International Women’s Day 2021: అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం, మార్చి 8వ తేదీనే ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు ?
Happy International Women’s Day 2021 Images & HD Wallpapers (Photo Credits: File Image)

ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజలందుకొంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడరో అక్కడ ఎంత గొప్ప సత్కార్యాలైననూ ఫలించవు అని మనుస్మృతి తెలుపుతుంది. మహిళ.. ఒక అమ్మగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురిగా ఇలా అనేక రూపాలలో ప్రేమను పంచుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women’s Day 2021) సందర్భంగా ప్ర‌తి ఒక్క‌రు త‌మ జీవితంలో స్త్రీ ప్రాముఖ్య‌త‌ను గుర్తు చేసుకుంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యతను ఓ సారి తెలుసుకుందాం..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Women’s Day 2021) కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి, ప్రతి ఏటా నిర్వహిస్తోంది. దీని పుట్టుకకు బీజాలు 1908లో పడ్డాయి. తక్కువ పని గంటలు, మెరుగైన జీతం, ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. సామాజికంగాను, రాజకీయాల్లోనూ, ఆర్థిక రంగంలోనూ మహిళలు ఎంత మేరకు ఎదిగారో తెలుసుకుని వేడుక చేసుకునే రోజుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మారిపోయింది.

పితృ దినోత్సవం ఎప్పుడు మొదలైంది? ఎన్ని దేశాల్లో అంతర్జాతీయ పితృ దినోత్సవం జరుపుకుంటున్నారు, హ్యాపీ ఫాదర్స్ డే WhatsApp Stickers, Facebook Greetings, GIF Images, SMS and Messages మీకోసం

వాస్తవంగా.. కొనసాగుతున్న అసమానతలపై అవగాహన పెంచేందుకు ధర్నాలు, నిరసనలు నిర్వహించటం ఈ దినోత్సవం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యం. కుటుంబ, ఆర్థిక భారాలను సైతం నేడు స్త్రీ శక్తి లాగుతోంది. ఉన్నత శిఖరాలను చేరుకుని పురుష శక్తికీ తామేమీ తీసిపోమని చాటిచెపుతోంది. మేం ఇంటికే పరిమితం కాదంటూ పురుషులకు ధీటుగా విజయాలు సాధిస్తున్నారు. సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది. కోపెన్‌హెగెన్‌ నగరంలో 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు.

17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని తొలిసారిగా 1911లో ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్‌ దేశాల్లో నిర్వహించారు. 2011లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ శతాబ్ది వేడుకలు కూడా జరిగాయి. 1975వ సంవత్సరంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి అధికారికంగా నిర్వహించటం ప్రారంభించింది. అంతేకాదు ప్రతి ఏటా ఏదో ఒక ఇతి వృత్తం ( థీమ్ )తో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తోంది.

ప్రేమలో ఓడిపోవడం, గెలవడం అంటూ ఉండవు. ఆ ప్రేమ పంచిన అనుభూతులు ప్రతి ఒక్కరి జీవితంలో పదిలం, శాశ్వతం

'గతాన్ని వేడుక చేసుకోవడం, భవిష్యత్తుకు ప్రణాళికలు రచించుకోవడం' అని మొదటి థీమ్‌ను నిర్ణయించింది. ఈ ఏడాది ''సమానత్వంతో ఆలోచించండి, తెలివిగా నిర్మించండి, మార్పు కోసం సృజనాత్మకంగా పనిచేయండి'' అన్నది ఈ ఏడాది నినాదం. పనిచేసే వయసున్న మహిళల్లో సగం మంది మాత్రమే ప్రపంచ కార్మిక శక్తికి ప్రాతినిథ్యం వహిస్తున్నారని ఐక్యరాజ్య సమితి గణాంకాలు చెబుతున్నాయి. 1917 యుద్ధ సమయంలో రష్యా మహిళలు ''ఆహారం - శాంతి'' డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగారు. నాలుగు రోజుల తర్వాత అప్పటి రష్యా సామ్రాట్ నికోలస్ జా 2 సింహాసనాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

అప్పుడు తాత్కాలికంగా ఏర్పాటైన ప్రభుత్వం మహిళలకు ఓటు వేసే హక్కును మంజూరు చేసింది. మహిళలు ఈ సమ్మెకు దిగిన రోజు జూలియన్ క్యాలెండర్ ప్రకారం ( అప్పట్లో రష్యాలో ఈ క్యాలెండర్‌నే అనుసరించేవాళ్లు ) ఫిబ్రవరి 23 ఆదివారం. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చూస్తే అది మార్చి 8వ తేదీ. అందుకే మార్చి 8వ తేదీన ( ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో ఇప్పుడు అమలులో ఉన్నది గ్రెగోరియన్ క్యాలెండర్ ) అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు.

ఈ లోకంలో స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. మరి.. మనల్ని కంటిపాపలా కాపాడే 'స్త్రీమూర్తి'ని స్మరించుకోవడం మన అందరి బాధ్యత. తల్లిగా లాలిస్తూ.. చెల్లిగా తోడుంటూ.. భార్యగా బాగోగులు చూస్తూ.. సేవకురాలిలా పనిచేస్తూ.. కుటుంబ భారాన్ని మోస్తూ... సర్వం త్యాగం చేస్తుంది మహిళ. అంతటి గొప్ప మహిళకు మనసారా ధన్యవాదాలు చెప్పుకునే సమయం ఇదే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 'ఆమె'కు చక్కని బహుమతి అందించడమే కాకుండా.. మనసారా శుభాకాంక్షలు తెలియజేయండి.