Gaddalakonda Ganesh 'All-In-One' Review: గద్దలకొండ గణేశ్ అలియాస్ వాల్మీకి ఎలా ఉన్నాడు,  ఆసక్తికలిగించే అంశాలేంటి? సినిమా టాక్ ఎలా ఉంది, రివ్యూస్ ఎలా వచ్చాయి? సమగ్ర కథనాల సమాహారం ఇక్కడ చూడండి
Gaddalakonda Ganesh | Photo Credits: 14 Reels Plus.

Hyderabad, September 20: తమిళంలో బంపర్ హిట్ అయిన 'జిగర్తాండా' అనే సినిమాను రీమేక్ చేస్తూ దర్శకుడు హరీశ్ శంకర్ 'వాల్మీకీ' (Valmiki) పేరుతో సినిమాను తెరకెక్కించారు. అయితే సినిమా టైటిల్ పట్ల వివాదం నెలకొనడంతో రిలీజ్‌కు కొన్నిగంటల ముందు ఈ సినిమాలోని హీరో పాత్ర "గద్దలకొండ గణేశ్"  (Gaddala Konda Ganesh) పేరునే సినిమా టైటిల్‌గా సినిమా యూనిట్ మార్చివేసింది.  ఇన్నిరోజుల వరకు వాల్మీకి గా బాగా ప్రచారం లభించిన తర్వాత సినిమా పేరు మారిపోవడం ఈ సినిమాకు కొంతవరకు నష్టం కలిగించే అంశమే అయినా, సినిమాలో దమ్ముంటే ఎలాంటి అడ్డంకులనైనా తట్టుకొని నిలబడుతుంది, అలాంటి సందర్భంలో టైటిల్ మారినంత మాత్రాన పెద్దగా కలిగే నష్టమేమి లేదు.

మరి భారీ అంచనాలతో, వివాదాలతో అన్ని అడ్డంకులు దాటుకొని ఈరోజు విడుదలైన గద్దలకొండ గణేశ్  సినిమా ఎలా ఉంది? మొన్నటి వరకు లవర్ బాయ్‌గా కనిపించిన హీరో వరుణ్ తేజ్, పూర్తి భిన్నమైన విలనీ లుక్‌లో కనిపించడం అయనకు ఏమైనా ప్లస్ అయిందా? ఈ సినిమా గురించి పబ్లిక్ ఏమనుకుంటున్నారు? రివ్యూ వర్స్ ఈ సినిమాను ఏమని తేల్చారు? ఒకసారి కంప్లీట్ రౌండప్ ఇక్కడ చూడొచ్చు.

కథ: ఒక డైరెక్టర్ విలన్ లక్షణాలుండే వ్యక్తిని హీరోగా చూపిస్తూ సినిమా తీయాలనుకుంటాడు, కథ తయారు చేసుకోవడం కోసం గద్దలకొండ గణేశ్ అనబడే ఒక రౌడీ క్యారెక్టర్ ను ఫాలో అవుతాడు. ఇక ఆయన లైఫ్ స్టోరీనే ఈ సినిమా కథ. ఈ కథకు వివిధ మీడియా సంస్థలు, సినీవిమర్శకులు ఇచ్చిన రివ్యూలు ఈ విధంగా ఉన్నాయి.

