Reverse Migration: తెలంగాణాకే మరలిన వలసలు, రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు బిహార్ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలి వస్తున్న వలస కూలీలు
Health Officials Performing Screening for Migrants. | File Photo

Hyderabad, May 9: దేశవ్యాప్త౦గా కరోనావైరస్ లాక్ డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు తరలి వెళ్తుండగా తెలంగాణా రాష్ట్రానికి మాత్రం ఇతర రాష్ట్రాలనుండి కూలీల రాక ప్రారంభమైంది. రాష్ట్రంలో ఈ ఏడాది ధాన్యం భారీగా రావడంతో పెద్ద మొత్తంలో కూలీల అవసరం ఏర్పడింది. వీరందరికి తెలంగాణ ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుంది, వీరి రాక కోసం ప్రత్యేక ఏర్పాట్లు, మొత్తం ప్రయాణ ఖర్చులు కూడా తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది. ఇందుకోసం వలస కూలీల రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారిగా సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది.

తొలి విడతగా బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుండి ప్రత్యేక శ్రామిక్ ఎక్సప్రెస్ రైలులో హైదరాబాద్ లింగంపల్లి రైల్వే స్టేషన్ కు దాదాపు 300 మందివలస కూలీలు చేరుకున్నారు. వీరందరికీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతు సమన్వయ సమితి పళ్ళ రాజేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ తదితరులు పూలతో స్వాగతం పలికారు.

కూలీల రాక ఏర్పాట్లను రాష్ట్ర నోడల్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మరియు సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ లు స్వయంగా పర్యవేక్షించారు. శ్రామిక రైలులో వచ్చిన ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలను ప్రత్యేకంగా నిర్వహించారు. కరోనా లక్షణాలు కనిపిస్తే వారిని క్వారంటైన్ కేంద్రాలకు, లక్షణాలు లేనివారికి తాము కోరుకున్న జిల్లాలకు తరలిస్తున్నారు. ఈ కూలీలందరికీ తాగునీరు, ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు, శానిటైసర్లను కూడా అందచేసి కరోనా నుండి కాపాడుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు అధికారులు తెలియజేశారు.

ఈ వలస కార్మికులందరినీ హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్, మంచిర్యాల, కాగజ్ నగర్ మరియు సిద్దిపేట తదితర 'శ్రామిక శక్తి' అవసరమున్న ప్రాంతాల తరలించారు.

తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు, నిర్మాణ రంగంలో పనులు ప్రారంభమైనందున ప్రస్తుతం కూలీలకు మంచి డిమాండ్ ఉంది. వీరందరికి రోజు కూలీ రూ. 1200 లభించనుంది. ఇదే పనికి బిహార్ రాష్ట్రంలో కేవలం రూ. 300 మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఇక్కడ విస్తృత ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తుండడం, లాక్డౌన్ కాలంలో వలస కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత తదితర కారణాల వల్ల తెలంగాణ రాష్ట్రానికి కూలీలు తరలి వెళ్తున్నట్లు పలు నివేదికలు వెల్లడించాయి.