Ministry of Home Affairs (Photo Credits: IANS)

New Delhi, July 15: సమాచార సాంకేతికత చట్టం-2000లోని రద్దయిన సెక్షన్ 66(ఎ) కింద కేసులు నమోదు చేయకుండా తమ పరిధిలోని అన్ని పోలీస్‌ స్టేషన్లను ఆదేశించాలని దేశంలోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2015లో మార్చి 24న సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలు కోసం ప్రభుత్వ చట్టాలను అమలు చేసే యంత్రాంగాలు చురుగ్గా వ్యవహరించాలని కూడా కేంద్రం కోరింది.

ఒకవేళ, సమాచార సాంకేతికత చట్టం-2000లోని సెక్షన్ 66(ఎ) కింద ఎక్కడైనా కేసు నమోదయివుంటే, తక్షణం ఉపసంహరించుకోవాలని హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.

సమాచార సాంకేతికత చట్టం-2000లోని సెక్షన్ 66(ఎ)ను కొట్టివేస్తూ 24.03.2015న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తీర్పు వెలువడిన తేదీ నుంచి ఈ సెక్షన్‌ రద్దయింది. అందువల్ల ఈ సెక్షన్‌ కింద ఇకపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్‌ చేసిన వారిని సెక్షన్‌ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఐటీయాక్ట్‌లోని సెక్షన్-66 ఎ కింద ఒక వ్యక్తి నేరం చేసినట్లు రుజువైతే గరిష్ఠంగా మూడేళ్ల కారాగార శిక్ష విధించే అవకాశం ఉంది. అయితే ముందస్తుగా అరెస్ట్‌ చేయొచ్చు. ఈ సవరణ చట్టానికి 2009 ఫిబ్రవరి 5న రాష్ట్రపతి ఆమోదించారు. అభ్యంతరకర వ్యాఖ్యలతో పాటు మనోభావాల్ని, అభిప్రాయాల్ని సాధారణంగా వ్యక్తం చేసినా అరెస్ట్‌లు చేశారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్‌ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది.