PM Narendra Modi and Protesting Farmers. (Photo Credits: PTI | ANI)

New Delhi November 20: అన్నదాతలు అనుకున్నది సాధించారు. రైతులంతా ముక్త కంఠంతో వ్యతిరేకంచిన మూడు సాగుచట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గింది. రైతుల అలుపెరుగని పోరాటంతో నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు. గతేడాది నుంచి సాగుతున్న ఈ పోరాటంలో అనేక మైలు రాళ్లున్నాయి. చట్టాన్ని ఆమోదించడం నుంచి రద్దు చేయడం వరకు అనేక ఘట్టాలున్నాయి. అసలు సాగు చట్టాల రూపకల్పన నుంచి రద్దు వరకు జరిగిన పరిణామాలు చాలా నాటకీయంగా సాగాయి.

చట్టాల రూపకల్పన చాలా వేగంగా జరిగింది. తొలుత దాన్ని ఆర్డినెన్స్‌ గా తీసుకువచ్చిన కేంద్రం పార్లమెంట్‌లో విపక్షాలు వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆందోళనల మధ్యనే ఆమోదింపజేసుకుంది. మూడు వ్యవసాయ చట్టాలపై తొలుత 2020 జూన్‌ 5న కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఆ తర్వాత 2020 సెప్టెంబర్‌ 14 వాటిని పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అదే నెల 17న మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇక సెప్టెంబర్ 20న వ్యవసాయచట్టాలను రాజ్యసభ కూడా ఆమోదించింది. దీంతో  వాటిని వ్యతిరేకిస్తూ కిసాన్ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్ కమిటీ సెప్టెంబర్ 25 దేశవ్యాప్తంగా తొలిసారి ఆందోళనలు చేపట్టింది. వాటి ఆందోళనలు కొనసాగుతుండగానే  సెప్టెంబర్‌ 27న మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దాంతో మూడు బిల్లులు చట్టరూపంగా మారాయి.

దాంతో నవంబర్ 25న పంజాబ్, హర్యానా రైతులు ఛలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. నవంబర్ 26న ఛలో ఢిల్లీలో భాగంగా సరిహద్దులకు చేరుకున్న రైతులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో వారు సరిహద్దుల్లోనే బైఠాయించారు. వేలాదిగా రైతులు కదం తొక్కడంతో వారితో చర్చించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. రైతులతో చర్చించేందుకు సిద్ధమని నవంబర్‌ 28న కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. దాంతో డిసెంబర్ 3న తొలిసారిగా రైతు సంఘాల నాయకులతో కేంద్రం చర్చలు జరిపింది. ఆ తర్వాత డిసెంబర్ 5న రెండో దఫా చర్చలు జరిగాయి. చర్చల్లో ఎలాంటి ఫలితం రాకపోవడంతో డిసెంబర్ 8న భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చాయి కిసాన్ సంఘాలు. వారికి పలు రాష్ట్రాల రైతులు మద్దతు పలికారు.

అయితే చర్చల్లో భాగంగా డిసెంబర్ 9న రైతు సంఘాల ముందు పలు ప్రతిపాదనలు పెట్టింది కేంద్ర ప్రభుత్వం. చట్టాలకు సవరణ చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆ ప్రతిపాదనలకు రైతు సంఘాలు తిరస్కరించాయి. కేంద్రంతో చర్చలు విఫలమవ్వడంతో సాగు చట్టాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 11న సుప్రీంకోర్టును ఆశ్రయించింది భారతీయ కిసాన్ యూనియన్. ఆ తర్వాత ఈ ఏడాది జనవరి 4న ఏడోసారి రైతు సంఘాలు- కేంద్రం మధ్య చర్చలు జరిగాయి. కానీ సంఘాలు డిమాండ్ చేసినట్లుగా చట్టాల రద్దుకు కేంద్రం నిరాకరించింది.

ఇక జనవరి 7న సాగు చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఆ తర్వాత జనవరి 12న జరిగిన విచారణలో సాగు చట్టాలపై స్టే విధించింది అత్యున్నత న్యాయస్థానం. సాగు చట్టాలపై సిఫార్సులు చేసేందుకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టులో సాగు చట్టాల అంశం ఉండగానే కిసాన్ సంఘాలు జనవరి 26న ట్రాక్టర్ పరేడ్‌కు పిలుపునిచ్చాయి. దానికి పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ…వేలాది మంది రైతుల నిరసనలతో ఎర్రకోట అట్టుడికింది. ఆరోజు జరిగిన ఘటనలో ఓ రైతు మరణించాడు. ఆ తర్వాత జనవరి 29న ఏడాదిన్నరపాటు ఈ మూడు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తామని కేంద్రం ప్రభుత్వం ప్రతిపాదించింది.

గణతంత్ర దినోత్సవం రోజు జరిగిన ఘర్షణలపై టూల్‌ కిట్ వ్యవహారం సంచలనం సృష్టించింది. దీంతో ఫిబ్రవరి 5న దీనిపై ఢిల్లీ సైబర్‌ క్రైమ్ పోలీసులు కేసు నమోద చేశారు. ఆ తర్వాత విచారణ చేపట్టారు. ఇక జులై 22న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా దాదాపు 200 మంది రైతులు పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. ఆ తర్వాత ఆగస్ట్ 7న  జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన ఆందోళనలో 14 ప్రతిపక్ష పార్టీలు పాల్గొన్నాయి.

సాగు చట్టాలపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు అక్టోబర్ 22న కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు నిరసన చేసే హక్కు ఉన్నప్పటికీ.. సుదీర్ఘకాలం పాటు రోడ్లను బ్లాక్‌ చేయడం సరికాదని సుప్రీం కామెంట్‌ చేసింది.  దీంతో అక్టోబర్ 29న ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు నిరసన చేపట్టిన ప్రాంతం వద్ద బారీకేడ్లను తొలగించారు పోలీసులు. ఇక అన్నదాతల అలుపెరుగని పోరాటానికి తలొగ్గిన కేంద్రం నవంబర్ 19న సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించినట్లు ప్రకటించింది. ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసగిస్తూ రైతులకు క్షమాపణలు చెప్పారు. వారి కోరిక మేరకు సాగు చట్టాలను రద్దుచేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ప్రకటించారు.