తెలుగులో మనం బాహుబలిని చూశాం, అదే తరహాలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) కథానాయకుడిగా ఒక చారిత్రాత్మక చిత్రం 'మరక్కార్- అరేబియా సముద్ర సింహం' ( Marakkar - Lion of the Arabian sea) రూపొందించబడింది. దీనిని దాదాపు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఇప్పటివరకు మలయాళ చిత్ర పరిశ్రమలో ఇదే అత్యంత ఖరీదైన చిత్రంగా చెప్పబడుతుంది. అంతకుముందు ఏ సినిమా మలయాళంలో ఇంత బడ్జెట్‌లో తెరకెక్కించలేదు.
ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వివిధ భాషలకు చెందిన ప్రతిష్టాత్మకమైన స్టార్ తారాగణం ఉంది. మోహన్ లాల్, మంజు వారియర్, కీర్తి సురేష్ (Keerthy Suresh), సునీల్ శెట్టి, అర్జున్ సర్జ తదితరులు ఈ చిత్రంలో నటించారు. మరికొన్ని రోజుల్లో మార్చి 26న మరక్కార్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ భారతదేశంలోని పలు ప్రధాన భాషలలో విడుదలైంది. ఈ చిత్రం మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు.
Watch Marakkar Telugu Trailer:
వీఎఫ్‌ఎక్స్ విభాగంలో భారతీయ చిత్ర పరిశ్రమ చాలా పురోగతి సాధించిందని మరక్కార్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. వీడియోలో కనిపించిన దృశ్యాలు ఎంతో రమ్యంగా ఉన్నాయి. తన రాజ్యంలోకి విదేశీయులు చొరబడకుండా కుంజాలీ చేసే పోరాటలు, భారీ యుద్ధ సన్నివేశాలు, మోహన్ లాల్ నటన, ఇతర తారాగణం అభినయం చూస్తే ఈ సినిమా చూసే వారికి కనుల విందుగా అనిపించే అద్భుత దృశ్య కావ్యం చూస్తున్న అనుభూతి కలుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అది ఈ చిన్న ట్రైలర్ చూస్తేనే స్పష్టంగా తెలుస్తుంది.
మరక్కార్ కథ విషయానికి వస్తే 'కుంజాలీ' అని పిలువబడే ఒక మర్మమైన వ్యక్తి చుట్టూ తిరుగుతున్నట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఎవరికీ కనిపించని ఓ అదృశ్య శక్తి లాగా ప్రజల కష్టాలను తీరుస్తూ తన రాజ్యాన్ని కాపాడుకునే ఓ శక్తిలా, తన అడవి లాంటి రాజ్యానికి ఒక సింహంలా పాలించే ఓ రాజు కథగా మరక్కార్ కథ ఉన్నట్లు అంచనా వేయొచ్చు.