడూ తనను అంగీకరించలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసేదని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. ఆమె క్రూరత్వం కారణంగా అతను ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్‌ను దాఖలు చేశాడు. తన భార్య తన ఎన్‌ఆర్‌ఈ (నాన్ రెసిడెంట్ ఎక్స్‌టర్నల్) ఖాతా నుంచి ఎలాంటి సమాచారం లేకుండా రూ.21.68 లక్షలు విత్‌డ్రా చేసిందని, ఆ మొత్తంతో ఫ్లాట్‌ను కొనుగోలు చేశారని ఆరోపించారు. మహిళ పిటిషన్ పెండింగ్‌లో ఉన్న సమయంలో, ట్రయల్ కోర్టు (మేజిస్ట్రేట్) ఆమెకు నెలకు రూ. 3,000 మధ్యంతర భరణాన్ని మంజూరు చేసింది.
మహిళ, ఇతరుల సాక్ష్యాలను నమోదు చేసిన తర్వాత, మేజిస్ట్రేట్ కోర్టు ఆమె అభ్యర్థనను కొట్టివేసింది. విచారణ పెండింగ్‌లో ఉన్న సమయంలో ఆమెకు మంజూరు చేసిన మధ్యంతర ఆదేశాలు, ఉపశమనాలను రద్దు చేసింది. దీంతో ఆ మహిళ సెషన్స్ కోర్టులో క్రిమినల్ అప్పీల్ దాఖలు చేసింది. సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, సెషన్స్ కోర్టు ప్రతివాదులపై ఆరోపణలు అస్పష్టంగా" ఉన్నాయని, వారు స్త్రీని గృహ హింసకు గురి చేశారని నిరూపించడానికి ఏమీ లేదని పేర్కొంది.పిటిషన్‌ను తిరస్కరించింది. విడాకులు కోరుతూ మహిళ భర్త నోటీసు జారీ చేసిన తర్వాతే ఈ ప్రక్రియ ప్రారంభించబడిందని కోర్టు పేర్కొంది.
గృహహింస నుంచి మహిళల రక్షణ చట్టం కింద ఎలాంటి ఉపశమనం పొందేందుకు ఆ మహిళకు అర్హత లేదని పేర్కొంది. మహిళ కుమార్తె అవివాహితురాలు కాబట్టి ఆ మహిళకు భరణం ఇవ్వవచ్చన్న వాదనను అంగీకరించలేమని కోర్టు పేర్కొంది. ఆమె తన కుమార్తె కోసం మెయింటెనెన్స్ రికవరీ చేయడానికి అర్హులని నేను భావించడం లేదు" అని న్యాయమూర్తి చెప్పారు. ట్రయల్ కోర్టు యొక్క తీర్పుపై ఈ కోర్టు జోక్యం అవసరం లేదని న్యాయమూర్తి జోడించారు.