Amaravati, Feb 10: విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధానిగా (AP Capital Row) అమరావతిని 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసిందని కేంద్రం పార్లమెంట్‌లో చెప్పిన సంగతి విదితమే. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital Issue) అంశం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని కేంద్రం పేర్కొంది. దీనిపై మాట్లాడటం కోర్టు ధిక్కారణ కిందకు వస్తుందని తెలిపింది.
తాజాగా ఏపీ రాజధాని విషయంలో శివరామకృష్ణ కమిటీ నివేదిక (Sivaramakrishnan Committee Report) అమలు చేయాలని జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కాగా, ఈ పిటిషన్‌పై జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం విచారణ చేపట్టింది.ఒకే చోట కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని శివరామకృష్ణ కమిటీ సూచించిన సంగతి తెలిసిందే.
కాగా ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ (Sivaramakrishnan Committee recommendations) స్పష్టంగా తెలిపింది. విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రచారం చేస్తున్నట్లుగా విజయవాడ, గుంటూరు నగరాల మధ్య పెద్ద రాజధాని నిర్మాణం కూడా కరెక్ట్ కాదని ఆ నివేదిక తెలియచేసింది. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగరి అర్బన్ డవలప్‌మెంట్ ఏరియా గోవా రాష్ట్రానికంటే రెండు రెట్లు పెద్దవని కమిటీ తన నివేదికలో తెలిపింది.
విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగరి అర్బన్ డవలప్‌మెంట్ ఏరియా గోవా రాష్ట్రానికంటే రెండు రెట్లు పెద్దవని కమిటీ తన నివేదికలో తెలిపింది. ఇంత పెద్ద ప్రాంతాన్ని పట్టణీకరణ చేసి, హైదరాబాద్‌లో మాదిరిగా రింగ్‌రోడ్ నిర్మించడం సరికాదంది. దేశంలోనే అత్యుత్తమ సాగు భూములు ఉన్న ఈ ప్రాంతంలో చిన్న కమతాలు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిపింది.
వీరంతా ఉపాధి కోల్పోయి, ఆర్థికంగా ఇబ్బందుల పాలవుతారని పేర్కొంది. కొన్ని వర్గాల ప్రజలు తీవ్ర సమస్యలు ఎదుర్కొనడమే గాకుండా.. కృత్రిమంగా రియల్ వ్యాపారం పెరుగుతుందని కూడా కమిటీ హెచ్చరించింది. దీనివల్ల సామాజికంగా కూడా ఎన్నో అనర్థాలు జరుగుతాయంది.విజయవాడ, గుంటూరు నగరాలు సహజంగా అభివృద్ధి చెందుతున్నాయి. రెండు నగరాల మధ్య ప్రాంతం కూడా తనంతట తానే అభివృద్ధి చెందుతోంది. ఇటువంటి సమయంలో అక్కడ రాజధాని పేరుతో భారీ నిర్మాణాలు చేపట్టి, భారీ ఎత్తున ప్రజల్ని అక్కడ దింపడం సరికాదని తెలిపింది.
రాజధానికి వ్యవసాయ భూముల్ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ తీసుకోవాలని సూచించింది.
ఈ ప్రాంతంలో నీరు పై పొరల్లోనే ఉంటుంది. నేల లూజ్‌గా ఉంటుంది. అందువల్ల భారీ నిర్మాణాలకు పునాదులు తీయడం భారీ ఖర్చుతో కూడుకుని ఉంటుందని కూడా శివరామకృష్ణన్ నివేదిక హెచ్చరించింది. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే సామాజిక, ఆర్థిక సమస్యలు ఉత్పన్నమవుతాయని, కొందరు రియల్ వ్యాపారులు మాత్రమే లాభపడతారని కూడా కమిటీ తన నివేదికలో తేల్చి చెప్పింది.
శివరామకృష్ణ కమిటీ తెలిపిన సిఫార్సులు ఇవే..
- ఏపీలో ఏకైన అతిపెద్ద రాజధాని ఏర్పాటు సరైంది కాదు.
- రాష్ట్రంలో రాజధానిని, అధికార వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
- ప్రభుత్వ వ్యవస్థలను ఒకేచోట కాకుండా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి.
- విజయవాడ-గుంటూరు, విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర, శ్రీకాళహస్తి-నడికుడి, రాయలసీమ ప్రాంతాల మధ్య ప్రభుత్వ వ్యవస్థలను వికేంద్రీకరించాలి.
- అసెంబ్లీ, సెక్రటేరియట్ ఎక్కడ ఉంటాయో అక్కడే హైకోర్టు ఉండాలని లేదు.
- హైకోర్టు ఒక ప్రాంతంలో, మరో ప్రాంతంలో బెంచ్ ఏర్పాటు చేయవచ్చు. - ఉత్తరాంధ్ర, రాయలసీమలో ప్రభుత్వాధికార వ్యవస్థల్ని విస్తరించాలి.
- రాజధానిని రెండు పట్టణాల మధ్య పూర్తిగా కేంద్రీకరిస్తే రాష్ట్రంలో ఇతర ప్రాంతాల అభివృద్ధి అవకాశాలు దెబ్బతింటాయి.
- ముఖ్యంగా(గుంటూరు-విజయవాడ మధ్య) సారవంతమైన పంటలకు తక్కువ నష్టం జరిగేలా రాజధాని ఏర్పాటు చేయాలి.
- విజయవాడ-గుంటూరు మధ్య భూగర్భ జలమట్టం చాలా పైకి ఉంటుంది. ఈ ప్రాంతం భూకంప క్షేత్రం. అందుకే ఇక్కడ భారీ భవనాల నిర్మాణం సరైంది కాదు.
- అన్ని జిల్లాల ప్రధాన నగరాల్లో సమాగ్రాభివృద్ధికి విధివిధానాలను రూపొందించాలి.