Image used for representation purpose only | Photo Twitter

Hyderabad, February 22: తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా కలెక్టర్ (Jagtial  District Collector) తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందని జిల్లా పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా హీరోయిన్ రష్మిక మందానపై (Rashmika Mandanna) కామెంట్  చేసిన విషయాన్ని కలెక్టర్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు.

వివరాల్లోకి వెళ్తే, ఫిబ్రవరి 18న హీరోయిన్ రష్మిక మందాన తన ట్విట్టర్ ఖాతాలో రెండు ఫోటోలను పోస్ట్ చేసింది. దానికి "ఒక క్షణం నీవైపు చూసి చిరునవ్వు చిందించనీ" అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. ఇలా రష్మిక పోస్ట్ పెట్టిన కొద్దిసేపటికే "చించావు పో, రష్మిక" అని జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి (Gugulot Ravi) అధికారిక ఖాతా (@Collector_JGTL) నుంచి ఈ కామెంట్ వచ్చింది.

దీంతో ఈ కామెంట్ చూసి నెటిజన్లందరూ షాక్ తిన్నారు. ఇది నిజంగానే జిల్లా కలెక్టర్ ఒరిజినల్ అకౌంటేనా లేక ఫేక్ అకౌంటా? అని కొంతమంది సందేహం వ్యక్తం చేయగా, ఒక జిల్లా స్థాయి అధికారి ఈ తరహా నటి ఫోటోపై కామెంట్ చేయడం సరైంది కాదని మరికొందరు, ఏంటి ప్రజలకు ఎప్పుడు జవాబు ఇవ్వని కలెక్టర్, సినిమా స్టార్ ఫోటోపై మాత్రం కామెంట్లు చేస్తారా? అని ఇంకొదరు కామెంట్లు చేయడం ప్రారంభమైంది. ఇలా రష్మిక ఫోటోను వదిలి, దాని కింద కలెక్టర్ పేరుతో ఉన్న కామెంట్ పైనే విపరీతమైన కామెంట్స్ వచ్చి చేరాయి.

వివాదం రేపిన రష్మిక ఫోటో ఇదే:

వెంటనే ఈ ట్వీట్ ఇంటర్నెట్లో ఇది వైరల్ అయిపోయి, స్థానిక న్యూస్ మీడియాలో కథనాలు కూడా వచ్చేశాయి.

జరిగిన నష్టాన్ని ఆలస్యంగా కలెక్టర్ దృష్టికి వచ్చింది, ఆ వెంటనే ఆ కామెంట్ కూడా డిలీట్ చేయబడింది. దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన కలెక్టర్ కార్యాలయంలోని ఇద్దరు సిబ్బందిపై కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రష్మిక నటించిన తాజా చిత్రం 'భీష్మ' మూవీ ప్రస్తుతం పైసా వసూల్ టాక్ తో థియేటర్లలో మంచి కలెక్షన్లు రాబడుతోంది.