Colombo, May, 12: ఓవైపు తీవ్రమైన ఆర్థిక సంక్షోభం.. మరోవైపు నిరసన భగ్గమంటున్న జ్వాలలు.. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) నియమితులయ్యారు. గురువారం సాయంత్రం ఆయన పదవీ ప్రమాణస్వీకారం చేశారు. శ్రీలంక (Sri Lanka) రాజకీయాల్లో కొన్నిరోజులుగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ప్రజాగ్రహం, తీవ్ర ఒత్తిడికి తలొగ్గి ప్రధాని పదవి నుంచి మహింద రాజపక్స (Mahinda rajapakse) వైదొలగాల్సి వచ్చింది. ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స(Gotabayarajapakse) సోదరుడు మహింద రాజపక్స ప్రధాని పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి రణిల్ విక్రమసింఘే పేరు ఎక్కువగా వినిపించింది. కొత్త ప్రధాని రేసులో ఆయనే ముందున్నారు.
United National Party leader Ranil Wickremesinghe appointed as the new Prime Minister of Sri Lanka.
(File photo) pic.twitter.com/oRf3jwSKqO
— ANI (@ANI) May 12, 2022
గతంలోనూ అనేక పర్యాయాలు ప్రధానిగా వ్యవహరించిన రణిల్ విక్రమ సింఘే (Ranil Wickremesinghe) ఆరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఆయన సొంత పార్టీ యునైటెడ్ నేషనల్ పార్టీలో హర్షం వ్యక్తమైంది. రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశాక పార్లమెంటులో మెజారిటీ సభ్యుల మద్ధతు సాధిస్తారని యునైటెడ్ నేషనల్ పార్టీ చైర్మన్ వజిర అబేవర్ధనే ఆశాభావం వ్యక్తంచేశారు. శ్రీలంకలో తీవ్రమైన ఆర్థిక సంకోభం (Crisis) నెలకొంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు అడుగంటిపోయాయి. వాణిజ్యం దారుణంగా పడిపోయింది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. దీనంతటికి కారణం ప్రభుత్వమే అని ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు రోడెక్కి ఆందోళనలు, నిరసనలు చేస్తున్నారు. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న రణిల్ విక్రమసింఘే (Ranil Wickremesinghe) ఎలాంటి పాత్ర పోషిస్తారు, తన అనుభవంతో దేశాన్ని ఏ విధంగా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
225 సీట్లున్న శ్రీలంక పార్లమెంటులో యునైటెడ్ నేషనల్ పార్టీ తరఫున ఎన్నికైన ఒకే అభ్యర్థి రణిల్ విక్రమసింఘె. ఒకే పార్లమెంటు సీటు ఉన్నప్పటికీ ఆయనకు అన్ని పార్టీలు మద్దతు లభించింది. దీంతో ప్రధాని అయ్యారు. ఇది ఇలా ఉంటే, దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సే సైతం పదవి నుంచి దిగిపోవాలని లంక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆయన మాత్రం దీనికి అంగీకరించడం లేదు.
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం ఏర్పడ్డప్పటి నుంచి ప్రధానమంత్రి, అధ్యక్షుడు, ఇతర మంత్రులు రాజీనామాలు చేయాలని ప్రజలు శాంతియుత నిరసనలు చేస్తున్నారు. అప్పటి ప్రధాని మహింద రాజపక్స నివాసం ఎదుట కూడా ఈ ప్రదర్శనలు జరిగాయి. అయితే, సోమవారం రాజధాని కొలంబోలో శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై మహింద రాజపక్స అనుచరులు దాడులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా హింస చెలరేగింది. ఈ హింసాకాండలో అధికార పార్టీ ఎంపీ సహా తొమ్మిది మరణించారు. అధికార పార్టీ ఎంపీలు, మిత్ర పక్ష పార్టీల నేతల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణిచివేసేందుకు సోమవారం రాజపక్స మద్దతుదారులైన సుమారు మూడు వేల మందిని బస్సుల్లో నిరసన జరుగుతున్న ప్రాంతానికి తరలించారు. ప్రశాంతంగా నిరసనలు చేస్తున్న వారిపై రాజపక్స మద్దతుదారులు దాడులు చేశారు. ప్రభుత్వ భద్రతా సిబ్బంది కూడా నిరసనకారులపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా తలెత్తిన హింసాకాండలో బౌద్ధ సన్యాసులు, చర్చి ఫాదర్లతో సహా సుమారు 225 మంది గాయపడ్డారు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులపై హింసాత్మక దాడుల కేసులో శ్రీలంక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మాజీ ప్రధాని మహింద రాజపక్స, ఇతర మిత్రపక్ష నేతలు దేశం విడిచిపోకుండా కోర్టు నిషేధం విధించింది. వారిలో రాజపక్స కుమారుడు నమల్ రాజపక్సతో పాటు మరో 15 మంది మిత్రపక్ష నేతలు ఉన్నారు.