Sivasankar Master No More: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ జీవిత విశేషాలు ఇవే...
Sivasankar Master (Image: Twitter)

Sivasankar Master: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కరోనాతో కన్నుమూశారు. కరోనా తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల మాస్టర్‌ను వెంటిలేటర్‌పై పెట్టి వైద్యులు చికిత్సను అందించారు. ఆయనకు కొందరు సినీ ప్రముఖులు ఆర్థికంగా సాయం కూడా చేశారు. అయినా మాస్టర్ కరోనాతో పోరాడలేక వెనుదిరిగారు. ఆసుపత్రిలో చేర్చే సమయానికే శివశంకర్ మాస్టర్‌కు 75శాతం ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆయన ఇన్ని రోజులు ఎమర్జెన్సీ వార్డులోనే ఉన్నారు. ఆయనతో పాటు భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కళాకారులు కళామ తల్లికి తమ సేవలు అందించారు. అలాంటి వారిలో క్లాసికల్ డ్యాన్స్ మాస్టర్ గా శివ శంకర్ మాస్టర్ ఎంతో గొప్ప పేరు సంపాదించారు. శివశంకర్‌ మాస్టర్‌ 1948 డిసెంబరు 7న చెన్నైలో జన్మించారు. కల్యాణ సుందర్‌, కోమల అమ్మాళ్‌ తల్లిదండ్రులు. తండ్రి కొత్వాల్‌ చావిడిలో హోల్‌సేల్‌ పండ్ల వ్యాపారం చేసేవారు. చిన్నతనంలో ఆయనకు వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ తర్వాత నెల రోజుల పాటు జ్వరం. ఎంతమంది డాక్టర్లను సంప్రదించినా నయం కాలేదు.. అదృష్టం కొద్ది ఆయనకు విదేశాల్లో డాక్టర్‌గా పనిచేసి మద్రాసు వచ్చిన నరసింహ అయ్యర్‌ చికిత్స చేసి నయం చేశారు. దాదాపు ఎనిమిదేళ్లపాటు శివ శంకర్‌ పడుకునే ఉన్నారు.

శివ శంకర్ మాస్టర్ కి చిన్న తనం నుంచే డ్యాన్స్ పై మక్కువతో తనంత తానే డ్యాన్స్‌ నేర్చుకుని, 16ఏళ్లు వచ్చేసరికి ట్రూప్‌ల వెంట వెళ్లి డ్యాన్సు చేయడం మొదలు పెట్టారు. శివ శంకర్ మాస్టర్ తండ్రి సైతం కొడుకు ఇష్టానికి వ్యతిరేకించకుండా ఎంతో ప్రోత్సహించారు. చదువుకోకుండా ఇలా చేస్తున్నాడని ఇంట్లో అందరూ కోపగించుకునే వారు.. కానీ శివ శంకర్ మాస్టర్ మాత్రం తన మనసులో ఉన్నదే తాను చేస్తానని అందరినీ మెప్పించి మద్రాసులో నటరాజ శకుంతల అనే నృత్యకారుడి వద్ద శివశంకర్‌ నృత్యం నేర్చుకున్నారు.

ఆడవాళ్లు ఎలాంటి హావభావాలు పలికిస్తారు? వాటిని మగవాళ్లు ఎలా పలికిస్తారు? వంటి ఎన్నో విషయాలు పదేళ్లు శిష్యరికం చేసి నేర్చుకున్నవే. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో సలీమ్‌ దగ్గర సహాయకుడిగా చేరి కెరీర్‌ను మొదలు పెట్టిన శివ శంకర్‌ మాస్టర్‌ వందల చిత్రాలకు నృత్యాలు సమకూర్చారు. అలా ఆయన అంచెలంచెలుగా పైకి వస్తూ.. సిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.10 భాషలకు పైగానే కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో పలు చిత్రాలకు ఆయన నృత్యరీతులు సమకూర్చారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 800 చిత్రాలకుపైగానే డ్యాన్స్‌ మాస్టర్‌గా పనిచేశారు. పలుభాషల్లో ఉత్తమ అవార్డులు తీసుకున్నారు.