Supreme Court of India. File Image. (Photo Credits: ANI)

New Delhi, August 28: జమ్మూకాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు, మరియు కాశ్మీర్ లోయలో ఆంక్షలకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 15 పిటిషన్లు దాఖలయ్యాయి.ఇవన్నీ బుధవారం రోజున ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి. సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ నేతృత్వంలోని ప్రత్యేక బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది.

ఈ సందర్భంగా ఆర్టికల్ 370 ను రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై అక్టోబర్ మొదటి వారం నుంచి వరుసగా విచారణ చేపట్టేందుకు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ప్రత్యేక రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తున్నట్లు చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ మేరకు వీటికి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా కేంద్రానికి ప్రభుత్వానికి మరియు జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాంగానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

జమ్మూ కాశ్మీర్‌ (Jammu and Kashmir) లో మీడియాపై ఆంక్షలు, ఇంటర్నెట్ మరియు మొబైల్ ఫోన్ సేవల నిలిపివేతపై 'కశ్మీర్ టైమ్స్' ఎక్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ బేసిన్ వేసిన పిటిషన్ ను సుప్రీం విచారించింది. ఈ వ్యవహారంపై 7 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని జమ్మూ కాశ్మీర్ పరిపాలనా యంత్రాగానికి సుప్రీం ఆదేశాలు జారీచేసింది.

గతంలోనే ఈ అంశంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని అభిప్రాయపడింది. ఆగష్టు 5న, జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు చేసి, దానిని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చిన దగ్గర్నించి నేటికి 24 రోజులు అవుతుంది. ఇప్పటివరకు కొన్ని చోట్ల నిషేధాజ్ఞలు ఎత్తివేసినా, మరికొన్ని చోట్ల మాత్రం ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దీనిపై జమ్మూకాశ్మీర్ పరిపాలన యంత్రాంగం వివరణ ఇవ్వాలని తాజాగా సుప్రీం ఉత్తర్వులిచ్చింది.

కాశ్మీర్ లోయలో నిర్భంధంలో ఉన్న తమ పార్టీ నేత మహ్మద్ యూసుఫ్ తారిగామిని కలిసేందుకు CPI(M) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి న్యాయస్థానం అనుమతిని ఇచ్చింది. అయితే కాశ్మీర్ లోయలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించకూడదని నిబంధన విధించింది.