TS Cabinet Decisions: ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీకి ఆమోదం.. జూన్ నెల నుంచే వేతనాల పెంపు అమలు, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల మంజూరు, వ్యవసాయ భూముల డిజిటలైజన్, తెలంగాణ కేబినేట్ నిర్ణయాలు ఇవే!
Telangana CM K Chandrasekhar Rao | File Photo

Hyderabad, June 9: సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం మంగళవారం ప్రగతి భవన్ లో జరిగింది. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు సుమారు తొమ్మది గంటల పాటు సుధీర్ఘంగా సాగిన సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన కేబినెట్, పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో పగటిపూట లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఇరిగేషన్ రంగాన్ని పటిష్టం చేసి వ్యవసాయంలో గుణాత్మక మార్పులు సాధించిన తరహాలోనే, రాష్ట్రం లోని ప్రజారోగ్య వైద్య రంగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కేబినెట్ తీర్మానించింది. రానున్న రెండేళ్లలో 10,000 కోట్ల రూపాయలను ఖర్చు చేసి రాష్ట్రం లోని పేదలకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు పూర్తి వివరాలు ప్రణాళికతో రిపోర్ట్ సమర్పించాలని మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సబ్ కమిటీకి కేబినెట్ సూచించింది.

వీటితో పాటు ఉద్యోగుల పీఆర్సీ పెంపుదల, పెండింగ్‌లో ఉన్న రేషన్ కార్డుల జారీ, వానాకాలంలో చేపట్టే వ్యవసాయ పనులు, భూముల డిజిటలైజేషన్ తదితర అంశాలకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ భేటీలో మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాలు, ఆమోదించిన అంశాలు ఇలా ఉన్నాయి.

పీఆర్సీకి కేబినెట్ ఆమోదం:

 

ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ (9,21,037 మందికి) 30 శాతం పీఆర్సీ ప్రకటిస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. నోషనల్ బెనిఫిట్ ను 01/7/2018 నుంచి, మానిటరీ బెనిఫిట్ ను 01/04/2020 నుంచి, క్యాష్ బెనిఫిట్ ను 01/04/2021 నుంచి అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేయాలని అధికారులను ఆదేశించింది.

పెన్షనర్లకు 01/4/2020 నుంచి 31/5/2021 వరకు చెల్లించాల్సిన ఏరియర్స్ (బకాయిలను) 36 వాయిదాల్లో చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది.

కేజీబీవీ కాంట్రాక్టు ఉద్యోగులకు 180 రోజుల ప్రసూతి సెలవును మంజూరు చేయాలని నిర్ణయించింది. హెచ్ ఆర్ ఏ మీద పరిమితిని తొలగించాలని కేబినెట్ నిర్ణయించింది.

పౌర సరఫరాలకు సంబంధించిన కేబినెట్ నిర్ణయాలు:

రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని కేబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు.

వ్యవసాయానికి సంబంధించిన కేబినెట్ నిర్ణయాలు:

వానాకాలం సాగుపై వ్యవసాయశాఖ సంసిద్ధత మీద క్యాబినెట్ లో పూర్తిస్థాయి సమీక్ష జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై క్యాబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగి కలిపి 1,06,03,927 ఎకరాల్లో కేవలం వరి పంట సాగు చేయడం ద్వారా సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి రావడం పట్ల కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది.

2,601 వ్యవసాయ క్లస్టర్లలో రైతు వేదికల కేంద్రంగా  ఏఈఓలు రైతులకు పూర్తిగా అందుబాటులో ఉంటూ వారికి పంటలకు సంబంధించిన సలహాలు, సూచనలు అందించాలని, వానాకాలం సాగుకోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశించింది.

హైదరాబాద్ జిల్లా మినహా, పాత తొమ్మిది జిల్లాల్లో తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల (టీ.ఎస్.ఎఫ్.పి.జెడ్) ఏర్పాటుకు కేబినెట్ అనుమతించింది. ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఈ యాసంగిలో ఇప్పటికే సుమారు 84 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, మిగిలిన కొద్దిపాటి ధాన్యం కొనుగోళ్లను కూడా వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను, జిల్లాల కలెక్టర్లను సీఎం ఆదేశించారు.

డిజిటల్ సర్వే నిర్ణయాలు:

రాష్ట్రంలోని అన్ని వ్యవసాయం భూములకు వాటి కొలతల ప్రకారం డిజిటల్ సర్వే చేపట్టి వాటికి అక్షాంశ రేఖాంశాలను (కో ఆర్డినేట్స్) ను నిర్ధారించాలని, అందుకు సంబంధించి పాత ఉమ్మడి 9 జిల్లాల్లో జిల్లాకు 3 గ్రామాల చొప్పున 27 గ్రామాల్లో సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని, ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది.

వ్యవసాయ భూముల సెటిల్ మెంట్ అనే వ్యవహారమే ఉత్పన్నం కాదని,  రాష్ట్ర ప్రభుత్వ అమల్లోకి తెచ్చిన నూతన ఆర్వోర్ చట్టం- 2020 ప్రకారం, రాష్ట్రంలోని 99 శాతం వ్యవసాయ భూములు ఎటువంటి సమస్యలు లేకుండా ఇప్పటికే ధరణిలో నమోదైనట్లు కేబినెట్ కు రెవిన్యూ శాఖ వివరించింది.

రైతుల భూములకు హద్దురాల్లు, కాగితాల మీద ఉండే కొలతలు ఇకనుంచి అదే లెక్కలతో అవే హద్దులు డిజిటల్ రూపంలోకి మారుతాయని, రాల్లు ఊడిపోయినా, కొలతల కాగితాలు చినిగిపోయినా రైతుల పట్టా భూములకు ఇంచు తేడా రాకుండా డిజిటల్ మ్యాప్ ద్వారా రక్షణ లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.