Howdy, Modi Highlights: ఉగ్రవాదంపై ఇమ్రాన్ ఖాన్‌కి దిమ్మతిరిగే కౌంటర్. ట్రంప్ మన వాడే అన్న నరేంద్రుడు, సెప్టెంబర్ 27న ఏం జరగబోతోంది? అమెరికాలో ప్రధాని కోరిన కోరిక ఏంటీ? మెగా ఈవెంట్ హైలెట్స్‌పై ప్రత్యేక కథనం
pm-modi-slams-pakistan-over-terror-howdy-modi ( Photo-getty)

Houston,Septemeber 23: అగ్రరాజ్యం అమెరికా హౌడీ మోడీ అంటూ గర్జించింది. భారత ప్రధాని నరేంద్ర మోడీ రాకతో టెక్సాస్ మినీ భారత్ లా మారిపోయింది. హ్యూస్టన్ నగరం మోడీ, మోడీ అనే నినాదాలతో హోరెత్తిపోయింది. ఉమ్మడి స్వప్నం, ఉజ్వల భవిత పేరుతో టెక్సాస్ ఇండియా ఫోరం నిర్వహించిన కార్యక్రమం ఓ పెద్ద పండుగ వాతావరణాన్నే తలపించింది. ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలయికతో ఇరుదేశాల మధ్య వాణిజ్య బంధానికి కొత్త దారులు ఏర్పడ్డాయి. ఉగ్రవాదంపై యుద్ధం చేయడానికి ఇరుదేశాలు సై అన్నాయి. అయితే ఈ ఈవెంట్ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కి ఓ హెచ్చరిక లాంటిదేనని చెప్పవచ్చు. ఆర్టికల్ 370 రద్దుని వ్యతిరేకిస్తున్న పాక్ ప్రపంచదేశాల మద్ధతు కూడగడుతోంది. ఏ దేశం దానికి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 27 కీలకంగా మారింది. ఆ రోజున నరేంద్ర మోడీ , ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాలు ఉండనున్నాయి.

కశ్మీర్ అంశంపై పట్టు వదలని పాక్

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కౌన్సిల్ సమావేశాల్లో కశ్మీర్ అంశంపై తీర్మానం ప్రవేశపెడతామన్న పాక్, తీర్మానం ప్రవేశపెట్టడానికి అవసరమైన 15 మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో విఫలమైంది. గడువులోగా తీర్మానం ప్రవేశపెట్టలేక చెతులెత్తేసింది. అయినప్పటికీ పట్టు విడవకుండా ఐక్యరాజ్యసమితి( United Nations)లో కశ్మీర్ ప్రస్తావన ( Kashmir issue)తీసుకురావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 74వ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తానని పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Pak Pm Imran Khan)ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఇస్లామిక్ దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా (Saudi arabia) రాజు సల్మాన్ బిన్ అబ్దులాజీజ్ అల్ సాద్‌తో భేటీ అయ్యారు.

సెప్టెంబర్‌ 27న ఇరు దేశాధినేతల ప్రసంగాలు

యూఎన్ విడుదలచేసిన ప్రాథమిక జాబితా ప్రకారం.. సెప్టెంబర్‌ 27న రాత్రి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi) ప్రసంగిస్తారు. తర్వాత పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అదేరోజు అర్ధరాత్రి మాట్లాడే అవకాశం ఉంది. సమావేశం నుంచి కొందరు నాయకులు తప్పుకుంటే ఇమ్రాన్‌ ఖాన్‌కు నిర్ణీత సమయం కన్నా ముందే మాట్లాడే అవకాశం లభిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం ఇమ్రాన్‌ ఖాన్‌ తన ప్రసంగంలో భారత్‌లో కశ్మీర్‌కు ఆర్టికల్‌370 (Article 370)రద్దు చేసిన నేపథ్యంలో అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనపై మాట్లాడేందుకు అవకాశం ఉంది. కాగా, కశ్మీర్ అంశం తమ అంతర్గత వ్యవహారమని ఇప్పటికే అంతర్జాతీయ సమాజానికి భారత్ స్పష్టం చేసింది. అలాగే ఐరాస మానవహక్కుల కౌన్సిల్‌లో ఇస్లామిక్ దేశాలు సైతం పాకిస్థాన్ వాదనలు సమర్ధించలేదు. ఆర్టికల్ 370 విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో ఇరువురు ప్రసంగం ఎలా ఉండబోతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఆర్టికల్ 370 భారత్ అంతర్గత వ్యవహారం: ఈయూ

ఇదిలా ఉంటే యూరోపియన్ పార్లమెంటులో జరిగిన చర్చ సందర్భంగా పలువురు మంత్రులు పాక్‌పై ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. కశ్మీర్‌కు ప్రత్యేక హక్కులు కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని, తాము ఆ దేశ సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తామని, కశ్మీరు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు ఇరు దేశాలు ప్రత్యక్ష చర్చలు జరపాలని ఎంయూపీ సూచించింది. ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో జరిగిన యూరోపియన్ యూనియన్ జనరల్ అసెంబ్లీ సమావేశంలో స్పెయిన్, ఫ్రాన్స్, పోలండ్, బ్రిటన్ సభ్యులు భారత దేశానికి పూర్తిమద్దతుగా నిలిచారు. అత్యధిక శాతం ఎంపీలు భారత్‌కు మద్దతుగా, పాకిస్థాన్‌ను అస్పష్టమైన దేశంగా అభివర్ణించారు. కశ్మీరు విషయంలో తాము జోక్యం చేసుకోమని పేర్కొన్నారు. దీంతో కాశ్మీర్ కి ఎదురుదెబ్బ తగిలింది.

ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు

అమెరికా, భారత్ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని తరిమికొడతామని హౌడీ మోడీ ఈవెంట్లో నరేంద్రమోడీ అన్నారు. ఉగ్రవాదం అంతం పంతం. ఉగ్రవాదం అంతానికి ట్రంప్ మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు. అమెరికా, భారత్ ఉమ్మడిగా ఉగ్రవాదాన్ని తరిమికొడతామని.. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది ఎవరో ప్రపంచానికి తెలుసన్నారు. 9/11 ఉగ్రదాడులు, 26/11 ముంబై ఉగ్రదాడుల మూలం ఒక్కటేనని ప్రధాని మోదీ గుర్తుచేశారు. భారత్ అభివృద్ధి దూసుకెళ్తుంటే కొందరు చూడలేకపోతున్నారని దాయాది దేశానికి చురకలంటించారు. అలాగే ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూకాశ్మీర్ లో దుర్వినియోగానికి గురైందని, అందుకే రద్దు చేశామని మోదీ అన్నారు.

మోడీ ట్రంప్ ఆత్మీయ కలయిక

ఉభయ సభల్లోనూ ఆర్టికల్ 370పై గంటల తరబడి చర్చ జరిగిందని.. ఎగువ సభలో బలం లేకున్నా బిల్లుకు మద్దతు లభించిందన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్ ప్రజలకు స్వేచ్ఛ కల్పించామని.. రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ కాశ్మీర్ ప్రజలకు వర్తిస్తాయన్నారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యకు ముగింపు పలికామన్నారు. 2, 3 రోజుల్లో ట్రంప్‌తో చర్చలు జరపనున్నాం. భారత్, అమెరికాలకు ప్రయోజనం చేకూర్చే మరిన్ని అంశాలపై చర్చించనున్నాం. ఆయన చర్చలు జరపడంలో సిద్ధహస్తుడు. ఆయన నుంచి నేను కూడా నేర్చుకుంటున్నా. కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు 21వ శతాబ్దంలో అభివృద్ధి పథంలో సాగేందుకు భారత్, అమెరికాలు కలసి సాగాల్సి ఉంది. చివరగా థాంక్యూ హ్యూస్టన్‌.. థాంక్యూ అమెరికా.. గాడ్‌ బ్లెస్‌ యూ ఆల్‌.. అంటూ మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.

డొనాల్డ్ ట్రంప్ ప్రసంగంలో ముఖ్యాంశాలు

కరడుగట్టిన ఇస్లామిక్‌ ఉగ్రవాదం నుంచి సామాన్య ప్రజలకు రక్షణ కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ ఈవెంట్ వేదికగా తెలిపారు. భారత్, అమెరికాకు సరిహద్దు భద్రతే అత్యంత కీలకమని చెప్పారు. హౌడీ మోదీ కార్యక్రమంలో ఆయన మొత్తం 25 నిమిషాలపాటు ప్రసంగించారు. భారత్‌–అమెరికా మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా త్వరలో పలు రక్షణ ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేయనున్నట్లు తెలిపారు. తమ పౌరులను భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం భారత్, అమెరికాకు ఉందన్నారు. అలాగే మన సరిహద్దులను రక్షించుకోవాలన్నారు. సరిహద్దు భద్రత భారత్‌కు కీలకాంశమని, దాన్ని అమెరికా గుర్తించిందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. తమ దక్షిణ సరిహద్దు(మెక్సికో) రక్షణకు కనీవినీ ఎరుగని చర్యలు చేపడుతున్నామని, అక్రమ వలసలకు సమర్థంగా అడ్డుకట్ట వేస్తున్నామని తెలిపారు. అక్రమ వలసలతో ముప్పు తప్పదని హెచ్చరించారు. ఈ సంధర్భంగా నరేంద్ర మోడీ పాలనను ఆయన కొనియాడారు.

నా కోరిక తీరుస్తారా..?

ఈ ఈవెంట్ తర్వాత భారత కమ్యూనిటీతో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. హ్యూస్టన్ లో గాంధీ మ్యూజియం శంకుస్థాపన సంధర్భంగా ప్రవాస భారతీయులను ఓ చిన్న కోరిక కోరారు. ప్రతి ఏటా భారతీయేతర కుటుంబాలను మనదేశానికి పర్యటనకు పంపాలని అడిగారు.

పీఎంవో కార్యాలయం ట్వీట్

నాకోసం మీరంతా ఓ పని చేస్తారా అనగానే అక్కడున్న వారంతా తప్పకుండా చేస్తామని చేతులు పైకెత్తారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులందర్నీ కోరుతున్నా. ప్రతి సంవత్సరం మీరంతా కనీసం ఐదు భారతీయేతర కుటుంబాలను భారత పర్యటనకు పంపండి అని అన్నారు. దీనికి వారంతా తప్పకుండా పంపుతామని సమాధానం ఇచ్చారు. ఈ వీడియోని పీఎంవో కార్యాలయం తన ట్విట్టర్ వేదికగా పంచుకుంది.