Hyderabad, SEP 20: మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ అవార్డుకు (Akkineni Nageswara Rao National Award) ఎంపికయ్యారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitab) ముఖ్య అతిథిగా హాజరై చిరంజీవికి (Chiranjeevi) అవార్డును అందజేయనున్నారు. ఈ విషయాన్ని నటుడు అక్కినేని నాగార్జున ప్రకటించారు. శుక్రవారం అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో వేడుకలు నిర్వహించారు. ఆర్కే సినీ ప్లెక్స్‌లో ఏఎన్నార్ శత జయంతి వేడుకలు జరిగాయి. కార్యక్రమానికి నాగార్జునతో పాటు కుటుంబ సభ్యులు, ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ తన తండ్రి నాగేశ్వరరావు నవ్వుతూ జీవించడం నేర్పించారన్నారు. ఈ వారాంతంలో ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతోందని.. అన్నపూర్ణ స్టూడియోలో అభిమానులు రక్తదానం చేశారన్నారు. అభిమానుల ఆదరణ మా కుటుంబం ఎప్పుడూ మరిచిపోదన్నారు. రెండేళ్లకోసారి ఏఎన్నాఆర్ అవార్డులు ఇస్తున్నామని.. ఈ సారి చిరంజీవికి ఇవ్వాలని నిర్ణయించుకున్నామన్నారు. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.
అక్కినేని శత జయంతి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయనను స్మరించుకున్నారు. ఆల్ టైమ్ గ్రేట్ నటుల్లో ఒకరైన నాగేశ్వరరావుని ఆయన శత జయంతి రోజున స్మరించుకుందామన్నారు. నాగేశ్వరరావు నటనా మేధావి అన్న ఆయన.. అద్భుతమైన నటనా ప్రదర్శనలు తెలుగు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయాయరన్నారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివన్నారు. మెకానిక్ అల్లుడు సినిమాలో ఆయనతో కలిసి నటించే అవకాశం, అదృష్టం తనకు దక్కిందన్నారు. ఆయనతో గడిపిన క్షణాలు, ఆయన అద్భుత జ్ఞాపకాలను ఎప్పటికీ గౌరవిస్తానని మెగాస్టార్.. నాగేశ్వరరావుతో కలిసి ఉన్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.