India Coronavirus: గత వారంలో భారీగా పెరిగిన కరోనా కేసులు, పేద‌ దేశాల‌కు వ్యాక్సిన్ ఆల‌స్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసిన డబ్ల్యూహెచ్‌వో, దేశంలో తాజాగా 14,989 మందికి కరోనా
Coronavirus in AP (Photo Credits: PTI)

New Delhi, Mar 3: దేశంలో గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా నిర్ధారణ (India Coronavirus) అయింది. అదే స‌మ‌యంలో 13,123 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 98 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,12,044 మంది కోలుకున్నారు. 1,70,126మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,56,20,749 మందికి వ్యాక్సిన్ (Coronavirus Vaccine) వేశారు.

ఇండియాలో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మొత్తం కేస్ పాజిటివిటీ రేటు 5.11 శాతానికి పడిపోవడమే దీనికి నిదర్శనమని ఆ శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ వ్యాఖ్యానించారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల ప్రకారం, రోజులో 10 లక్షల నమూనాలను పరీక్షిస్తే, అందులో ఐదు శాతం లేదా అంతకన్నా దిగువన పాజిటివిటీ రేటు ఉంటే, వైరస్ నియంత్రణలోనే ఉన్నట్టని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం భారత్ ఆ స్థాయికి అత్యంత సమీపంలోనే ఉందని వెల్లడించారు.

కొత్త వేరియంట్లతో 4వ వేవ్ ముప్పు, అమెరికాలో సగటున రోజూ 2 వేల మంది దాకా చనిపోతున్నారంటూ హెచ్చరికలు జారీ చేసిన సీడీసీ, అమెరికాను వణికిస్తున్న B.1.1.7 వేరియంట్

దేశంలో ఇప్పటికే ప్రతి పది లక్షల మందిలో 1,57,684 మందికి కరోనా టెస్ట్ నిర్వహించామని, 113 మంది కన్నుమూశారని ఆయన అన్నారు. దేశంలో వైరస్ వ్యాప్తిని అనునిత్యం సమీక్షిస్తూనే ఉన్నామని వ్యాఖ్యానించిన ఆయన, ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య మొత్తం కేసుల్లో 2 శాతం కన్నా లోపుగానే ఉందని, 97 శాతం మంది రికవరీ అయ్యారని తెలిపారు.

తమిళనాడు, పంజాబ్, హర్యానా వంటి కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు కేంద్ర బృందాలను పంపామని, మొత్తం నమోదవుతున్న కేసుల్లో 75 శాతం మహారాష్ట్ర, కేరళలోనే వస్తున్నాయని రాజేశ్ భూషణ్ తెలియజేశారు. మహమ్మారి నియంత్రణలో ఉందని భావించి, తేలికగా తీసుకోరాదని, వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తిగా ముగిసేంత వరకూ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పెద్ద పార్టీలకు, భారీ ఎత్తున ప్రజలు ఒక చోటకు చేరే సభలు తదితరాలకు సాధ్యమైనంత దూరంగా ఉండాలని కోరారు.

వేసవిలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్న నిపుణులు

ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా విజృంభ‌ణ ప‌రిస్థితులు, వ్యాక్సినేష‌న్‌పై ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ టెడ్రోస్‌‌ అధానోమ్ స్పందించారు. జెనీవాలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ... ప్ర‌పంచంలో క‌రోనా కేసుల విజృంభణ విష‌యంలో గడిచిన ఏడు వారాల్లో తొలిసారిగా గత వారం పెరుగుదల ఉంద‌ని చెప్పారు.

ఇది ఆందోళనకు గురిచేసే అంశమని తెలిపారు. చాలా దేశాల్లో క‌రోనా నిబంధనలను స‌డ‌లించ‌డ‌మే ఇందుకు కారణమ‌ని అన్నారు. వైరస్‌ వేరియంట్ల విజృంభ‌ణ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌జలు జాగ్రత్తలు పాటించ‌డం లేద‌ని ఆయ‌న చెప్పారు. ప‌లు దేశాల్లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు.వ్యాక్సినేష‌న్‌పై ఆయ‌న స్పందిస్తూ.. పేద‌ దేశాల‌కు వ్యాక్సిన్ అంద‌డంలో జ‌రుగుతోన్న ఆల‌స్యంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభమై మూడు నెలలు గడిచిన అనంత‌రం పేద దేశాలకు వ్యాక్సిన్‌ చేరడం విచారకరమన్నారు. తాము పేద, మధ్య ఆదాయ దేశాలకు వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు.

పశ్చిమ ఆఫ్రికాలోని రెండు దేశాల్లో నిన్న వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు. పేద దేశాలకు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయ‌కుండా స్వప్రయోజనాలకు వాడుకొంటున్న ధనిక దేశాల తీరు స‌రికాద‌ని విమ‌ర్శించారు. ముప్పు పొంచి ఉన్న వారిని కాపాడటం అందరి బాధ్యతని తెలిపారు. ఈ ఏడాది మే చివరిలోపు 142 పేద దేశాలకు 23.7 కోట్ల క‌రోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీకి సిద్ధం కావచ్చని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ అంచ‌నా వేసుకుంది.