మన పండుగల్లో హనుమాన్ జయంతి ముఖ్యమైంది. హనుమజ్జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పఠిస్తారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఆరతులు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఎక్కడ చూసినా హనుమంతుని కధలు, గీతాలతో దివ్య వాతావరణం నెలకొంటుంది. పూజలు, ఉత్సవాల అనంతరం భక్తులకు ప్రసాదాలు పంచుతారు. అనేక దేవాలయాల్లో ఈ పర్వదినం సందర్భంగా అన్నదానాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది ఏప్రిల్ 23న హనుమాన్ జయంతి వస్తోంది.
హనుమంతుని జన్మోత్సవం చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .హిందూ పురాణ కధల ప్రకారం పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. కేసరి అనే వానరవీరుడు ఆమెను పెళ్ళాడెను. వారు సంతానము కొరకు భక్తితో శివుని ఆరాధించిరి. ఏప్రిల్ 17న శ్రీరామ నవమితో ఈ 4 రాశుల వారికి బుధాదిత్య యోగం ప్రారంభం..వీరు కొత్త ఇల్లు కొనడంతో పాటు, ఆకస్మికంగా లాటరీ లభించే వీలుంది..
అప్పుడు వాయుదేవుడు శివుని తేజమును పండు రూపములో అంజనకొసగెను. అంజనకు జన్మించిన సుతుడే ఆంజనేయుడు. కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించినందున వాయుసుతుడనీ కూడా అంటారు. సంప్రదాయం ననుసరించి హనుమంతుని ఉపాసకులు కూడా ఈ పండుగ జరుపుకుంటారు. శ్రీరామనవమితో పాటు కొందరు ఈ జన్మోత్సవం జరుపుటను కూడా ఉంది.
ఆంజనేయస్వామి ధైర్యానికి ప్రతీక. శక్తిసామర్ధ్యాలకు ప్రతిరూపం. సముద్రం దాటి లంక చేరాడు. ఆకాశమార్గంలో పయనించి సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. సంజీవనీ పర్వతాన్నే పెకిలించి తీసుకొచ్చిన వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం సాధ్యమా?! హనుమజ్జయంతి సందర్భంగా పంచముఖ హనుమాన్, పాదరస హనుమాన్ తదితర విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేస్తారు. దేవాలయాల్లో హనుమాన్ ప్రత్యేక పూజలు జరుపుతారు. కొందరు ఈవేళ ఉపవాసం ఉండడానికే ఇష్టపడతారు.
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.
ఆంజనేయునికి శ్రీరాముడంటే ఎంత భక్తిప్రపత్తులు అంటే, తన మనసునే మందిరంగా చేసి ఆరాధించాడు. హనుమంతుడు గుండె చీల్చి చూపగా సీతారాములే దర్శనం ఇచ్చారు. శ్రీరాముని, సీతమ్మతల్లి కంటే మిన్నగా ప్రేమించాడు హనుమంతుడు. ఒకసారి హనుమాన్ సీతాదేవి నుదుట సిందూరం పెట్టుకోవడం చూసి,"నుదుట సిందూరం ఎందుకు పెట్టుకున్నావమ్మా" అని అడుగుతాడు.
సీతమ్మ తల్లి నవ్వుతూ "శ్రీరాముడు దీర్ఘాయుష్కుడిగా ఉండాలని" అంటుంది. అంతే, హనుమంతుడు క్షణం ఆలోచించకుండా తన ఒళ్ళంతా సిందూరం పూసుకుంటాడు. అదీ హనుమంతునికి రాముడి మీద గల నిరుపమానమైన భక్తి. ఒక సందర్భంలో సీతమ్మ హనుమంతునికి రత్నాభరణాన్ని బహూకరించింది. హనుమంతుడు ఒక్కో పూసనూ కొరికి చూసి, విసిరేయసాగాడు. అదేమిటని అడగ్గా, ''రామయ్య తండ్రి కనిపిస్తాడేమోనని ఆశగా చూశాను. నా స్వామి లేని రత్నాలు, స్వర్ణాలతో నాకేం పని?” అన్నాడు.
హనుమంతుని నిరుపమానమైన భక్తికి ఇంతకంటే కొలమానం ఇంకేం కావాలి? రావణాసురుడు సీతమ్మను అపహరించుకుపోగా, ఆ తల్లిని అన్వేషించడానికి బయల్దేరాడు హనుమంతుడు. అహర్నిశలూ ప్రయత్నించి, సీతమ్మ జాడ తెలుసుకున్నాడు. అశోకవనంలో శోకమూర్తిలా కూర్చుని, దిగులు సముద్రంలో కుంగిపోతూ, ఆత్మత్యాగం చేయాలనుకుంటున్న సీతమ్మకు శ్రీరాముని అంగుళీయకం చూపి, ధైర్యంగా ఉండమని స్థైర్య వచనాలు పలికాడు. లంకాదహనం చేసి తన వంతు సహకారం అందించాడు.
వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించగలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.