Jodhpur, April 15: సాధారణంగా జీవిత ఖైదీలకు లేదా జీవిత ఖైదు పడిన ఖైదీలకు పెరోల్ మంజూరు చేయడం గురించి ఇప్పటివరకు మనం విన్నాము. అయితే భార్యను గర్భవతి చేసేందుకు ఒక ఖైదీకి కోర్టు 15 రోజులు పెరోల్ మంజూరు చేసింది. గర్భం దాల్చడం, సంతానం పొందడం మహిళ హక్కు అని, దానిని తాము కాదనలేమని ఈ సందర్భంగా ధర్మాసనం ( Jodhpur High Court) అభిప్రాయపడింది. ఘటన వివరాల్లోకెళితే.. రాజస్థాన్‌కు చెందిన 36 ఏండ్ల నంద లాల్‌కు ఒక కేసులో భిల్వారా కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో అజ్మీర్ జైలులో అతడు శిక్ష అనుభవిస్తున్నాడు.
కాగా, సంతానం కలిగేందుకు తన భర్తను విడుదల చేయాలని కోరుతూ అతడి భార్య రేఖ జోధ్‌పూర్ హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించింది. న్యాయమూర్తులు సందీప్ మెహతా, ఫర్జాంద్ అలీ ఆమె పిటిషన్‌పై విచారణ జరిపారు. ఖైదీ జైలు శిక్ష కారణంగా అతడి భార్య సంతానం పొందే హక్కును కోల్పోయిందని కోర్టు అభిప్రాయపడింది. ఎలాంటి నేరం చేయని ఆమె భావోద్వేగమైన, లైంగికపరమైన ఆ హక్కును కోల్పోవడం భావ్యం కాదని ధర్మాసనం పేర్కొంది. అలాగే మహిళ సంతాన హక్కుకు సంబంధించి ఋగ్వేదంతో సహా పలు హిందూ గ్రంథాలను హైకోర్టు ఉదాహరించింది. జుడాయిజం, క్రిస్టియానిటీ, ఇస్లాం సిద్ధాంతాలను కూడా కోర్టు ప్రస్తావించింది.
16 మత కర్మలలో బిడ్డను కనడం స్త్రీకి మొదటి హక్కు అని ధర్మాసనం నొక్కి చెప్పింది. ఈ ధర్మాన్ని నెరవేర్చడం కోసం ఖైదీ అయిన రేఖ భర్తకు 15 రోజులు పెరోల్ ( 15-day parole to make wife pregnant) మంజూరు చేసింది. 2021లో 20 రోజులు పెరోల్‌పై విడుదలైన అతడు మంచి ప్రవర్తనతో జైలుకు సరెండర్ అయిన వైనాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. వంశపారంపర్యంగా పిల్లలను కనడం మత తత్వాలు, భారతీయ సంస్కృతి మరియు వివిధ న్యాయపరమైన అంశాల ద్వారా గుర్తించబడుతుందని హైకోర్టు తీర్పు చెప్పింది.