New Delhi, October 17: ఘోర ప్రమాదం తప్పిందా? విమాన పైలట్స్ వివరణ ఇచ్చుకోకపోయి ఉంటే, పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ తొందరపడి ఉంటే 120 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన గతనెల సెప్టెంబర్ 23న చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే, ఢిల్లీ నుంచి కాబూల్ వెళ్తున్న భారత్ కు చెందిన స్పైస్ జెట్ (Spice jet) 737 బోయింగ్ విమానం సుమారు 120 మంది ప్రయాణికులతో గతనెల సెప్టెంబర్ 23న పాకిస్థాన్ గగనతలం గుండా ప్రయాణించింది. అయితే ఈ విమానంపై అనుమానపడిన పాకిస్థాన్ వాయుసేన (Pakistan Air force), గగనతలంలో యుద్ధానికి వినియోగించే అత్యధునికమైన F-16 ఫైటర్ జెట్లతో ఈ విమానాన్ని వెంబడించింది.
స్పైస్ జెట్ విమానానికి సమాన ఎత్తులో F-16 ఫైటర్ జెట్లు (F-16 Fighter Jets) నలుదిక్కులా నుంచి దూసుకొచ్చాయి. సాధారణంగా డొమెస్టిక్ విమానాలు ఒక ఎత్తులో దాదాపు 15000 అడుగుల వరకు, అంతర్జాతీయ ప్రయాణాలు చేసే విమానాలు 30 - 35 వేల ఎత్తులో, ఇక ఫైటర్ జెట్స్ సముద్రమట్టానికి 40 నుంచి 50 వేల అడుగుల ఎత్తువరకు ఎగరగలవు.
ఫైటర్ జెట్స్ తమకు సమానంగా చక్కర్లు కొడుతుండటంతో వెంటనే అప్రమత్తమైన స్పైస్ జెట్ ఎయిర్‌క్రాఫ్ట్ పైలెట్లు, ఫైటర్ జెట్ల పైలెట్లతో కమ్యూనికేట్ అయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్ ఎగురుతున్న ఎత్తు తగ్గించుకొని, తమకు విమానం వివరాలను రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు. దీంతో తమది కమర్షియల్ విమానం అని, ప్రయాణికులను చేరవేస్తున్నట్లుగా వారికి కావాల్సిన డిటేల్స్ అన్ని అందించారు.
అయినప్పటికీ, అఫ్ఘనిస్తాన్ గగనతలంలో స్పైస్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రవేశించే వరకు ఫైటర్ జెట్లు పర్యవేక్షిస్తూనే వచ్చాయని పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్ (DGCA) నుంచి విశ్వసనీయ సమాచారం వచ్చినట్లు జాతీయ మీడియా సంస్థ NDTV వెల్లడించింది. ఇది సున్నితమైన అంశం కావడం పట్ల మరిన్ని వివరాల పట్ల గోప్యత పాటిస్తున్నట్లుగా తెలియజేశారు. నరేంద్ర మోడీకి పాక్ గగనతలంపై నో ఎంట్రీ!
ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత విమానాలకు అనుమతిని రద్దు చేస్తూ తమ గగనతలాన్ని పాక్ మూసివేసిన సంగతి తెలిసిందే. జూలై నుంచి పాక్షికంగా అనుమతిస్తున్నారు. భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాంటి వాళ్ళ విదేశీ పర్యటనలకు సైతం తమ గగనతలం గుండా ప్రయాణించకూడదని పాకిస్థాన్ అనుమతిని నిరాకరించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ కూడా పాకిస్థాన్ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టింది.