Covid Vaccination in AP&TS: వ్యాక్సినేషన్‌కు రెడీ అయిన తెలుగు రాష్ట్రాలు, వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల అందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం
Coronavirus in India | File Image | (Photo Credits: PTI)

Amaravati, Jan 16: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ (Coronavirus Vaccination) కార్యక్రమం తెలుగు రాష్ట్రాల్లో మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. కాగా కరోనా మహమ్మారిని కట్టడి కోసం ప్రపంచంలోనే అతి పెద్దదైన వ్యాక్సినేషన్‌ (Mega Covid-19 vaccination) కార్యక్రమానికి ప్రధాని మోదీ శనివారం శ్రీకారం చుట్టనున్నారు. ఉదయం 10 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, లబ్ధిదారులైన ఆరోగ్య కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడతారు.

ఏపీ రాష్ట్రవ్యాప్తంగా 332 కేంద్రాల్లో 3.87 లక్షల మందికి తొలిదశలో వ్యాక్సిన్‌ (Covid Vaccination in AP) వేసేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడలోని గన్నవరం వ్యాక్సిన్‌ స్టోర్‌ నుంచి అన్ని జిల్లాలకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేశారు. శనివారం ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద నిర్ణయించిన మేరకు ఆరోగ్యశాఖలో పనిచేసే (ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లు) అందరికీ వ్యాక్సిన్‌ వేస్తారు. ఒక్కోకేంద్రం వద్ద రోజుకు 100 మందికి చొప్పున మొత్తం రోజుకు 33,200 మందికి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకున్నారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు, రాష్ట్రస్థాయిలో కుటుంబ సంక్షేమశాఖ అధికారులు టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు.

మొదటి డోసు టీకా ప్రక్రియ సుమారు 15 రోజుల పాటు కొనసాగుతుంది. ఆ తర్వాత 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. ఇప్పటి వరకూ రాష్ట్రానికి 4.7 లక్షల కోవిషీల్డ్, 20 వేల కోవాక్సిన్‌ టీకా డోసులు వచ్చాయి. ప్రతి సెంటర్‌ వద్ద డాక్టర్‌ పర్యవేక్షణ ఉంటుంది. వ్యాక్సినేషన్‌ కేంద్రం వద్ద భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రతి సెంటర్‌లో ఆరుగురు సిబ్బంది పనిచేస్తారు. వ్యాక్సిన్‌ వేసిన తర్వాత ఎవరిలోనైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వారికి తక్షణమే వైద్యసేవలు అందించేందుకు ప్రతి బోధనాసుపత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. ఒక్కో వార్డులో 20 పడకలు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు.

వారికి వ్యాక్సిన్ ఇవ్వొద్దని తెలిపిన కేంద్రం, నేడే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్, పల్స్‌ పోలియో కార్యక్రమం జనవరి 31వ తేదీకి వాయిదా, టీకా తీసుకునే ఆరోగ్య కార్యకర్తలతో సంభాషించనున్న ప్రధాని మోదీ

విజయవాడలోని సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయం 11.25 గంటలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో నిర్ణయించిన మేరకు టీకా కార్యక్రమం ప్రారంభమవుతుందని కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ తెలిపారు. ఆస్పత్రిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, జిల్లా కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్‌ తదితరులు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. ఆస్పత్రి అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష జరిపారు.

ఇక తెలంగాణ వ్యాప్తంగా కోవిట్ వ్యాక్సినేషన్ (Covid Vaccination in TS) ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి టీకా పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి ఈటల శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కరోనావైరస్ టీకాపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు మొదటి టీకాను తానే వేసుకోనున్నట్టు ప్రకటించారు.‘ప్రజలు భయపడొద్దు. ఆ భయాన్ని పోగొట్టడానికి వైద్యారోగ్య శాఖకు కెప్టెన్‌గా తొలిటీకాను నేను తీసుకుంటున్నా’ అని ప్రకటించారు.

