Chennai, NOV 23: ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ (AR Rahman) ఇటీవల వార్తల్లో వ్యక్తిగత నిలిచారు. ఆయన తన భార్య సైరా భానుతో విడిపోతున్నట్లు ఈ నెల 19న ప్రకటించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తాజాగా ఏఆర్ రెహమాన్ లీగల్ టీమ్ నోటీసులు జారీ (Legal Notice) చేసింది. ఆయన వ్యక్తిగత జీవితం గురించి అవమానకంగా, అసభ్యకరంగా, అసత్యాలు రాస్తే చట్టరీత్యా చర్యలు తప్పవంటూ లీగల్ టీమ్ స్పష్టం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా నోటీసులను షేర్ చేసింది. ఎవరైనా అసత్య ప్రచారం చేస్తే వారిపై పరువు నష్టం దావా వేయాలని రెహమాన్ చెప్పినట్లుగా లీగల్ టీమ్ (AR Rahman Legal Team) పేర్కొంది. అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచురించిన వారంతా 24 గంటల్లోగా తొలగించాలని.. లేకపోతే ఇండియన్ జస్టిస్ కోడ్-2023 ప్రకారం చట్టరీత్యా చర్యలు (Legal Notice) తప్పవని పేర్కొన్నారు.
AR Rahman Team Issued Legal Notice
Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x
— A.R.Rahman (@arrahman) November 23, 2024
ద్వేషాన్ని, అభ్యంతరకర కంటెంట్ (Objectionable Content) షేర్ చేసిన వారంతా తొలగించాలని.. వారంతా రెహమాన్ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు కుటుంబానికి సైతం మనోవేధనను కలిగిస్తున్నారంటూ లీగల్ టీమ్ పేర్కొంది. ఇదిలా ఉండగా.. రెహమాన్ తన భార్య సైరా భానుతో దాదాపు 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్లుగా వారి తరఫున న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలోనే రెహమాన్ విడాకులపై స్పందిస్తూ.. తమ పెళ్లి బంధం 30 సంవత్సరాలకు చేరబోతుందని ఆనందించామని.. అనుకోని విధంగా ఇలా వైవాహిక బంధానికి ముగింపు పలకాల్సి వచ్చిదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
పగిలిన హృదయాలు మళ్లీ అతుక్కోలేవని.. అయినా తమ దారుల్లో అర్థాన్ని వెతుక్కుంటామన్నారు. ఈ కఠిన పరిస్థితుల్లోనే వ్యక్తిగత గోప్యతను అర్థం చేసుకుంటారని భావిస్తున్నట్లుగా పేర్కొన్నారు. రెహమాన్ 1995లో సైరా భానుని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఖతీజా, రహీమా, అమీన్ సంతానం.