ముచ్చట రివ్యూ: ముచ్చట వెబ్ సైట్ 'గద్దలకొండ గణేశ్' ను ఒక యావరేజ్ సినిమాగా పేర్కొంది. జిగర్తాండా సినిమాను ఉన్నది ఉన్నట్లు రీమేక్ చేయకుండా డైరెక్టర్ హరీశ్ శంకర్ తనదైన ప్రయోగాలు చేయడంతో సినిమాను కొద్దిగా చెడగొట్టినట్లు చేయడమే కాకుండా సినిమా డ్యూరేషన్ కూడా పెరిగినట్లు విమర్శకుడు ప్రస్తావించారు. సినిమా పూర్తిగా హీరో వరుణ్ తేజ్ పైనే ఫోకస్ చేశారని, హీరోయిన్లకు పెద్దగా ప్రాముఖ్యత లేదని పేర్కొన్నారు. ఇక కొత్త లుక్ లో వరుణ్ తన వరకు తాను బాగానే చేశాడని పేర్కొన్న రివ్యూవర్ మొత్తానికి సినిమా హిట్ మాత్రం అనిపించుకోదని, యావరేజ్ గా నిలుస్తుందని చెప్పారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా రివ్యూ: ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలలో అచ్ఛం 'జిగర్తాండా' ను దించేశారు. సినిమా కథ సాగుతున్న కొద్దీ డైరెక్టర్ హరీశ్ శంకర్ అసలు స్టోరీ కాకుండా తన సొంత కథను నడిపించారని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చాలా వరకు సినిమా బాగానే అనిపించినా, కామెడీ సన్నివేశాలు మాత్రం అతికించినట్లు ఉన్నాయని TOI రివ్యూవర్ పేర్కొన్నారు. సినిమా బాగుందంటూనే సినిమాలో కొత్తగా ఏమి లేదని చెప్తున్నారు. సినిమాలో ఏదో మిస్ అయినట్లు పేర్కొన్నారు. ఫైనల్ గా ఇంకాస్త బాగా తీసుంటే హిట్ వచ్చేదని రివ్యూని ముగించారు.

వన్ ఇండియా రివ్యూ: వన్ ఇండియా కూడా ఫస్ట్ హాఫ్ బాగుందని పేర్కొంది, సెకండాఫ్ సాగదీసినట్లు ఉందని రివ్యూవర్ పేర్కొన్నారు. సెకండాఫ్ 20 నిమిషాల సినిమాను ఎడిట్ చేస్తే ఇంకా బాగుండేదని రివ్యూవర్ పేర్కొన్నారు. అయితే సినిమాలో కొత్తగా ఏం లేకపోయినా సినిమా మరీ అంత చెత్తగా లేదని తెలిపారు. సినిమాను కథ పరంగా చూడకుండా, నటీనటుల పెర్ఫార్మెన్స్ పరంగా చూసే చిత్రమని అభిప్రాయపడ్డారు. పక్కా మాస్ ప్రేక్షకులకు గద్దలకొండ గణేశ్ మంచి వినోదం రివ్యూవర్ పేర్కొన్నాడు.

సాక్షి రివ్యూ:  సాక్షిలో గద్దలకొండ గణేశ్ కు మంచి మార్కులు పడ్డాయి. సినిమా ఆద్యంతం ఆకట్టుకొందని రివ్యూవర్ పేర్కొన్నారు. సినిమాకు ప్రధాన బలం కథ అని తేల్చిన సాక్షి రివ్యూవర్ తమిళంలో హిట్ అయిన జిగర్తాండ లాగే తెలుగులో గద్దలకొండ గణేశ్ హిట్ అని పేర్కొన్నారు.

ఈనాడు రివ్యూ: ఈనాడు కూడా 'గద్దలకొండ గణేశ్' బాగుందని రివ్యూ ఇచ్చింది. కథలో అవసరమైనచోట మార్పులు చేశారని పేర్కొంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా డైరెక్టర్ హరీశ్ శంకర్ సినిమాను చాలా బాగా తెరకెక్కించారని ఈనాడు రివ్యూవర్ ప్రశంసించారు. నటీనటుల నటన, డైలాగ్స్ చాలా బాగున్నాయని ఈనాడు పేర్కొంది.

ఇక పబ్లిక్ టాక్ విషయానికి వస్తే మెగా అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ అని ట్యాగ్ ఇచ్చారు. మిగతా ప్రేక్షకులు పర్వాలేదని, యాక్టర్స్ బాగా చేశారని, డైలాగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుందని చెప్తున్నారు. అయితే అందరి నుంచి వచ్చే సమాధానం సినిమా సెకండాఫ్ నిడివి కొంచెం తగ్గిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నారు.

ఇక మొత్తానికి ఈ పబ్లిక్ టాక్స్ , క్రిటిక్స్ రాసిన ఈ రివ్యూలు, వారు ఇచ్చిన రేటింగ్స్ అన్నీ క్రోడికరిస్తే "గద్దలకొండ గణేశ్" సినిమా హిట్టా, ఫట్టా అని పక్కనపెడితే వినోదాత్మకంగా అయితే ఉంటుందని చెప్పవచ్చు.