ప్రకృతి విపత్తులు (Climate Disasters) ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ప్రాణ నష్టం, ఆర్థిక నష్టాలను కలిగిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, భూకంపాలు, తుపానులు, కరువులు, హీట్‌వేవ్స్ వంటి విపత్తులు దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రమైన దెబ్బ కొడుతున్నాయి. తాజాగా జర్మన్ వాచ్ (Germanwatch) అనే అంతర్జాతీయ థింక్‌ట్యాంక్ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ 2024 (Climate Risk Index 2024) నివేదిక ప్రకారం.. భారత్ గత మూడు దశాబ్దాల్లో ప్రకృతి ప్రకోపానికి అత్యంత ప్రభావిత దేశాలలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
1995 నుంచి 2024 వరకు భారత్‌లో మొత్తం 430 ప్రకృతి విపత్తులు సంభవించాయి. వీటిలో సుమారు 80 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అదేవిధంగా, 130 కోట్ల మందికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితులయ్యారు. ఈ విపత్తులు దేశ ఆర్థిక వ్యవస్థకు సుమారు 170 బిలియన్ డాలర్ల నష్టాన్నికలిగించాయని నివేదిక పేర్కొంది. ముఖ్యంగా 1998లో గుజరాత్ తుపాన్లు, 1999లో ఒడిశాలో సూపర్ తుపాను, 2013లో ఉత్తరాఖండ్ వరదలు వంటి ఘటనలు విపరీతమైన విధ్వంసం సృష్టించాయి.
నివేదికలో పేర్కొన్నట్లుగా, వాతావరణ మార్పులు భారత్‌లో అభివృద్ధి, జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది ప్రకృతి విపత్తుల బారిన పడుతున్నారు. కేవలం 2024 సంవత్సరంలోనే రుతుపవనాల తీవ్రత కారణంగా భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు దేశంలోని పలు రాష్ట్రాలను నాశనం చేశాయి. గుజరాత్, మహారాష్ట్ర, త్రిపుర రాష్ట్రాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయి. సుమారు 8 మిలియన్లకు పైగా ప్రజలు తమ ఇళ్లను, ఉపాధిని కోల్పోయారని నివేదిక వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా కూడా పరిస్థితి తీవ్రమైనదే. 1995 నుండి 2024 వరకు ప్రపంచమంతటా 9,700 కంటే ఎక్కువ తీవ్రమైన ప్రకృతి విపత్తులు చోటు చేసుకున్నాయి. వీటిలో 8.3 లక్షలకు పైగా ప్రాణనష్టాలు, 5.7 బిలియన్ల మందికి పైగా ప్రజలు ప్రభావితులు కాగా, ఆర్థికంగా 4.5 ట్రిలియన్ డాలర్ల నష్టం సంభవించిందని జర్మన్ వాచ్ నివేదిక పేర్కొంది. ఈ మూడు దశాబ్దాల విపత్తులలో డొమెనికా దేశం అత్యంత ప్రభావితమైనది. ఆ తర్వాతి స్థానాల్లో మయన్మార్, హోండురాస్, లిబియా, హైతీ, గ్రెనడా, ఫిలిప్పీన్స్, నికరాగ్వా, భారత్, బహామాస్ దేశాలు ఉన్నాయని నివేదిక తెలిపింది.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశంలో వాతావరణ మార్పులు ఇక భవిష్యత్తు సమస్య కాదు, ప్రస్తుత వాస్తవం. వర్షపాతం అసమానతలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తీరప్రాంత తుపానులు, హిమాలయ ప్రాంతాల్లో హిమస్రావాలు అన్నీ కలిపి దేశానికి ముప్పు తెస్తున్నాయి. కాబట్టి వాతావరణ అనుకూలత (climate resilience) చర్యలను వేగవంతం చేయడం అత్యవసరమని వారు సూచిస్తున్నారు.