Amaravathi, November 1: రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సందర్భంగా ఏపీ అంతటా ఈ వేడుకలు జరుపుతున్నారు. కాగా విభజన తర్వాత నవ్యాంధ్ర అవతరణ దినోత్సవాన్ని తొలిసారి అధికారింగా నిర్వహిస్తున్నారు. నవంబరు 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా శుక్రవారం అవరతణ దినోత్సవ వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మొత్తం 3 రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలను విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది.
జాతీయోద్యమ సమయంలోనే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైంది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తమకు అన్యాయం జరుగుతోందంటూ నినదించిన తెలుగువారు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ఇక, తొలిసారిగా ప్రత్యేక రాష్ట్ర ప్రతిపాదన 1912 మేలో నిడదవోలులో జరిగిన గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకుల సదస్సులో వచ్చింది. అయితే, ఇందులో ఎలాంటి తీర్మానం చేయలేదు.
తర్వాత 1913 మే 20న బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభను నిర్వహించారు. ఈ సభలోనూ ప్రత్యేకాంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. అయితే రాయలసీమ, గంజాం, విశాఖ ప్రతినిధులు ప్రత్యేకాంధ్ర ప్రతిపాదనకు అంతగా ఆసక్తి చూపలేదు. తర్వాత పట్టాభి సీతారామయ్య ఈ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి, ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ తరువాత జరిగిన సభల్లో కూడా ప్రత్యేక రాష్ట్రం గురించి చర్చలు జరిగాయి. రెండో ఆంధ్ర మహాసభ 1914లో విజయవాడలో జరిగింది. ఆ సభలో ప్రత్యేకాంధ్ర రాష్ట్రం కావాలని అత్యధిక మద్దతుతో ఒక తీర్మానం చేశారు. అలా నాలుగు దశాబ్దాల్లో అనేక ఉద్యమాల తర్వాత ప్రత్యేక రాష్ట్ర కల సాకారమైంది.
స్వాతంత్రం తర్వాత ఏర్పడిన మొట్టమెదటి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న ఆంధ్రప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా 1953 అక్టోబరు 1న ఏర్పాటుచేశారు. తెలుగు మాట్లాడే ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, రాయలసీమ జిల్లాలతో కలిసి ఆంధ్రరాష్ట్రం ఆవిర్భవించింది. రాష్ట్రాల పునర్విభజన బిల్లు ఆమోదంతో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
హైదరాబాద్ రాజ్యంలోని మరాఠీ జిల్లాలు మహారాష్ట్రకూ, కన్నడమాట్లాడేవారిని కర్ణాటకకు, హైదరాబాద్‌తో కూడుకుని ఉన్న తెలుగు మాట్లాడే ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అలా 1956, నవంబరు 1న అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంతాన్ని, మద్రాస్ నుంచి వేరుపడ్డ ఆంధ్ర రాష్ట్రాన్ని కలిపి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్
అమరజీవి పొట్టి శ్రీ రాములు వంటి మహనీయులు రాష్ట్రం కోసం అనేక త్యాగాలు చేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ రాష్ట్రాభివృద్ధికి పునరంకితమవుదాం. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోభివృద్ధిని సాధించాలని ఆకాంక్షిస్తూ అందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. #APFormationDay
— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2019
1953లో ఆంధ్రరాష్ట్రం 11 జిల్లాలతో కర్నూలు హెడ్ క్వార్టర్స్ గా ఉంది.ఆ తర్యాత కూడా ఉద్యమాలు జరగుతున్నాయి.ఎందుకంటే కేవలం 11 జిల్లాలలోతోనే కాదు తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒక గొడుగు కిందకు రావాలని విశాలాంధ్ర ఏర్పడాలనే బలమైన కోరిక ఉంది.ఈ ఉద్యమాలు చూసి ఆనాటి కేంద్రప్రభుత్వం ధార్ కమిటీని వేసింది. ఆ కమిటీ కూడా తెలుగు మాట్లాడేవారి ఆకాంక్షను గుర్తించింది. కానీ నిర్ణయం తీసుకోలేకపోయారు. 1952లో ధార్ కమిటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి జైపూర్ లో జరిగిన కాంగ్రెస్ కమిటీ నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చారు. ఎట్టిపరిస్దితులలో భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడాలని అనుకున్నారు. దానిపరిణామం నేపధ్యంలోనే పాక్షికంగా 11 జిల్లాలతో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది.
దాని తర్వాత అనూహ్యంగా ఆంధ్రుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఇందులో భాగంగా అమరజీవి పొట్టిశ్రీరాములు ఒకటి కాదు రెండు కాదు 58 రోజులు ఆమరణ దీక్షద్వారా పోరాటం కొనసాగించారు. స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవాళ్లు,గతంలో పోరాటాలు చేసినవారు పొట్టిశ్రీరాములు పోరాటానికి మద్దతు పలికారు. 28 రోజుల తర్వాత అమరజీవి పొట్టి శ్రీరాములు అశువులు బాశారు. ఆ తరువాత ఆనాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూగారు ఆంధ్రప్రదేశ్ ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
పొట్టి శ్రీరాములు త్యాగఫలం
Tributes to the Great Freedom Fighter who sacrificed his life for the state of Anhdra Pradesh. Later his birth district named as Sri Potti Sreeramulu Nellore District. Few may forget you sir but you remain in our hearts !!#JoharPottiSreeramulu #APFormationDay pic.twitter.com/3L3uqwZ8mn
— Manvitha Chinnu (@ManviDad) November 1, 2019
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నవంబరు 1ని అవతరణ దినోత్సవంగా నిర్వహించేవారు. 2013 వరకు ఏపీలో అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. అయితే, 2014 జూన్ 2 న రాష్ట్రం విడిపోవడంతో తెలంగాణలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఆ రోజునే జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం దీనిపై గందరగోళ పరిస్ధితి నెలకొంటూ వచ్చాయి. నవ్యాంధ్రకు తొలి సీఎం అయిన చంద్రబాబు జూన్ 2ను ఏపీ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణిస్తూ నవనిర్మాణ దీక్షలు చేపట్టారు. అవతరణ దినోత్సవాలను అధికారికంగా జరపలేదు.
ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వేడుకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పోస్టర్లను విడుదల చేసింది. పోస్టర్లపై మహాత్మ గాంధీ చిత్రంతో పాటు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న గవర్నర్ హరిచందన్, సీఎం జగన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఫొటోలు మాత్రమే ప్రచురించారు.
తెలంగాణా విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల నిర్వహణపై కేంద్ర హోం శాఖను ఏపీ అధికారులు వివరణ కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ ఆంధ్రప్రదేశ్ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్‌ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో మాదిరిగానే నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది.