Pingali Venkayya: తెల్లవాళ్ళ జెండాకు మన సైనికులు తలొంచడాన్ని తట్టుకోలేక.. జాతి గౌరవాన్ని కాపాడేందుకు పతాకాన్ని ఆవిష్కరించిన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జయంతి నేడు.
Pingali (Photo Credits: Istock)

Hyderabad, August 2: ‘దొడ్డిదారిన నా దేశానికి వచ్చి పెత్తనం చెలాయిస్తున్న తెల్లవాడి జాతీయ జెండాకు నా అన్నదమ్ములు తలొంచి సెల్యూట్ చెయ్యాలా? వీధుల్లో వజ్రాలను రాశులుగా పోసి అమ్మిన నా భరతభూమిలో, ధాన్యరాశులతో తులతూగే అన్నపూర్ణ వంటి నా దేశానికి సొంతంగా జెండా ఎందుకు ఉండకూడదు?’.. ఐదడుగుల ఎత్తు, బక్క పలచని శరీరంతో.. చేతిలో పుస్తకాన్ని పట్టుకున్న ఓ సామాన్య తెలుగు బిడ్డ మదిలో రగిలిన ఆగ్రహ, ఆవేదన జ్వాలే.. ఇప్పుడు దేశంలోని ప్రతీ మూలా.. వాడవాడలా సగర్వంగా ఎగురుతున్న మువ్వన్నెల పతాకానికి శ్రీకారం చుట్టింది. అఖండ భారతావని స్వాతంత్ర్య అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ ఆనంద సమయాన.. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను స్మృతిపథంలో జ్ఞప్తికి తెచ్చుకోవడం మనందరి కర్తవ్యం. ఈరోజు ఆయన 146వ జయంతి కూడా..

కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రు గ్రామంలో 1876 ఆగస్టు 2న పింగళి వెంకయ్య జన్మించారు. తండ్రి హనుమంతనాయుడు, తల్లి వెంకటరత్నం. తండ్రి గ్రామ కరణం కావడం, వ్యవసాయ భూమి ఉండటంతో సేద్యంపై వెంకయ్యకు మక్కువ ఏర్పడింది. అందుకే వ్యవసాయ శాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. లాహోర్ వెళ్లి ఆంగ్లో వేదిక్ విద్యాలయంలో చేరి పలు భాషల్లో ప్రావీణ్యం పొందారు. 1895లో సైన్యంలో చేరి బోయర్ యుద్ధంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్ళారు. అక్కడే మహాత్మాగాంధీని కలుసుకున్నారు. ఆయన శాంతి- అహింసా విధానాలకు ఆకర్షితులయ్యారు. కోల్ కతాలో జరిగిన ఓ సమావేశంలో బ్రిటిష్ జాతీయ పతాకానికి భారత సైనికులు సెల్యూట్ చేయడాన్ని వెంకయ్య చూశారు. పరాయి వాడి జెండాకు నా అన్నదమ్ములు తలొంచి వందనాలు సమర్పించడం ఏంటి? పుణ్యభూమి, ధన్యభూమిగా కీర్తించే నా భారతావనికి సొంత జెండా ఎందుకు ఉండకూడదు? ఆగ్రహంలో నుంచి వచ్చిన ఆ ఆలోచన ఆయన్ని కుదురుగా ఉండనీయలేదు. అంతే, ఒకవైపు లెక్చరర్ గా విధులు నిర్వహిస్తూనే.. జాతీయ జెండాకు రూపకల్పన చేశారు. వివిధ దేశాల జాతీయ పతాకాలను అధ్యయనం చేసి, 30 నమూనాలను తయారు చేసి చివరగా రెండు రంగులతో పతాకానికి తుదిరూపు తీసుకొచ్చారు. అయితే ఆ జెండాను ఆమోదించడానికి, కనీసం వివరాలు తెలుసుకునేందుకు ఎవరూ ఆసక్తి కనబర్చలేదు. దేశంలోని అప్పటి పెద్ద నాయకులు పాల్గొనే జాతీయ కాంగ్రెస్ సమావేశాలకు తాను రూపొందించిన జెండాను పట్టుకొని సుమారు ఐదేండ్ల పాటు వెంకయ్య తిరిగారు.

పింగళి వెంకయ్య 146వ జయంతి, నివాళులు అర్పించిన ఏపీ సీఎం జగన్, దేశ ప్ర‌జ‌లంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా జాతీయ పతాక రూపకల్పన చేసిన తెలుగు బిడ్డ. 

చివరకు, 1921లో మహాత్మా గాంధీకి తన జెండాను చూపించారు. హిందువులు, ముస్లింలను ప్రతిబింబించే ఎరుపు, ఆకుపచ్చ రంగులు మాత్రమే అందులో ఉన్నాయి. పంజాబ్ కు చెందిన విద్యావేత్త లాలాహన్స్ రాజ్ సలహాతో మధ్యలో స్వరాజ్యానికి గుర్తుగా చరఖా ఉంచారు. గాంధీజీ సూచనతో శాంతి, అహింసలకు ప్రతీకగా తెలుపు రంగును మూడు గంటల వ్యవధిలోనే జత చేశారు. అలా మన తొలి జాతీయ జెండా రూపుదిద్దుకున్నది. అప్పటి నుంచి పింగళి వెంకయ్యను.. జెండా వెంకయ్యగా అందరు పిలవడం మొదలు పెట్టారు. 1931లో జరిగిన సమావేశంలో ఎరుపురంగును కాషాయ రంగుగా మార్చారు. స్వాతంత్ర్యం వచ్చాక జెండా మధ్యలో రాట్నం బదులు అశోక చక్రాన్ని చేర్చారు.

ప్రతీ భారతీయుడు సగర్వంగా తలెత్తుకునేలా దేశానికి పతాకాన్ని అందించిన వెంకయ్య చివరి రోజుల్లో కడు పేదరికాన్ని అనుభవించారు. అప్పటి ప్రభుత్వం కానీ, నాయకులు కానీ జాతికి ఆయన చేసిన సేవలను విస్మరించారు. చివరకు 1963 జూలై 4న వెంకయ్య పరమపదించారు. అమృతోత్సవాలు జరుపుకుంటున్న ఈ శుభసమయన ఆ మహానీయున్ని గుర్తుచేసుకోవడం.. మనందరి కనీస బాధ్యత.