Empty streets of Srinagar, Jammu & Kashmir | Photo: Twitter

Srinagar, August 16: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసి దాదాపు రెండు వారాలవుతుంది. అయితే ఇప్పటికీ కూడా కాశ్మీర్ లోయలో కర్ఫ్యూ వాతావరణమే కనిపిస్తుంది. బయట జనసంచారం ఎక్కడా కనిపించడం లేదు, దుకాణ సముదాయాలు, విద్యా సంస్థలు ఇంకా మూతబడే ఉన్నాయి. గతవారం బక్రీద్ నుంచి కాశ్మీర్ లోయలో పలు చోట్ల నిషేధాజ్ఞలు సండలించారు, ప్రజలు బయట తిరిగేందుకు అనుమతించారు. ఆగష్టు 16 శుక్రవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సిందిగా 'ఆల్ ఇండియా రేడియో' ద్వారా ప్రకటన ఇచ్చారు. అయితే కాశ్మీర్ లోయ మాత్రం చడీచప్పుడు లేకుండా, ప్రశాంతంగా కనిపిస్తుంది.

ఇదిలా ఉండగా, యూటీగా ఏర్పడిన తర్వాత జమ్మూ కాశ్మీర్‌లో (Jammu Kashmir ) మొట్టమొదటి పంద్రాగష్టు వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఈ వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకం ఎగరవేశారు. ఎలాంటి భారీ కార్యక్రమాలు నిర్వహించకుండా సింపుల్‌గా వేడుకలు జరిగాయి. మరోవైపు  లద్దాఖ్‌లో మాత్రం యూటీగా ఏర్పడిన తర్వాత తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

 

కమ్యూనికేషన్ లేదు.

అయితే జమ్మూ కాశ్మీర్‌లో ఇప్పటికీ కూడా ఫోన్ మరియు ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడే ఉన్నాయి. ప్రభుత్వం అనుమతించిన కొన్ని వార్తా ఛానల్లు మాత్రమే టీవీల్లో ప్రసారం అవుతున్నాయి. ముఖ్యమైన ప్రకటనలన్నీ రేడియో ద్వారానే అధికారులు జారీ చేస్తున్నారు. ఫోన్, ఇంటర్నెట్ సేవలు తాత్కాలికంగా కొన్ని పునరుద్ధరించినా, పుకార్లు వ్యాపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ వాటిని నిలిపివేశారు.

అధికారులే వీధుల్లో అక్కడక్కడా టెలిఫోన్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఒకసారికి ఒక్కరికి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడే వీలుంది. ఇదే విషయమై సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. సుప్రీం నిర్ణయం బట్టి ఇక్కడ కమ్యూనికేషన్ పునరిద్ధరించే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. అయితే శాంతి భద్రతలకు సంబంధించిన విషయం కాబట్టి సుప్రీం కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే ఛాన్స్ మాత్రం లేదు.

జమ్మూ కాశ్మీర్‌లో భద్రతా దళాల పహారా ఇంకా కొనసాగుతుంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు (రియల్ టైమ్ మానిటరింగ్) పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది, ఎక్కడా ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. పరిస్థితి మరింత మెరుగుపడితే భద్రతాదళాలను ఉపసంహారించే అంశాన్ని పరిశీలిస్తామని సీనియర్ భద్రతాధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు.

కాశ్మీర్ అంశంపై UNSCలో సమావేశం

మరోవైపు పాకిస్థాన్ దేశం పదేపదే కాశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితిపై ఒత్తిడి చేయడం, అందుకు UNలో శాశ్వత సభ్యత్వం గల చైనా (అప్పట్లో నెహ్రూ మద్ధతుతోనే చైనా UNలో శాశ్వత సభ్యత్వ దేశాల జాబితాలో చేరింది). కూడా పాకిస్థాన్‌కు మద్ధతు తెలపడంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో  కాశ్మీర్ అంశంపై శుక్రవారం ఒక 'అంతర్గత సంప్రదింపుల' సమావేశం నిర్వహిస్తుంది.

ఈ సమావేశం పట్ల పాకిస్థాన్ ఇదో విజయంగా భావిస్తుండగా, ఇండియా మాత్రం ఇది కేవలం అనధికార సమావేశం మాత్రమే అని, ఇందులో ఎలాంటి ఓటింగ్స్ ఉండవు.  ఈ సమావేశానికి సంబంధించిన ఎలాంటి రికార్డ్స్ కూడా నమోదు చేయరు అని చెప్తున్నారు. కాశ్మీర్ విషయంలో ఇప్పటికే అంతర్జాతీయంగా తన విలువ పోగొట్టుకున్న పాకిస్థాన్, పరువు కోసం చేస్తున్న ఒక ప్రయత్నమే తప్ప ఈ సమావేశంతో కలిగే లాభమేమి లేదని భారత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కాశ్మీర్ అంశంలో  పాకిస్థాన్‌కు చైనా మద్ధతుగా నిలిచినా, మిగతా శాశ్వత సభ్యత్వ దేశాలైన ఫ్రాన్స్, రష్యా, యూకే మరియు యూఎస్ దేశాలు పాకిస్థాన్‌కు మద్దతు తెలిపే అవకాశం లేదు. ఒకవేళ పాకిస్థాన్‌కే ఎక్కువ దేశాలు మద్ధతు తెలిపినా సరే ఐరాస చేసే తీర్మానాల అమలు విషయంలో ఆయా దేశాలు పెద్దగా లెక్క చేయవు. అందుకు కూడా పాకిస్థానే ఉదాహారణ.నియంత్రణ రేఖ వెంబడి 'కాల్పులు జరపకూడదు' అని ఐరాస గతంలో తీర్మానించింది. దీనిని పాకిస్థాన్ ఎన్నిసార్లు ఉల్లంఘింస్తుందో అందరికీ తెలిసిందే.