Kanuma 2021: వ్యవసాయంలో సాయానికి కృతజ్ఞత, మూగజీవాలకు ప్రేమను పంచే కనుమ! సంక్రాంతి సంబరాల్లో కనుమ పండగ విశిష్టత ఎంతో గొప్పదో తెలుసుకోండి
రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి......
Happy Kanuma 2021: సంక్రాంతి (Sankranthi) పండగలో భాగంగా చివరగా జరపబడే పర్వదినాన్ని కనుమ అంటారు. దీన్నె పశువులు పండగ అని కూడా అంటారు. ఏడాదంతా వివిధ రకాల వ్యవసాయ పనుల్లో తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులని ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ. ఇది వ్యవసాయదారులు, రైతులు జరుపుకునే పండగ. రైతుల జీవితంలో పశువులు కూడా ఒక భాగమే. పంటలు చేతికి అందించడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను ఈరోజు పూజిస్తారు. ఆవులు, ఎద్దులు, ఇతర పాడి పశువులకు కృతజ్ఞతగా, వాటిని పూజించి ప్రేమగా చూసుకునే రోజుగా కనుమ ప్రసిద్ధి. అలాగే పంటలకు పట్టిన చీడలను నియంత్రించే పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్లుగా కనుమ రోజు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడ దీస్తారు. ఆంధ్రా, రాయలసీమ మరియు తమిళనాడు ప్రాంతాల్లో కనుమ పండగను ఘనంగా జరుపుకుంటారు.
కనుమరోజు అడవిలో దొరికే వివిధ వనమూలికతో కూడిన మిశ్రమాన్ని పశువులకు తినిపిస్తారు. దీనిని ఉప్పుచెక్క అని కూడా అంటారు. ఏడాది కొకసారి పశువులకు ఉప్పుచెక్కను తినిపిస్తే అది వాటికి సర్వరోగ నివారణిగా పనిచేస్తుందని రైతుల నమ్మకం.
ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తీసుకెళ్లి, వాటికి శుభ్రంగా స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి తిరిగి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను రంగులు అద్దుతూ, ఇత్తడి కుప్పెలు తొడిగి, మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలతో అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలి వేసి వాటికి విశ్రాంతినిస్తారు.
సాయంత్రం ఊరిలో కాటమరాజు విగ్రహాన్ని పున:ప్రతిష్టించి ఆయనకు కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి వండిన పొంగలిని నైవేద్యంగా పెడతారు. వచ్చే ఏడాదిలో కూడా పాడిసంపద వృద్ధి చెంది, పంటలు సమృద్ధిగా పండితే మరింత ఘనంగా పూజలు చేస్తామని కాటమరాజుకు యాటలు కోసి మొక్కులు సమర్పించుకుంటారు. కనుమ రోజు ఇంట్లో పసందైన మాంసాహార వంటకాలు వండుతారు. కుటుంబ సభ్యులు వారి ఆచార, సంప్రదాయాల ప్రకారం కనుమను ఘనంగా జరుపుకుంటారు.
(The above story first appeared on LatestLY on Jan 15, 2021 10:04 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