పోలీసులు కులం, మతం ఆధారంగా పనిచేయరు, డ్యూటీలో 109 మంది పోలీసులు మరణించారు, ఆలయాల దాడులపై వాస్తవాలను వక్రీకరిస్తున్నారు, మీడియాతో ఏపీ డీజీపీ గౌతం సవాంగ్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య కార్మికుల నుంచి మొదలు ఉన్నతాధికారుల వరకు టీకా వేయబోతున్నట్టు చెప్పారు. టీకా పనిచేస్తుందా? లేదా? అనే అనుమానాలు వద్దన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, అన్ని దేశాల అధినేతలు మానవ కల్యాణం కోసం శ్రమించారని చెప్పారు. ఈ జీనోమ్‌ యుగంలో ఒక వైరస్‌ వల్ల ప్రజలు ఇబ్బంది పడొద్దనే.. వేల కోట్లు ఖర్చు పెట్టి టీకాను అభివృద్ధి చేశారని చెప్పారు.

ప్రతి టీకాకు రియాక్షన్లు ఉంటాయని మంత్రి ఈటల చెప్పారు. పెన్సిలిన్‌ ఇచ్చేముందు కొంత ఇచ్చి టెస్ట్‌ చేస్తారని గుర్తుచేశారు. పెన్సిలిన్‌ కోట్ల మందికి ప్రాణ భిక్ష పెడుతున్నదని, అలాంటి మందు కూడా కొందరికి రియాక్షన్‌ ఇస్తుందని పేర్కొన్నారు. స్వచ్ఛందంగా తీసుకునేవారికే టీకా వేస్తామని స్పష్టం చేశారు. టీకా మొదటి డోసు వేసుకున్న 28 రోజుల తరువాత రెండో డోసు తప్పనిసరిగా వేసుకోవాలని తెలిపారు. కేంద్రం ప్రస్తుతం అందించిన డోసులు ప్రభుత్వ దవాఖానల సిబ్బందికి సరిపోతాయన్నారు. మరిన్ని డోసులు అందిన తర్వాత ప్రైవేట్‌ దవాఖానలకు, దీర్ఘకాలిక రోగులకు, 50 ఏండ్లకు పైబడినవారికి అందజేస్తామని చెప్పారు.

కరోనా టీకాలు సురక్షితమని, నిర్భయంగా వేసుకోవచ్చని ప్రజారోగ్య విభాగం సంచాలకుడు శ్రీనివాసరావు, డీఎంఈ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఏ టీకా వేసుకున్నా జ్వరం, కండరాల నొప్పి, దురదలు వంటి లక్షణాలు కనిపిస్తాయని, అయితే వీటి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో మొత్తం 80 లక్షల మందికి టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నదని వైద్య అధికారులు పేర్కొన్నారు. ఇందుకు ఆరేడు నెలల సమయం పడుతుందన్నారు. ఈ బృహత్‌ కార్యంలో 50 వేల మంది వైద్యసిబ్బంది భాగస్వాములు కానున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి విడుత కింద 3.15 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకా ఇవ్వనున్నట్టు శ్రీనివాసరావు తెలిపారు. శనివారం 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ ప్రారంభిస్తున్నామని, రెండు మూడు వారాల్లో దశల వారీగా కేంద్రాల సంఖ్యను 1,213కు పెంచుతామని వెల్లడించారు.

శనివారం ఒక్కో కేంద్రంలో 30 మందికి టీకా వేస్తామని, ఆ తర్వాత పెంచుకుంటూ పోతామని తెలిపారు. వారానికి నాలుగు రోజులు కరోనా టీకాలను పంపిణీ చేస్తామని తెలిపారు. సోమ, మంగళ, గురు, శుక్ర వారాల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఉంటుందని.. బుధ, శనివారాల్లో పిల్లలు, గర్భిణులకు సాధారణంగా ఇచ్చే ఇమ్యునైజేషన్‌ కార్యక్రమం కొనసాగుతుందని వెల్లడించారు. ఆస్పత్రిలో కనీసం 100 మంది సిబ్బంది ఉంటే అక్కడే టీకా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు.