Expiry Date: వివిధ రకాల ఉత్పత్తులపై ఎక్స్‌పైరీ డేట్ ఎందుకు వేస్తారు?  కాలం చెల్లిన తర్వాత వాటిని వాడితే ఏమౌతుంది?
Image used for representational purpose only | Photo - Wikimedia Commons.

ఇంట్లో ఉండే అవసరాల కోసం మీరు కొన్ని నెలలకు సరిపడా అన్ని రకాల కిరాణ సామాన్లు ఒకేసారి తెచ్చుకున్నారు. అయితే కొద్దిరోజుల తర్వాత వాటిలో కొన్నింటికి ఎక్స్‌పైరీ డేట్‌ (Expiry Date) లు గమనిస్తే వాటిని అలాగే వాడుతున్నారా? లేక ఎక్స్‌పైరీ అయిపోయాయని పాడేస్తున్నారా? ఒకటి గమనించండి ఇప్పుడంటే సూపర్ మార్కెట్లు వచ్చాయి కాబట్టి మనకు ఏది కావాలో మనకు మనంగా వెళ్లి ఏది మంచిది అని ఏరి కోరి కొనుక్కుంటున్నాం. కానీ అంతకుముందు దగ్గర్లోని కిరాణ షాప్‌కు వెళ్లి మనకు కావాల్సిందేదో అడిగితే, వాళ్లు ఏదో ఇస్తే అదే తీసుకొని వాటినే వినియోగించేవాళ్ళం. అప్పుడు అవి వాడినపుడు, ఇప్పుడు ఇన్ని రకాలుగా పరీక్షించి వాడుతున్నప్పుడు మీ ఆరోగ్యంలో ఏదైనా మార్పును గమనించారా?పెద్దగా ఏమి గమనించకపోవచ్చు.

మన ఇండ్లల్లో కూడా తాతాల కాలం నుంచే కారం, పసుపు, చింతపండు అని ఎన్నో రకాల పదార్థాలను ఒకేసారి కొనుగోలు చేసి వాటినే భద్రంగా దాచుకొని సంవత్సరాల పాటు వాడటం మనకు తెలుసు.

మరి ఇంతకాలంగా లేనిది ఇప్పుడు ఇప్పుడు ప్రతీదానికి ఈ ఎక్స్‌పైరీ తేదీతో సంబంధం ఏమిటి? ఇప్పుడు మార్కెట్లో మనం చూస్తే ప్రతి దానిపై ధరతో పాటు ఎప్పుడు తయారు చేశారు (Manufacture Date), అది ఎప్పటివరకు వాడేసేయాలి (Use by) అని ముద్రించి ఉంటుంది. అయితే ఏదైనా వస్తువు దాని కాలపరిమితి దాటిపోయింది అంటే అది పూర్తిగా పాడైపోయింది, ఇక వినియోగించకూడదు అని కాదు. అందులో కంపెనీల మార్కెటింగ్ ట్రిక్ కూడా ఉంటుంది. ఎక్స్‌పైరీ తేదీ దాటిపోగానే మళ్ళీ వచ్చి వాటిని కొనుగోలు చేస్తారు కాబట్టి వాళ్లకు సేల్స్ ఎక్కువ జరుగుతాయి అని కంపెనీలు ఈ ట్రిక్‌ను అనుసరిస్తాయి. మీరు ఏదైనా సూపర్ మార్కెట్‌కు వెళ్లి గమనిస్తే కొన్ని రకాల వస్తువలపై వాటి ఎక్స్‌పైరీ తేదీలను సూచించే చోట పైనుంచి కొత్త స్టిక్కర్లను కొత్త ఎక్స్‌పైరీ తేదీలతో అతికిస్తారు.

కొన్ని రకాల ఆహారపదార్థాల పైన యూజ్ బై (Use by) లేదా బెస్ట్ బిఫోర్ (Best Before) అని ఉంటుంది. దాని అర్థం ఆ తేదీ దాటిని తర్వాత వాటిని వినియోగించకూడదు, ప్రమాదం అని కాదు. ఆ పదార్థం ప్యాకింగ్ చేసేటపుడు ఏదైతే తాజాదనం ఉంటుందో ఆ తేదీ దాటిన తర్వాత తిరిగి అదే తాజాదనం ఉండదు అని అర్థం.

వాస్తవానికి ఏ వస్తువైనా మనం భద్రపరుచుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఎక్స్‌పైరీ డేట్ ఉండి, ప్యాకింగ్ సరిగా లేకుంటే అది కూడా వెంటనే పాడవచ్చు. ఉప్పులాంటి పదార్థాలను సంవత్సరాల కొద్దీ వాడుకోవచ్చు. డ్రైఫ్రూట్స్ లాంటివి కూడా సరిగ్గా భద్రపరిస్తే సంవత్సరం వరకూ నిల్వ ఉంటాయి. ఏదైనా వస్తువు చెడిపోయింది అంటే అది దాని నుంచి వచ్చే వాసన, దాని స్వభావాన్ని చూసి మనం పసిగట్టవచ్చు.

అలా అని ఇకపై ఎక్స్‌పైరీ డేట్ ఉన్నవన్నీ తినేయకండి.  అమెరికాలో స్కాట్ నాష్ (Scott Nash) అనే ఆర్గానిక్ పదార్థాలు అమ్మే ఓ వ్యక్తి కూడా తన స్టోర్లో ఎక్స్‌ పైరీ డేట్ అయిపోయి, మిగిలిపోయిన స్టాక్ అంతా తనే తినేస్తున్నాడంటా. ఎప్పుడో తెలియకుండా ఆరు నెలల కిందటే కాలపరిమితి ముగిసిన ఒక పాలపదార్థాన్ని తిన్నాడంటా రుచిలో గానీ, ఆ తర్వాత తన ఆరోగ్యంలో గానీ ఎలాంటి మార్పు రాలేదని గమనించి తన ఫ్యామిలీకి కూడా  ఎక్స్పైరీ డేట్ అయిపోయి, ఆ మిగిలిపోయిన స్టాక్  రోజూ తినిపిస్తున్నాడని వార్తల్లోకి ఎక్కాడు.

కాబట్టి మీరూ అలా చేయకండి మీ ఇంట్లో మీరు బాగా భద్రపరుచుకుని, అవి తాజాగా అనిపిస్తేనే వాడండి ఆరోగ్యంతో చెలగాటం ఎందుకు? మెడిసిన్ విషయంలో మాత్రం ఎక్స్‌పైరీ తేదీలపై ఎలాంటి ప్రయోగాలు చేయకండి. వాటితో రిస్క్ చాలా ఎక్కువ. మామూలుగా ఆహారపదార్థాలు, వస్తువులు వినియోగదారులకు ఏవి  తాజావి,  ఏవి కొత్తవి  అని తెలుసుకోటానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు కంపెనీలకు అలాంటి మార్గదర్శకాలు జారీచేస్తారు. కంపెనీలు వారి తెలివితో వాటికి మార్కెటింగ్ ట్రిక్స్ జత చేసి మార్కెట్లో వదులుతారు. అదీ మ్యాటర్.