Dermatomyositis: దంగ‌ల్ న‌టి మ‌ర‌ణానికి అస‌లు కార‌ణం ఈ వ్యాధే! ఇంతకీ సుహానీకి వ‌చ్చిన వ్యాధి పూర్తి వివ‌రాలు మీకు తెలుసా?

New Delhi, FEB 18: ‘దంగల్’ నటి సుహానీ భట్నాగర్ (Suhani) 19 సంవత్సరాల వయసులో చనిపోవడం అందర్నీ షాక్‌కి గురి చేసింది. తాజాగా ఆమె ‘డెర్మాటోమయోసిటిస్’ (Dermatomyositis) అనే అరుదైన వ్యాధి కారణంగా చనిపోయినట్లు నిర్ధారణ అయ్యింది. సుహానీ భట్నాగర్ ‘దంగల్’ (Dangal Actor) సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ బబితా ఫోగట్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తర్వాత అనేక ఆఫర్లు వచ్చినా చదువుపై ఫోకస్ పెట్టిన సుహానీ స్టడీస్ కంప్లీట్ అయ్యాక సినిమాలు చేయాలని అనుకున్నారు. అనూహ్యంగా ఈ నటి అనారోగ్య కారణాలతో కన్నుమూయడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ప్రమాదంలో కాలు ఫ్రాక్చర్ కావడంతో ట్రీట్మెంట్ తీసుకుంటున్న సమయంలో మందులు రియాక్షన్ కావడం వల్ల బాడీకి నీరు పట్టిందని.. ట్రీట్మెంట్‌లో ఉండగానే ఆమె చనిపోయారని తెలిసింది. అయితే తాజా వార్తల ప్రకారం ఆమెకు రెండు నెలల క్రితం ‘డెర్మాటోమయోసిటిస్’ (Dermatomyositis) వ్యాధి లక్షణాలు కనిపించాయని.. పది రోజుల క్రితమే వ్యాధి నిర్ధారణ అయిన క్రమంలో చికిత్స తీసుకుంటూ చనిపోయారని వైద్యులు నిర్ధారించారు.

Suhani Bhatnagar Dies: దంగల్‌ చిత్రంలో చిన్నారి బబితా పాత్రలో నటించిన సుహానీ భట్నాగర్ కన్నుమూత..  

ఫిబ్రవరి 7వ తేదీన సుహానీ చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్( AIIMS) లో చేరారు. చికిత్స తీసుకుంటూ ఫిబ్రవరి 16న చనిపోయారు. ‘డెర్మాటోమయోసిటిస్’ వ్యాధితో ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ యొక్క అధికారిక పేజీ ప్రకారం ‘డెర్మాటోమయోసిటిస్’ అనేది కండరాల వాపు, చర్మంపై దద్దుర్లు కలిగించే అరుదైన వ్యాధి అట. ఈ వ్యాధి ఏ వయసులోనైనా సంభవించే అవకాశం ఉంటుందట.

తరచుగా 50 నుండి 70 సంవత్సరాల వయసులో ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందట. ఈ అరుదైన వ్యాధితో బాధపడేవారిలో లూపస్, లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి ఇబ్బందులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందట. కొందరిలో చర్మంపై ఎండ తగిలితే ఎరుపు లేదా ఊదా రంగు దద్దుల్లు వచ్చి దురద కలుగుతుందట. కనురెప్పలు వాపు, పిడికిలి, మోచేతులు, మోకాళ్లు, కాలి వేళ్లపై మచ్చలు, పొలుసులు, చర్మం గరుకుగా ఉండటం, జుట్టు పల్చబడటం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయట. కొందరిలో చర్మం కింద గడ్డలు ఏర్పడతాయట. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 5 నుండి 6 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు సుహానీ భట్నాగర్ తండ్రి సుమిత్ భట్నాగర్ మీడియాకు వెల్లడించారు. ఇక సుహానీ విషయానికి వచ్చేసరికి రెండు నెలల క్రితం ఆమె చేతులపై ఎర్రటి మచ్చలు వచ్చాయట. కొన్ని ఆసుపత్రులలో వైద్యుల్ని సంప్రదించినా వ్యాధి నిర్ధారణ కాలేదట. చివరికి బాడీలో ఇన్ఫెక్షన్ మొదలై నీరు పట్టి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయట. వెంటిలేటర్‌పై ఉంచినా ఆరోగ్యంలో మెరుగుదల కనిపించలేదట. అలా ఇబ్బంది పడుతూ సుహానీ మరణించారు.