ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప్రతి ఇంట్లో శుభ్రత ఎక్కువైంది. ఎప్పటికప్పుడు ఇంట్లో ఫ్లోర్ శుభ్రపరుచుకోవడంతో పాటు, నేలపై పరిచే మ్యాట్స్ దగ్గర్నించి పడుకునే బెడ్ షీట్స్ వరకు ఇంట్లో వాడే అన్ని వస్తువులను క్లీన్ గా ఉంచుకుంటున్నారు. అయితే మరి సోఫాలను శుభ్రపరుస్తున్నారా? రోజంతా ఎక్కువ సేపు గడిపేది, వర్క్ ఫ్రోమ్ హోమ్ చేస్తూ కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేది, ఇంట్లో చిన్న పిల్లలుంటే ఆడుకునేది ఈ సోఫాలపైనే. ఈ లాక్డౌన్ విధించినప్పట్నించీ చాలా ఇళ్లలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అంటూ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లలో సినిమాలను చూస్తూ సోఫాలకే అతుక్కుపోయే వారు ఎందరో ఉండుంటారు. అయితే ఇంట్లో అన్నింటినీ ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకుంటూ ఉండే మీరు, మీరు విశ్రాంతి తీసుకునే సోఫాలను మాత్రం పట్టించుకుని ఉండరు.
కానీ ఈ సోఫాలు ఎన్నో రోగకారక క్రిములకు నిలయంగా ఉంటాయి. కాబట్టి సోఫాల శుభ్రతపై కూడా దృష్టి పెట్టడం ఎంతో అవసరం. మరి సౌకర్యవంతమైన మీ సోఫాలను ఎలా శుభ్రం చేయాలో కొన్ని చిట్కాలను ఇక్కడ అందిస్తున్నాం.
కనీసం నెలకోసారైన మీ సోఫాపై ఉండే కుషన్ ను సంపూర్ణంగా వాక్యూమ్ చేయాలి. కుషన్స్ తీసే వీలుంటే వాటిని తొలగించి పరిశుభ్రంగా ఉతుక్కోవాలి. అలాగే సోఫా కింద ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. వ్యాక్యూమ్ క్లీనర్ ద్వారా అన్ని మూలలను శుభ్రం చేసుకోవాలి. సోఫాలపై మరకలు పడితే ఏదైనా క్లెన్సర్ ను ఉపయోగించి శుభ్రం చేయాలనుకున్నప్పుడు, ముందుగా మీ సోఫా మెటీరియల్ ను పాడు చేస్తుందా? అనేది గమనించి వాడాల్సి ఉంటుంది.
లెదర్ కౌచ్: తోలుతో తయారు చేయబడిన సోఫాపై మరకలు పడితే, ఆ మరకలపై కొద్దిగా తడితో మైక్రోఫైబర్ వస్త్రాన్ని సున్నితంగా రుద్దాలి. మరక పోవడం లేదని లెదర్ వాటిపై తీవ్రంగా రుద్దడం లాంటివి చేయొద్దు. మార్కెట్లో లెదర్ క్లీనింగ్ ఏదైనా ప్రొడక్ట్ అందుబాటులో ఉంటే దానిని ఉపయోగించవచ్చు.
ఫాబ్రిక్ కౌచ్: ఫాబ్లిక్ సోఫాలపై మైక్రోఫైబర్ గుడ్డను కొద్దిగా నీటితో తడిపి ఉపయోగించవచ్చు. నీరు లేదా మరేదైనా ఆల్కాహాల్ శానిటైజర్ ద్రావణం స్ప్రే చేసి స్పాంజితో స్క్రబ్ చేయవచ్చు. ముడతలు పడినట్లుగా అయితే ఒక బ్రష్ తో రుద్దుతూ తిరిగి యధాతస్థితికి తీసుకు రావొచ్చు. మరకలు కఠినంగా ఉంటే స్టెయిన్ రిమూవర్ లేదా కాస్టిల్ సబ్బు ద్రావణం ఉపయోగించి తొలగించవచ్చు.
ఈ రకంగా అప్పుడప్పుడు సోఫాలను శుభ్రపరుచుకోవడం ద్వారా ఎలాంటి హానికారక క్రిముల బారినపడకుండా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోవచ్చు.