ISRO - Chandrayaan2 launch.

ISRO: July 22, 2019 యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక చారిత్రాత్మకమైన రోజు. అంతరిక్షంలో భారత కీర్తి పతాకం రెపరెపలాడిన రోజు. చందమామకు సంబంధించి మరిన్నో విశేషాలు ప్రపంచానికి తెలియజెప్పేందుకు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఈరోజు చంద్రయాణ్-2 (Chandrayaan2) మిషన్ కు సంబంధించిన రాకెట్ ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది.

జూలై 21 ఆదివారం ప్రారంభమైన కౌంట్ డౌన్ 20 గంటల అనంతరం, జూలై 22 సోమవారం రోజున భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం సరిగ్గా 2:43 సమయంలో జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 రాకెట్ 3.8 టన్నుల బరువున్న చంద్రయాణ్-2 ఉపగ్రహాన్ని మోసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. అనుకున్నది అనుకున్నట్లుగా, నిర్ధిష్ఠ మార్గంలోనే వెళ్తూ 16 నిమిషాల 13 సెకన్ల పాటు ప్రయాణించి భూకక్ష్య 170.06X 40,400 వద్ద చంద్రయాణ్2 శాటిలైట్ ను కక్ష్యలో ప్రవేశపెట్టింది.

ఈ చంద్రయాణ్ 2 ఇలాగే కక్ష్యలో తిరుగుతూ మరో 3.84 లక్షల కిలోమీటర్ల దూరం 45 రోజుల పాటు ప్రయాణించి, సెప్టెంబర్ 7, 2019 న చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అవుతుంది.

చంద్రయాణ్ 2 కి సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి...

ఈ ఉపగ్రహం బరువు 3,447 కిలోలు. ఇందులో మూడు భాగాలు ఉంటాయి, అవి ఆర్బిటార్, ల్యాండర్ మరియు రోవర్. వీటిలో ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ పరిభ్రమణం చేస్తుండగా, ల్యాండర్ చంద్రుడి ఉపరితలంపై దిగి రోవర్ ను ప్రవేశపెడుతుంది. ఈ రోవర్ చంద్రుడిపై నీటి జాడ మరియు ఖనిజాల లభ్యతపై సమాచారాన్ని సేకరిస్తూ, రాతి నిర్మాణాల గురించి పరిశోధనలు చేస్తూ ఎప్పటికప్పుడు ఫోటోలు తీస్తూ ఆ డేటా అంతటిని ఇస్రోకి పంపిస్తుంది.

ఈ చంద్రయాణ్ 2 మిషన్ ముఖ్య ఉద్దేశ్యం, చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ల్యాండ్ అయి అక్కడి సమాచారం సేకరించటం. చంద్రుడి దక్షిణ ధృవంపై ఉపగ్రహాన్ని దించడం అంటే అదేం అంత తేలికైన విషయం కాదు. చంద్రుడు మధ్యలో ల్యాండ్ అవ్వడం సాధారణమే కానీ ఈ దక్షిణ ధృవం ఉపరితలం ల్యాండింగ్ కు అనుకూలించే వాతావరణం ఉండదు. ఇప్పటివరకు అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఆ ఘనత సాధించాయి. ఇప్పుడు చంద్రయాణ్2 కూడా ఆ ప్రాంతంలో ల్యాండ్ అయితే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. అంతేకాదు, ఈ చంద్రయాణ్2 మిగతా దేశాలతో పోలిస్తే చాలా తక్కువ బడ్జెట్ (Rs.978 crores) తో, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది.

దక్షిణ ధృవం ఉపరితలం అనువుగా ఉండదు కాబట్టి ల్యాండర్ నుంచి అత్యంత మృధువుగా రోవర్ ను ల్యాండింగ్ (Soft landing) చేసేలా దీనిని రూపొందించారు. చంద్రుడి ఉపరితలంపై ప్రవేశపెట్టిన రోవర్ సెకనుకు సెంటి మీటర్ వేగంతో 14 రోజులు పాటు అక్కడ కదులుతూ దానికి నిర్ధేశించిన పనులపై పరిశోధనలు చేపడుతుంది. ల్యాండర్ నుంచి రోవర్ బయటకు వచ్చిన తొలి 15 నిమిషాలు అత్యంత కీలకం.

చంద్రయాణ్2 తొలిదశ సక్సెస్ కావడంతో ఇస్రో సైంటిస్టులు ఆనందాల్లో మునిగిపోయారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు. దేశంలోని యావత్ ప్రజలు ఈ విజయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీ సహా, పార్లమెంట్ ఉభయసభలు, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రా సీఎం జగన్ లతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రయాణ్2 ప్రయోగం సక్సెస్ పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో సైంటిస్టులను అభినందించారు.

కాగా, ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్ శివన్ మాట్లాడుతూ చంద్రయాణ్2 మిషన్ లో భాగమైన ఇస్రో టీంకు అభినందనలు తెలియజేశారు, అయితే ప్రయోగం ఇంకా అయిపోలేదని, ఇది కేవలం ప్రారంభమే రానున్నది అసలు ప్రయోగం. ఇప్పట్నించి 45 రోజుల పాటు  చంద్రయాణ్ 2 శాటిలైట్ చంద్రుడిపై ల్యాండ్ అయ్యేంతవరకు ప్రతీరోజు తమకు ఎంతో కీలకం అని, ఈ మిషన్ లో భాగం అయిన ప్రతీ సైంటిస్ట్ అందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.