భారతదేశం గర్వించ దగ్గ దర్శకులలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మొదటి స్థానంలో ఉంటారు. ఎందుకంటే ఆయన అత్యంత వివాదరహితుడు, ఆయన సినిమాలు ఎన్నో సున్నిమైన అంశాలను స్పృశిస్తూ ఉంటాయి. అవి చూసే చూసే ప్రేక్షకులకు ఒక రకమైన పులకరింపు కలుగుతుంది. వర్మ తీసే ప్రతీ చిత్రం ఒక కళాఖండం. కాకపోతే చాలా వరకు ఆయన కళాఖండాలు టీజర్లు, పాటలకే పరిమితమవడం కొంత అసంతృప్తిని కలిగించే విషయం. ఈ మధ్యకాలంలో ఆయన మొదలు పెట్టిన మరో కళాఖండం పేరు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' (Kamma Rajyam Lo Kadapa Reddlu). కొన్నిరోజుల కిందట కమ్మరాజ్యంలో కడప రెడ్లు టైటిల్ సాంగ్ ను విడుదల చేశారు. అయితే అంత కమ్మనైన సినిమా టైటిల్ పెట్టి విడుదల చేసిన టైటిల్ సాంగ్ లో రాజకీయ వాసన తప్ప, ఎక్కడా కులం వాసన లేదని చాలా మంది బాధపడ్డారు. ఇప్పుడు వారందరి బాధలను తీరుస్తూ అన్ని కులాలను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కులాలను ప్రస్తావిస్తూ 'క్యాస్ట్ ఫీలింగ్' పాటను విడుదల చేశారు. ముఖ్యంగా ఈ పాటను తనే స్వయంగా పాడి, వివిధ కులాలతో విడిపోయి కలిసి ఉన్న ప్రజలను తన గానామృతంతో రంజింపజేశారు.
ఆ హాయి గొల్పే పాట ఇదే..!
రాంగోపాల్ వర్మను సంచలన దర్శకుడు, వివాదాస్పద దర్శకుడిగా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఒకసారి చేస్తేనే ఏదైనా సంచలనం, ఎప్పుడూ చేస్తే అది సాధారణం. కాబట్టి ఆయన గురించి పైన కొంత ప్రత్యేక వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఇకపోతే ఏపీ రాజకీయాల నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఏపీలో ఎక్కువగా కుల రాజకీయాలు జరుగుతాయనేది ఒక ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కులాలను ప్రస్తావిస్తూ తన సినిమాలోని రెండో పాటను విడుదల చేశారు. వాస్తవానికి ఈ పాట కొంతవరకు ఆలోచింపజేసే విధంగా ఉన్నప్పటికీ, కులాలపై ఒకవైపు వాదననే వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. ఈ పాటను తానే స్వయంగా పాడటం కాకుండా వేరే ఏదైన సింగర్ తో పాడించి ఉంటే వినసొంపుగా ఉండేది.