తెలుగు సినిమా రాజసాన్ని నిలబెట్టిన దర్శక ధీశాలి ఎస్.ఎస్ రాజమౌళి (SS Rajamouli). ఓ బండరాయిని అద్భుత కళాఖండంగా తీర్చిదిద్దే ఒక గొప్ప శిల్పి లాగా తాను తీసే ప్రతీ చిత్రం ఎంతో జాగ్రత్తగా, అద్భుతంగా చెక్కుతాడు మన 'టాలీవుడ్' జక్కన్న. అందుకే ఆయన సినిమాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఖండాతర ఖ్యాతి గడించాయి, భారతీయ సినిమా రంగాన్ని సగర్వంగా తలెత్తుకునేలా చేశాయి. నేడు రాజమౌళి పుట్టినరోజు. ఈ సందర్భంగా అపజయం ఎరగని ఆయన సినీ కెరియర్ లో టాప్ రేటెడ్ చిత్రాల గురించి మరోసారి ప్రస్తావించుకుందాం.
2001 లో స్టూడెంట్ నెం .1 చిత్రంతో మెగాఫోన్ పట్టుకున్న రాజమౌళి, ఆ తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి చిత్రాలను రూపొందించారు. ఇందులో ఏదీ కూడా ఫ్లాప్ అవ్వలేదు, అందుకే టాలీవుడ్ లో ఆయన డైరెక్టర్ నెం.1, అయితే ఇందులో టాప్ రేటెడ్ మూవీస్ ఇవే.
స్టూడెంట్ నెం 1 - ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన తెలుగు చిత్రం స్టూడెంట్ నెం 1 తో జూనియర్ ఎన్టీఆర్, గజాలా నటించారు. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.
ఛత్రపతి - ఎస్.ఎస్.రాజమౌళి ప్రభాస్ చేసిన మొదటి చిత్రం ఇది. అవుట్ అండ్ అవుట్ హైఓల్టేజ్ యాక్షన్ చిత్రం, 2002 లో రిలీజైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రభాస్ ను ఒక మాస్ హీరోగా ఎలివేట్ చేసింది.
విక్రమార్కుడు - 2006 లో రవితేజ, అనుష్క శెట్టి నటించిన విక్రమార్కుడు చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ అయి అక్కడ కూడా సూపర్ హిట్ అయింది.
మగధీర - రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ మరియు శ్రీహరి నటించిన ఈ తెలుగు చిత్రం ఎస్.ఎస్.రాజమౌళి డైరెక్ట్ చేసిన అత్యంత మనోహరమైన కథలలో ఒకటి. సుమారు రూ .35 కోట్ల బడ్జెట్‌తో రూపొందించడిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ .200 కోట్లకు పైగా వసూలు చేసింది.
బాహుబలి - ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అతిపెద్ద హిట్. బాహుబలి: ది బిగినింగ్ (2015) మరియు బాహుబలి: ది కన్‌క్లూజన్ (2017) చిత్రాలు అయనను గ్లోబల్ డైరెక్టర్ గా మార్చివేశాయి. నేటికి కూడా ఏ పెద్ద సినిమా హిట్ అయినా దానిని బాహుబలితో పోలుస్తారు. ఈ సినిమాతో ప్రభాస్ స్థాయి భారీగా పెరిగిపోయింది. రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్య కృష్ణన్, సత్యరాజ్, తమన్నా, నాసర్, రోహిణి లాంటి స్టార్లు రేంజ్ కూడా ఇండియా లెవెల్లో పెరిగిపోయింది.
ప్రస్తుతం రాజమౌళి విప్లవ వీరులు స్వాతంత్య్ర సమరయోధులైన అల్లూరి సీతారామ రాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా 'RRR' సినిమాను చెక్కడంలో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్రకథానాయకులు ఇందులో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం అందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కూడా 'బాహుబలి' హిట్ అవ్వాలని ఆకాంక్షిస్తూ, మరోసారి రాజమౌళికి జన్మదిన శుభాకాంక్షలు.